కుంటుపడిన అభివృద్ధి

0
7 వీక్షకులు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వరంగల్, జూన్ 6 (న్యూస్‌టైమ్): క‌రోనా కార‌ణంగా వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంలో కుంటుప‌డిన అభివృద్ధిని ప‌రుగులు పెట్టించే ప‌నిలో పడింది తెలంగాణ ప్ర‌భుత్వం. పెండింగ్‌లో ప‌డిన ప‌లు ప‌నుల‌ను వేగం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు ప్ర‌జాప్ర‌తినిధులు. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర అభివృద్ధి, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, ఆగిపోయిన ప‌నులపై రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అర్బ‌న్ వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్ట‌రేట్‌లో శ‌నివారం స‌మీక్షించారు.

సీఎం హామీలు-అమ‌లు, కార్పొరేష‌న్ లో మౌలిక వ‌స‌తులు, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, మంచినీటి స‌ర‌ఫ‌రా, ఔట‌ర్ రింగు రోడ్డు, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు, నిరుపేద‌ల‌కు ఇండ్ల ప‌ట్టాల పంపిణీ, వంటి ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. ఇదే స‌మ‌యంలో ఈ నెల 15 లేదా 16వ తేదీల్లో ఏదో ఒక‌రోజు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావు వ‌రంగ‌ల్‌కి వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌, ఆ రోజు చేయాల్సిన ప‌లు అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాల‌పై కూడా చ‌ర్చించారు.

ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ఎంపీ బండ ప్ర‌కాశ్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్సీ క‌డియం శ్రీ‌హ‌రి, ఎమ్మెల్యేలు చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేశ్, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్, కుడా చైర్మ‌న్ మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, క‌మిష‌న‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, పుర‌పాల‌క అధికారి స‌త్య‌నారాయ‌ణ‌, మిష‌న్ భ‌గీర‌థ ఈఎన్‌సీ, ఇత‌ర అధికారుల‌తో మంత్రులిద్ద‌రూ సుదీర్ఘంగా అంశాల వారీగా చ‌ర్చించారు. స‌మీక్షించారు.

అనంత‌రం మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌లు, విన‌య భాస్క‌ర్, న‌న్న‌పనేని న‌రేంద‌ర్, మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ స‌దానందంతో క‌లిసి మీడియాతో మాట్లాడారు. సీఎం హామీలు వాటి అమ‌లు స‌హా, డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు, మంచినీటి స‌ర‌ఫ‌రా, పేద‌ల‌కు ప‌ట్టాల పంపిణీ, రోడ్లు, ఇన్న‌ర్, అవుట‌ర్ రింగ్ రోడ్డు, మౌలిక వ‌స‌తులు వంటి అనేక అంశాల‌పై చ‌ర్చించామ‌న్నారు. ఆయా ప‌నుల ప్ర‌స్తుత ప‌రిస్థితిని స‌మీక్షించామ‌న్నారు.

ప్ర‌ధానంగా క‌రోనా కార‌ణంగా కుంటుప‌డిన అభివృద్ధిని పరుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. క‌రోనా రావ‌డంతో ప‌లు అభివృద్ధి ప‌నులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయ‌ని చెప్పారు. వాటిని సాధ్య‌మైనంత వేగంగా మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌ని మంత్రులు చెప్పారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి మంత్రి క‌ల్వ‌కుంట్ల రామారావుతో వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర మౌలిక వ‌స‌తులు వంటి అనేక అంశాల మీద హైద‌రాబాద్‌లో సుదీర్ఘంగా చ‌ర్చించామ‌న్నారు. ఇదే త‌రుణంలో ఈ నెల 15వ తేదీ లేదా 16వ తేదీల‌లో ఏదో ఒక రోజు కెటిఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తి తెలిపారు. కెటిఆర్ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌లు ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లుంటాయ‌న్నారు.

రాంపూర్‌లో ఆక్సీజ‌న్ పార్క్ ప్రారంభం, భ‌ద్ర‌కాళి ట్యాంక్ బండ్ ప్రారంభోత్స‌వం, ప‌ల‌వురు నిరుపేద‌ల‌కు ప‌ట్టాల పంపిణీ, జైన దేవాల‌యానికి ప్రారంభోత్స‌వం, మ‌రికొని ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లుంటాయ‌ని తెలిపారు. అదే రోజు కెటిఆర్ వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర అభివృద్ధిపై ఇక్క‌డి అధికారుల‌తో స‌మీక్షిస్తార‌ని మంత్రులు తెలిపారు. అయితే, మ‌రోసారి కెటిఆర్‌తో చ‌ర్చించి ఆయ‌న స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు మంత్రులు వివ‌రించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా, అన్ని వ‌స‌తులు గ‌ల మంచి న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నామ‌ని మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు. గ‌తంలో సీఎం ఇచ్చిన హామీలు, ఇత‌ర అన్ని ర‌కాల హామీలు దాదాపుగా నెర‌వేర్చామ‌న్నారు.

అయితే, మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పించే దిశ‌గా ఆలోచిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే కుడా మాస్ట‌ర్ ప్లాన్ కూడా ఆమోదం పొందింద‌ని మంత్రులు అన్నారు. కుడా మాస్ట‌ర్ ప్లాన్‌తో న‌గ‌రం మ‌రింత‌గా అభివృద్ధి సాధిస్తుంద‌ని మంత్రులు ఆశాభావం వ్య‌క్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here