ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ఎంచుకున్న విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్-రుషికొండ రహదారి

రాజధాని తరలింపుపై స్టేటస్‌కోను పొడిగించిన హైకోర్టు…

అమరావతి, ఆగస్టు 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు నిర్ణయాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులను ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టేటస్‌కో విధించిన ఏపీ హైకోర్టు తాజాగా తన ఉత్తర్వులను ఈనెల 27 వరకూ పొడిగించింది.

రాజధాని తరలింపుపై ఉన్న స్టేటస్ కో ఉత్తర్వులు ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు అంగీకరించలేదు. అంతే కాదు, స్టేటస్ కో గడువు నేటితో పూర్తి కానుండటంతో ఈనెల 27 వరకూ పొడిగిస్తూ మరోమారు ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ రాజధానికి సంబంధించిన పలు వ్యాజ్యాలపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు గెజిట్‌ నోటిఫికేషన్‌, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, హైకోర్టు శాశ్వత భవనాల నిర్మాణం తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజధాని తరలింపుపై నేటి వరకూ వరకు ఉన్న స్టేటస్ ‌కో ఉత్తర్వులను ఈనెల 27వరకు హైకోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ఈ కేసు విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. స్టేటస్‌‌కోను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

అమరావతి రాజధాని ఊహాచిత్రం

హైకోర్టు తీర్పుతో విశాఖలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చేయాలన్న జగన్ కోరిక ప్రస్తుతానికి తీరేలా లేదు. వాస్తవానికి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తూ ప్రభుత్వం చట్టం కూడా చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖే. కానీ దీనిపై హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఇవ్వడం వల్ల రాజధాని తరలింపు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. మొదట్లో ఈనెల 14 వరకే బ్రేక్ పడింది అనుకుంటే ఇప్పుడు ఆ స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27 వరకూ పెంచారు. పాపం జగన్ ఏ ముహూర్తాన విశాఖను రాజధాని చేయాలనుకున్నారో కానీ అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.

దీంతో ఈనెల 27 వరకూ రాజధాని తరలింపు కుదరదు. దీనికితోడు ఈ కేసులో ఇప్పుడు అనేక మంది ఇంప్లీడ్ అవుతున్నారు. కొత్త కొత్త కేసులు వేస్తున్నారు. అందువల్ల వీటి విచారణ ఓ కొలిక్కి వచ్చేవరకూ విశాఖను రాజధానిగా చేయడం జగన్‌కు సాధ్యం కాకపోవచ్చు.