అంతర్జాలంలో ఆధ్యాత్మికం

0
15 వీక్షకులు
టీటీడీ డిజిటల్ పబ్లికేషన్ల సమాహారం
  • అందుబాటులోకి టీటీడీ ఈ-ప‌బ్లికేష‌న్స్‌

  • 7 ప్రాంతీయ భాష‌ల్లో ఆధ్యాత్మిక పుస్త‌కాలు

  • రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌తాల సహా అనేకం

  • 6 భాష‌ల్లో ‘స‌ప్త‌గిరి’ మాస‌ప‌త్రిక కనువిందు

  • ఉచిత డౌన్‌లోడ్‌కు అవ‌కాశం కల్పించిన తితిదే

తిరుపతి, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): టీటీడీ తన ఈ-ప‌బ్లికేష‌న్స్ వెబ్‌సైట్‌ను నూత‌న హంగుల‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. రామాయ‌ణ‌, భార‌త, భాగ‌వ‌తాలు, శ్రీవారి వైభవం, ఆధ్యాత్మిక, ధార్మిక, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన 781 పుస్తకాలను 7 భాష‌ల్లో అందుబాటులో ఉంచింది. 2015, మార్చి 21న టిటిడి వెబ్‌సైట్‌లో ఇ-పబ్లికేషన్స్‌ను ప్రారంభించారు. ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ బసంత్ కుమార్ ఆదేశంతో వెబ్‌సైట్‌ను మరింతగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ప్రచురణలు, ఐటీ విభాగాల అధికారులు రంగంలోకి దిగారు. టిటిడి ఆర్థిక‌ సాయంతో ముద్రించిన అన్ని పుస్త‌కాల్లోని కంటెంట్‌కు సంబంధించిన‌ స‌మీక్ష చేశారు. అనంత‌రం కొత్త డిజైన్‌తో, భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దారు. ఇందులో వివిధ ర‌కాల సాహిత్యం పుస్త‌కాలు, ర‌చ‌యిత‌ల పేర్ల‌తో పుస్త‌కాల‌ను ఎంచుకోవ‌డానికి వీలు క‌ల్పించారు. స్పెష‌ల్ బుక్స్ కేట‌గిరీలో వేదాలు, ఉప‌నిష‌త్తులకు సంబంధించిన అరుదైన పుస్తకాలు అందుబాటు లోకి తెచ్చారు.

ప్రస్తుతానికి ఈ వెబ్‌సైట్‌లో 781 పుస్త‌కాలున్నాయి. తెలుగులో 492, సంస్కృతం-75, ఇంగ్లీషు-122, కన్నడం-2, హిందీ-74, తమిళం-14, బంజారా-2 గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1. వేదసాహిత్యం 2. పురాణ ఇతిహాస సాహిత్యం, 3. కావ్యప్రబంధ సాహిత్యం, 4. సంకీర్త‌న సాహిత్యం, 5. శ‌త‌క బాల సాహిత్యం, 6. ఆల‌య సాహిత్యం, 7. సాధార‌ణ‌ సాహిత్యం, విభాగాల్లో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ద‌శ‌ల‌వారీగా మ‌రిన్ని పుస్త‌కాల‌ను ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక పాత సంచిక‌లు కూడా…

టీటీడీ అధికారిక మాసపత్రిక ‘సప్తగిరి’… ఆరు భాషల్లో

టిటిడి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీషు, సంస్కృత భాష‌ల్లో ముద్రిస్తున్న స‌ప్త‌గిరి మాస‌ప‌త్రికను పాత సంచికలతో సహా ఉచితంగా చదువుకోవడం కోసం అందుబాటులో ఉంచారు. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో చందా చెల్లించి స‌ప్త‌గిరి మాస‌ప‌త్రికను బుక్ చేసుకోవ‌చ్చు.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి…

ఈప్రచురణలు పొందుపర్చిన వెబ్‌సైట్ హోం పేజీ

www.tirumala.org వెబ్‌సైట్‌లో ఈ-పబ్లికేషన్స్‌ లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా లేదా ebooks.tirumala.org లింక్‌ ద్వారా భక్తులు పుస్త‌కాల‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here