విధి నిర్వహణలో స్వర్ణలత నిమగ్నమైన దృశ్యం (File photo)

విజయవాడ, మే 3 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ తొలి మహిళా అదనపు సంచాలకులుగా ఎల్. స్వర్ణలత విజయవాడలోని కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు. 1992లో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా డీపీఆర్వోగా ఎంపికైన లింగం స్వర్ణలత తొలుత గుంటూరులో జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా (డీపీఆర్వో)గా నియమితులై తదనంతరం నెల్లూరులో విధులు నిర్వర్తించారు.

రాష్ట్ర సమాచార కేంద్రం సహాయ సంచాలకులుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రిలో పనిచేశారు. ఆ తర్వాత ప్రాంతీయ ఉపసంచాలకులుగా విశాఖపట్నం, విజయవాడలో విధులు నిర్వర్తించారు. ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా పదోన్నతిపై విజయవాడ, ఒంగోలులో పనిచేశారు. కోస్తా తీరంలోని అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా జోన్-1, జోన్-2, జోన్-3లలో పనిచేసిన స్వర్ణలత విశేష అనుభవం గడించడమే కాక క్షేత్రస్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధి నిర్వహణలో మంచి పేరు సంపాదించారు.

విధి నిర్వహణలో దిగువ స్థాయి ఉద్యోగుల కష్టాల గురించి నిత్యం ఆలోచించే ఆమె తను ఎక్కడ పనిచేసినా అక్కడి ఉద్యోగుల మన్ననలు పొందారు. ముందు నుంచీ ఆమె మీడియాలో అంతరాలు లేవంటూ అందరినీ సమ దృష్టితో చూస్తూ వచ్చారు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పత్రికల విషయంలో స్వర్ణలత వాళ్లను ఏనాడూ ఇబ్బందులకు గురిచేయలేదన్నది ప్రచురణకర్తల మాట.