విశాఖపట్నం, అక్టోబర్ 24 (న్యూస్‌టైమ్): అనంతగిరి మండలం, గుమ్మకోట పంచాయతీలోని శంఖుపర్తి గ్రామంలో ఇటీవల అంతుపట్టని వ్యాధి ఒకటి వ్యాపించడంతో ఆ గ్రామంలోని ప్రజలు ఇప్పటివరకు ఒక నెల రోజులలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉన్నాయంటే కాళ్ళు, మొహం వాపు వచ్చి మరుసటి రోజునే అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఇంతవరకు ఆ గ్రామంలోని ప్రజలకు ఎలాంటి వైద్య సహాయం అందలేదు. ఆ గ్రామంలో ఇంకా మరో పదిమంది వరకు ఆ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.

ఆ గ్రామంలో మొత్తం 22 కుటుంబాలలో 100 మంది వరకు నివసిస్తున్నారు. అదేవిధంగా అక్కడికి దగ్గర్లో ఉన్న ఎన్ఆర్ పురం పంచాయతీ కరకవలస గ్రామంలో కూడా ఒక పది మంది అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నారు. ఆ గ్రామాలు ఇప్పటికి కూడా కనీస అవసరాలైన రవాణా, తాగునీటి సౌకర్యాలకు నోచుకోలేదని, విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎం. రవీంద్ర ఆదేశానుసారం జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు పూజారి ఆశీర్వాదం తక్షణమే ఆ గ్రామానికి వైద్య సదుపాయాన్ని అందించి అక్కడ ప్రజల్ని కాపాడాలని ఒక ప్రకటనలో కోరారు.