కారోనా వ్యాప్తి నివారణకు కఠిన చర్యలు తప్పవు

71
  • విదేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యెక దృష్టి

  • నిత్యావసరాల సరఫరా సాఫీగా జరగాలి

  • జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ వెల్లడి

  • లాక్ డౌన్ పరిస్థితుల్ని అదుపులో ఉంచడంలో పోలీస్ కీలకం

  • రేషన్ కార్డు లేని వారికీ బియ్యం సరఫరా

  • అనాధలకు అన్నదానం చేయడానికి సిద్ధం

  • విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల

విజయనగరం, మార్చి 28 (న్యూస్‌టైమ్): జిల్లాలో కారోన వ్యాప్తి నివారించడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ తెలిపారు. జిల్లాలో టాస్క్‌ఫోర్సు కమిటీ‌లను వేయడంతోపాటు కరోనాపై ఇప్పటికే పారామెడికల్ సిబ్బందికి, అంగన్వాడీ, ఆశ, మహిళా సంఘాల సభ్యులకు శిక్షణలు పూర్తి చేశామని పేర్కొన్నారు. బ్యానర్లు, పోస్టర్లు హోర్డింగ్లు, టామ్ టామ్ ద్వారా గ్రామాలలో, పట్టణాలలో విస్త్రుతంగా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు. లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు సామజిక దురాన్ని పాటించేలా అన్ని చర్యలను తీసుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం స్థాయిలో కారోనాపై సమీక్షించి, ప్రజలలో ధైర్యాన్ని నింపాలని, ఎదుర్కోడానికి సన్నద్ధం చేయాలని ఆదేశించిన దృష్ట్యా శనివారం మున్సిపల్ కార్యాలయంలో విజయనగరం నియోజకవర్గానికి సంబంధించిన అధికారులతో కార్పొరేషన్ ప్రత్యేకాధికారి హోదాలో శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామితో కలసి కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జిల్లాకు విదేశాల నుండి 476 మంది వచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వ నివేదిక అందిందని, అందులో 145 మంది విజయనగరం నియోజక వర్గానికి చెందిన వారే ఉన్నారని, వారిలో 15 మంది వివరాలు తెలియలేదని మిగిలిన 130 మందిని క్వారెంటైన్‌లో ఉంచడం జరిగిందని అన్నారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతోందని అన్నారు. వీరిలో 7 రోజుల లోపు ఉన్నవారు 18 మంది కాగా, 7 నుండి 14 రోజుల లోపు వారు 40 మంది ఉన్నారని, క్వరెంటైన్‌లో ఉన్న వీరిలో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి ఒక వైద్యున్ని నియమిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా హై రిస్క్ ఉన్న దేశాలనుండి వచ్చిన వారిని నిర్బంధంగా ఉంచాలని, ఇంకొకరికి వ్యాపించకుండా కట్టడి చేయాలనీ అన్నారు. మందు లేదు కనుక కఠినంగ ఉండక తప్పదన్నారు.

లాక్‌డౌన్ ఉన్నందున నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా చూడాలని అందుకోసం శాఖల మధ్య సమన్వయంతో పాటు పోలీస్ అధికారుల సహకారం చాలా అవసరమని పేర్కొన్నారు. టోకు వ్యాపారులు, మామిడి వర్తకులు, స్వచ్చంద సంస్థలు లాక్‌డౌన్ నుండి వెసలుబాటు కల్పించమని కోరుతున్నారని, అయతే కోవిడ్ నిబంధనలకు విఘాతం కలగకుండా ఉండేలా సడలించడం జరుగుతుందని స్పష్టం చేసారు. తాగునీటి కోసం స్థానిక శాసన సభ్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నందున, ఈ ఏడాది నీటి సమస్య తలెత్తకపోవచ్చునని అన్నారు. కార్పొరేషన్ సిబ్బంది పారిశుధ్యంపై కూడా దృష్టి పెట్టాలని నీరు కాలుష్యం కాకుండా క్లొరినేషన్ చేయాలన్నారు.

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రజలు సామజిక దూరాన్ని పాటించడంలో సహకరిస్తున్నారని, అందులో పోలీస్ పాత్ర కీలకమని విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. సామజిక బాధ్యతగా భావించి పోలీస్, ప్రజలు సహకరిస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, పరిస్థితులు చక్క బడే వరకు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అగ్ర రాజ్యాలే కరోనా ధాటికి విలవిలలాడి పోతున్నాయని, మనం మరింత జాగురూకత వహించాల్సిన సమయమని అన్నారు. మన దేశంలో వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చాల అవసరమని, దీని కోసమే సామజిక దూరాన్ని పాటించాలని ప్రతి ఒక్కర్ని కోరుతున్నామని తెలిపారు. ప్రజలు నిత్యావసరాల కోసం గుమిగూడి ఉండకుండా బజార్లను వికేంద్రీకరించి, సంఖ్య పెంచడం జరిగిందని, ఎక్కడి వారు అక్కడే కొనుగోలు చేసే ఏర్పాట్లను చేసామని అన్నారు. ప్రతి కుటుంబానికి సరిపడే వస్తువులు అందుబాటులో ఉంచాలని, భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితి వస్తుందో వుహించాలేమని అన్నారు.

ప్రస్తుతం రైతు బజార్లు ఉదయం 6 నుండి 1 గంట వరకు ఉంటున్నాయని, ఇకపై వాటిని 11 గంటలకే మూసి వేయడం ద్వారా సామజిక దురాన్ని పెంచేలా చూడాలని కోరారు. రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వమే రేషన్ ఇస్తుందని, లేని వారికీ తను అందిస్తానని అన్నారు. వార్డ్ వారీగా రేషన్ కార్డులు లేని వారి జాబితాను ఇవ్వాలని తహసిల్దార్‌ను కోరారు. ప్రజా సేవ చేయడానికి ఎల్లవేళలా ముందుంటానని, ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనకు చెప్పాలని అధికారులకు చెప్పేరు. పేదలు, అనాధలకోసం, యాచకుల కోసం భోజన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. పైడితల్లి గుడి వద్ద, పంచ ముఖ ఆంజనేయ గుడి, వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మార్కెటింగ్ ఎ.డి. శ్యాంకుమార్, తహసిల్దార్ సత్యనారాయణమూర్తి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రణీత, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.