నూతన ఉత్పత్తులను తీర్చిదిద్దండి

79
సి.పి. గుర్నానీని సత్కరిస్తున్న ఏయూ వీసీ ప్రసాదరెడ్డి
  • టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ పిలుపు

  • సాంకేతికతను ఉపయుక్తంగా నిలుపుకోవాలని హితవు

  • విశాఖ పర్యటనలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డితో ఆత్మీయ భేటీ

విశాఖపట్నం, డిసెంబర్ 13 (న్యూస్‌టైమ్): నూతన ఆవిష్కరణలు, ఉత్పత్తులను తీర్చిదిద్దే దిశగా విశ్వవిద్యాలయాలు పనిచేయాలని టెక్‌ మహేంద్ర సిఈఓ సి.పి గుర్నానీ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన ఏయూకు విచ్చేసారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో మద్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గుర్నానీ మాట్లాడుతూ సమస్యను నిర్వచించడం, పరిష్కరించడం నేడు ఎంతో అవసరమన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ ఒక ప్రభావవంతమైన టూల్‌ అని దీనిని వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోందన్నారు. స్మార్ట్‌ లైటింగ్‌, స్మార్ట్‌ అగ్రికల్చర్‌ వంటి విభిన్న అంశాలతో పనిచేయవచ్చునన్నారు.

ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పొడవైన తీర ప్రాంతం ఉందని, దీనిని ఆర్ధిక వనరుగా, రాష్ట్రానికి ఉపయుక్తంగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారులకు ఉపయుక్తంగా పరిశోధనలు జరిపి, మత్స్యసంపదను ఒడిసిపట్టే దిశగా సహకారం అందించాలన్నారు. ఏయూలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నెలకొల్పుతామని, దీనికి సహకారం అందిచాలని గుర్నానీని కోరారు.

వీసీ ప్రతిపాదనకు గుర్నానీ సానుకూలంగా స్పందించారు. వర్సిటీ పరంగా తనకు ఎటువంటి ప్రతిపాదన పంపినా పూర్తిస్థాయిలో సహకారాన్ని అందిస్థామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం సభ్యులు, టెక్‌ మహేంద్ర సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. వర్సిటీ తరపున గుర్నానీని వీసీ ప్రసాద రెడ్డి సత్కరించారు.