కరోనాపై పోరుకు సహకరించండి

33

హైదరాబాద్, మార్చి 21 (న్యూస్‌టైమ్): కరోనావైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాలని మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంసృతిక, పురావస్తు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని కొంతమంది దుబాయ్ వెళ్లి వచ్చినట్లు సమాచారం ఉందన్నారు. వారు వెంటనే అధికారులను కలిసి, డాక్టర్ల సూచనలు పాటించాలన్నారు.

బయపడాల్సిన అవసరం లేదన్నారు. విదేశాల నుండి వచ్చిన వారి సమాచారం అందించకుంటే దానికి ఆయింటి వారే బాధ్యులు అవుతారన్నారు. విదేశాల నుండి వచ్చినట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం లేదా శానిటైజర్‌ను వాడి కరోనాను దరిచేరకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. పక్క దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తమై లక్షల మందికి సోకి వేల మందిని పొట్టన పెట్టుకుంటున్న కరోనా వైరస్ (కోవిడ్-19) విజృంభణను అరికట్టాలంటే స్వీయనియంత్రణ ఒక్కటే మార్గమమని, అదే శ్రీరామ రక్ష అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సీ‌ఎం కే‌సీఆర్ తెలిపిన విధంగా అవసరమైతే భారతదేశం మొత్తం ఏకమై ఇలాంటి మహమ్మారిని నియంత్రించాలన్నారు. కరోనా (కోవిడ్-19) ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు జలుబు, జ్వరం వచ్చినంత మాత్రాన కరోనా వచ్చిందని అపోహలకు, ఆందోళనకు గురికాకూడదన్నారు.

వెంటనే పట్టణంలోని డాక్టర్లు, అధికారులను సంప్రదించాలన్నారు. వారి కోసం 2000 పడకలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. గత 30 రోజుల నుండి విదేశాలు, దూర ప్రయాణాలు చేసిన వారు, వారే స్వయంగా డాక్టర్ల‌ను, అధికారులను కలిసి తమ పేర్లను నమోదు చేసుకొని, చెకప్ చేయించుకోవాలన్నారు, డాక్టర్లు ఇచ్చే సూచనలను పాటించాలన్నారు. ఇంట్లోనే 14 రోజులు ఉండి స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ పాటించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును గౌరవించి జనతా కర్ఫ్యూను అధివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు 12 గంటలు ప్రకటిస్తే ముఖ్యమంత్రి కే‌సీ‌ఆర్ 24 గంటల జనతా కర్ఫ్యూకు (ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు) పిలుపునిచ్చారన్నారు.

ముఖ్యమంత్రి కే‌సీ‌ఆర్ పిలుపును ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సీ‌ఎం కే‌సీ‌ఆర్ పిలుపు వల్ల దేశం కష్టాల్లో ఉన్నప్పుడూ ప్రజలందరూ ఐక్యంగా అండగా నిలబడుతారన్నదానికి ఒక ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు మంత్రి గౌడ్. 24 గంటల పాటు జనతా కర్ప్యూను పాటించి విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు సైరన్ రాగానే ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టి మన ఐక్యమత్యాన్ని చాటి కరోనా మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలని మంత్రి కోరారు.