Home Devotional & Culture శ్రీవాణి ట్రస్టు టికెట్ల వ్యవహారంపై దుమారం

శ్రీవాణి ట్రస్టు టికెట్ల వ్యవహారంపై దుమారం

0
322 Views

తిరుపతి, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): శ్రీవాణి ట్రస్ట్ నుంచి 11 వేలు టిక్కెట్ కొన్నవారికి రూ.300 క్యూలో పంపారన్న విమర్శల నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేగింది. శ్రీవారి దర్శనం టికెట్లు సినిమా బ్లాక్ టిక్కెట్లలా అమ్మడం సిగ్గు చేటని ప్రతిపక్ష తెలుగుదేశం అభిప్రాయపడింది.

మరోవైపు, శ్రీవారి ఆలయంలో శ్రీవాణి ట్రస్ట్ భక్తుల ఆందోళనపై ఏఎస్పీ మునిరామయ్య స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్టు కలిగిన భక్తులు లఘు దర్శనంలో స్వామి వారి దర్శనానికి వెళ్లాలని సూచించారు. సిబ్బందికి అవగాహన లేకపోవడంతో ఇలా చేశారని మునిరామయ్య పేర్కొన్నారు. కాగా, శనివారం ఉదయం శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా తిరుమల, తిరుపతి దేవస్థానం సిబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు.