విశాఖపట్నం, మే 12 (న్యూస్‌టైమ్): అందరి సహకారం.. సమిష్టి కృషితోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమవుతుందని సింహాచలం దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ అన్నారు. బుధవారం ఇక్కడి సింహగిరిపైన ఆనంద నిలయంలో అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ప్రమాణ స్వీకారం, బాధ్యతల అప్పగింత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ తొలుత ప్రత్యేక ఆహ్వానితులు అందరికీ అభినందనలు తెలియజేశారు. చందనోత్సవం పర్వదినానికి ముందు స్వామి ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం, ఉత్సవానికి ముందు బాధ్యతలు స్వీకరించడం అంతా అప్పన్న స్వామి కృపగా భావించాలన్నారు.

భవిష్యత్తులో అందరూ సమిష్టిగా కలిసి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేద్దామని ఈవో పిలుపునిచ్చారు. సింహాద్రి నాధుని ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, మేడిది మురళీకృష్ణ, యండమూరి విజయ, డి. మాణిక్యాలరావు ఎస్.ఎన్. రత్నంను ఘనంగా సత్కరించి ఈవో చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు మాట్లాడుతూ తాము పూర్తిస్థాయిలో స్వామివారి సేవకు అంకితం కానున్నట్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు అంతా కలిసి సింహాచలం అన్నదానానికి, గోసంరక్షణ పథకానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులు ఆలయ ఈవోకు ఇచ్చి త్వరలో మరిన్ని పధకాలకు తమవంతు విరాళాలు అందచేస్తామని చెప్పారు.

పూర్వ జన్మ సుకృతం: గంట్ల శ్రీనుబాబు…

సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం ఎంతో సంతోషం కలిగించిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ (వీజేఎఫ్) అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గతంలో తాను సింహాచలం దేవస్థానం చందనోత్సవం కమిటీ సభ్యునిగా, స్వామి వారి సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యుడిగా పలు మార్లు సేవలు అందించడం జరిగిందని, అంతే కాకుండా స్వామివారి మరో సోదరి శ్రీ సత్తమ్మతల్లి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా స్వామి ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం పూర్తి పూర్తిస్థాయిలో సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో కేకే రాఘవకుమార్, రమణమూర్తి, చిట్టి తదితరులు పాల్గొన్నారు.