కరోనా నిరోధానికి పకడ్బంధీ చర్యలు

0
18 వీక్షకులు
జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్‌తో కలిసి కరోనా తాజా పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు, ఏప్రిల్ 18 (న్యూస్‌టైమ్): ప్రకాశం జిల్లా యంత్రాంగం కరోనా వైరస్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం ఉదయం ప్రకాశం భవనంలోని స్పందన భవనంలో వైద్య అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, క్వారంటైన్ కేంద్రాల పర్యవేక్షకులు, జిల్లా అధికారులతో కరోనా వైరస్ నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వుందన్నారు. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని మొదట జిల్లాలో గుర్తించడంలో జిల్లా కలెక్టర్, జె.సి., ఎస్.పి.ల కృషికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 44 కరోనా పాజిటివ్ కేసులు వున్నాయన్నారు. జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా వున్నాయని జాగ్రత్తగా వుండాలని ముఖ్యమంత్రి తెలిపారని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో మానిటరింగ్ చేస్తూ వారిని క్వారంటైన్‌లో పెట్టి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడంలో జిల్లా అధికారులు బాగా పనిచేశారని వారికి అభినందనాలు తెలిపారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ముస్లింల పట్ల సానుకూలంగా స్పందించాలని వారిని గౌరవంగా చూడాలని మంత్రి తెలిపారు. ఇటీవల ఒక ప్రైవేట్ హాస్పిటల్ వారు ముస్లిం గర్భిణీ స్త్రీని హాస్పిటల్‌లో జాయిన్ చేసుకోకపోవడం మంచి పద్ధతికాదని అందరం భారతీయులం అందరూ సమానమేనని మంత్రి స్పష్టం చేశారు. విపత్కర పరిస్థితులలో మతతత్వం బయటకు రాకూడదని తెలిపారు. జిల్లాలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రానైట్ క్వారీలలో పనిచేసే కార్మికులకు క్వారీ యాజమాన్యాలు భోజన వసతి కల్పించేలా చుడాలన్నారు.

రెడ్ జోన్ పరిధిలో శానిటేషన్ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఇస్లాం పేట నుండి కొందరు బిలాల్ నగరకు వెళ్తునట్లు తమ దృష్టికి వచ్చిందని వారిని కట్టడి చేయాలని మంత్రి పోలీస్ అధికారులను ఆదేశించారు. జలవనరుల శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి 6 టి.ఎమ్.సి.ల నీరు అవసరమని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మనిషికి మూడు మాస్కులు చొప్పున త్వరలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రెడ్జోన్లో వున్న కుటుంబాలకు అన్ని రకాల నిత్యవసర సరుకులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కంటైన్‌మెంట్ జోన్‌తో పాటు అన్ని చోట్ల పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్నారు.

శానిటేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించరాదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా వైరస్ కట్టడిపై ప్రజలను జాగ్రత్తగా వుండేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకొని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై వుందని మంత్రి అన్నారు. అధికారులు ప్రజలకు తమవంతు సేవలందిస్తూ కరోనా బారిన పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు, పోలీస్లు, వాలంటీర్లు కష్టపడి చేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. జిల్లాలో కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కమ్యూనిటి సర్వేలెన్స్ పకడ్బందీగా చేపడున్నామని, వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేపట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ వివరించారు.

కోవిడ్ లక్షణాలు కల్గిన వారిని క్వారంటైన్‌లో వుంచడం జరిగిందన్నారు. సీనియర్ సిటిజన్స్, హైరిస్క్ ఫాక్టర్ కల్గిన వారు, దీర్గకాలిక వ్యాధుతో బాధ పడున్న వారిని అబ్జర్వేషన్లో పెట్టామని, ఎ.ఎన్.ఎమ్.లద్వారా పర్యవేక్షణ చేపట్టామని కలెక్టర్ మంత్రి తెలిపారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా గుర్తించిన వారి రెసిడెన్స్ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ క్లస్టర్‌గా గుర్తించామన్నారు. హాట్‌స్పాట్‌గా గుర్తించి 300 మీటర్ల పరిధిలో గల ప్రాంతంలోని కుటుంబాలను ప్రతిరోజు హెల్త్ చెకప్ సర్వేలెన్స్‌తో పాటు కంట్రోల్ మెజర్ చేపట్టామన్నారు. హాట్‌స్పాట్‌లో గల కుటుంబాలకు నిత్యవసర సరుకులు డోర్ డెలివరీ ఇస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని మంత్రికి వివరించారు. ప్రతి కంటైన్‌మెంట్ జోన్‌కు ప్రత్యేక అధికారిని నియమిస్తూ కంటైన్‌మెంట్ జోన్లో ప్రొటోకాల్ మెజర్ పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నామన్నారు.

