దళితులపై దాడుల నియంత్రణకు పటిష్ట చర్యలు

74
  • ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదేశాలు

చిత్తూరు, ఆగస్టు 1 (న్యూస్‌టైమ్): అట్రాసిటీ కేసులు, దళితులపై జరిగే దాడులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు అండగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు మందిరంలో కె.నారాయణస్వామి విలేకరులతో మాట్లాడుతూ అట్రాసిటీ కేసులపై, దళితులపై జరిగే దాడులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు.

ప్రధానంగా దళిత సంఘాలు సంఘటితంగా ఉండాలని, అన్యాయం జరిగితే కలసి పోరాడాలని నిజమైన కేసులు దళితులు నమోదు చేయాలని తెలిపారు. కలెక్టర్, ఎస్పి దళితులపై జరిగే దాడులకు సంబంధించి నెలకు 2 సార్లైన సమావేశాలను నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వచ్చే ఉగాది నాటికి ఇండ్ల స్థలాలకు సంబంధించి పట్టాల పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళలకు కానుకగా మద్యపాన నిషేధాన్ని దశలవారీగా చేస్తారని తెలిపారు.

నాటు సారాను పూర్తిగా నియంత్రిస్తామని తద్వారా ఆర్థిక నేరాలు తగ్గుతాయని తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడ్డెప్ప మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ఇద్దరు మంత్రులు సమీక్ష నిర్వహించడం సంతోషం అని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి శాసన సభ్యులు హాజరై సమావేశంలో సమస్యలపై చర్చించడం ఇదే ప్రథమం అని, దళితులపై జరుగుతున్న దాడులు ఇక పై ఉండబోవని దళితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల వెన్నంటి ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో పని చేస్తున్న కలెక్టర్, ఎస్పీలపై విశ్వాసం కలదని జిల్లాలో లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు జరుగుతుందని, దళితులకు ఏ అన్యాయం జరిగినా మేమంతా ముందుంటామని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ ఈ రోజు నవరత్నాలు కార్యక్రమం దాని అమలుపై మంత్రులు సమీక్షించడం జరిగిందని, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జిల్లా స్థాయిలో ప్రతి 3 నెలలకు ఒక సారి నిర్వహిస్తామని, డివిజన్ స్థాయిలో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసన సభ్యులు చెప్పిన అంశాలపై రీ ఎంక్వయిరీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పూతలపట్టు, చిత్తూరు శాసన సభ్యులు ఎం.ఎస్ బాబు, ఎ.శ్రీనివాసులు, మదనపల్లె సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, ట్రైనీ కలెక్టర్ పృథ్వీ తేజ్ పాల్గొన్నారు.