కరోనా వైరసకు సంబంధించి నమూనాల సేకరణ, వైద్యపరీక్షలు జరుగుతున్నాయని వాటిని పర్యవేక్షణకై టి.బి. కంట్రోల్ అధికారిని నోడల్ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. కరోనా వైరస్ నిర్థారణపై వివిధ రకాల టెస్టింగ్ పద్దతులు వచ్చాయని అన్నారు. వి.ఆర్.డి.ఎల్. పద్ధతి వుపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ట్రూనాట్ పరికరంకు ఇతర ఉపకరణాలు జోడించి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చని కలెక్టర్ మంత్రికి వివరించారు. క్లియా టెస్టింగ్ మెషిన్ ద్వారా ల్యాబ్‌లో రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసే సామర్థ్యం వుందన్నారు. ఈ క్లియా టెస్టింగ్ మెషిన్ జిల్లాకు త్వరలో రానున్నాయని కలెక్టర్ తెలిపారు. రాపిడ్ డయాగ్నస్టిక్ కిట్స్ త్వరలో జిల్లాకు రానున్నాయని, ఈ కిట్ల ద్వారా పి.హెచ్.సి.లలో వేలాది మందికి వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం వుందన్నారు.

వి.ఆర్.డి.ఎల్. పద్ధతిని కంటైన్‌మెంట్ జోన్లో చాలా సీరియస్‌గా వున్న కేసులు, ప్రైమరీ లక్షణాలకు సంబంధించిన వారిని వైద్య పరీక్షలు నిర్వహించుకునే అవకాశం వుందని అదే విధంగా ట్రూనాట్ మెషిన్ ద్వారా కంటైన్‌మెంట్ జోన్లో తేలికపాటి లక్షణాలు కల్గిన వారిని వైద్యపరీక్షలు చేసే అవకాశం వుందన్నారు. అదే విధంగా క్లియా టెస్టింగ్ కంటైన్‌మెంట్ జోన్‌లో బఫర్ జోన్ పెరిఫెరల్ అర్బన్ పరిధిలో వున్నవారిని వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అలాగే రాపిడ్ డయాగ్నస్టిక్ కిట్ ద్వారా పి.హెచ్.సి.ల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ మంత్రికి తెలిపారు.

హాస్పిటల్ ప్రిపేర్డ్ నెస్లో భాగంగా జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగితే తదనుగుణంగా వారిని తరలించడానికి
జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా వుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ రోగులు రెండు వందల మంది వున్నారని వారిని స్థానిక సామాజిక సాధికారిత భవనంలోకి తరలించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలలో సుమారు 4,500 పడకలు సంసిద్ధంగా వుంచామన్నారు. హాస్పిటల్స్‌లో తగినన్ని వెంటిలేటర్స్, ఆక్సిజన్ సరఫరా, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్‌ను సంసిద్ధం చేశామని మంత్రికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా అనుసరిస్తున్నామన్నారు. ఏప్రియల్ 20వ తేదీ నుండి కొన్ని రంగాలకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలకనుగుణంగా సడలింపులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రికి కలెక్టర్ వివరించారు. సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి. సిద్ధార్డ్ కౌశల్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టంగా పనిచేస్తున్నదని మంత్రికి తెలియజేశారు. జిల్లాలో వంద చెక్ పోస్టులు, 124 పికెటింగ్, 167
మొబైల్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీస్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా 3 వేల మందిని వయోలేషన్ కింద గుర్తించామని సుమారు రెండువందల మంది వాహనాలు సీజ్ చేయడం జరిగిందని, 10 వేలు (ఈ చలాన్స్) పెనాల్టీ కింద వసూలు జరిగిందని ఎస్.పి. మంత్రికి తెలియజేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో స్థానికుల మద్దతు అవసరం వుందని, ప్రస్తుతం గ్రామాలలో గ్రామ సెక్రటరీలు, గ్రామ రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తూన్నారని తెలిపారు. గుడ్లూరు, రావినూతలలో నమోదైన కరోనా వైరస్ కేసుల లింక్‌పై ప్రత్యేక దృష్టి సారించామన తెలిపారు.

ఎస్.ఆర్.సి. ల్యాబ్‌లేటరీ ప్రైవేట్ లిమిటెడ్, రాయచూర్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఐదువేల లీటర్ల శానిటేజర్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రికి అందజేశారు. రవాణ శాఖ ద్వారా జిల్లా అధికారుల డ్రైవర్లకు డ్రైవర్ ప్రొటెక్షన్ కిట్స్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులకు మంత్రి జిల్లా కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఆయుష్ శాఖ ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఆర్సనిక్ ఆల్బమ్ – 30 హోమియో మందును మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమీక్షా సమావేశంలో జె.సి. ఎస్. ఎన్మోహన్, జె.సి.-2 కె. నరేంద్ర ప్రసాద్, డి.ఆర్.ఓ. వి. వెంకట సుబ్బయ్య, జడ్.పి. సి.యి.ఓ. కైలాష్ గిరీశ్వర్, నియోజవర్గ ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here