మైదానంలో చెలరేగిన భారత్ బ్యాట్స్‌మెన్లు

వన్డేల్లో ఓడినా టీ20తో పరువు దక్కించుకున్న కోహ్లీ..

(* మీసాల జగన్)

సిడ్నీ, డిసెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్‌ జట్టు చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత్‌ 2-0తో కైవసం చేసుకున్నట్లయింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(42 నాటౌట్:‌ 22 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) వీరవిహారం చేయడంతో టీమ్‌ ఇండియా 2 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శిఖర్‌ ధావన్‌(52:36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో మెరవగా కోహ్లీ(40:24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌(30:22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఆఖర్లో శ్రేయస్‌ అయ్యర్‌(12 నాటౌట్‌: 5 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) పాండ్యకు మంచి సహకారం అందించాడు.

అంతకుముందు ఆసీస్‌ తాత్కాలిక కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌(58:32 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌) మెరుపు అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (46:38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌(22:13 బంతుల్లో 2 సిక్సర్లు), హెన్రిక్స్‌ (26:18 బంతుల్లో ఒక సిక్స్‌) ఫర్వాలేదనిపించారు.

ఆఖర్లో మార్కస్‌ స్టాయినీస్‌(16) స్కోరును 190 దాటించాడు. భారత బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. చాహల్‌(1/51) విఫలమవగా..శార్దుల్‌ ఠాకూర్‌(1/39) ఫర్వాలేదనిపించాడు. మొత్తానికి బంతి బంతిలో ఉత్కంఠ రేపిన సిడ్నీ వేదికగా ఆసక్తిదాయకంగా సాగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది.

మాథ్యూ వేడ్‌ (58; 32 బంతుల్లో, 10×4, 1×6) టాప్‌ స్కోరర్‌. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్‌ ధావన్‌ (52; 36 బంతుల్లో, 4×4, 2×6), హార్దిక్ పాండ్య (42*; 22 బంతుల్లో, 3×4 ,2×6), విరాట్ కోహ్లీ (40; 24 బంతుల్లో, 2×4, 2×6), కేఎల్‌ రాహుల్‌ (30; 22 బంతుల్లో, 2×4, 1×6) రాణించారు.

టీమిండియా భారీ లక్ష్యాన్ని ఎలాంటి తడబాటూ లేకుండా ఛేదించింది. తొలి రెండు ఓవర్లలో నిదానంగా ఆడిన ఓపెనర్లు రాహుల్‌, ధావన్‌ తర్వాత టాప్‌ గేర్‌లో చెలరేగారు. ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల మోత మోగించారు. ఆరో ఓవర్‌లో రాహుల్‌ భారీ షాట్‌కు యత్నించి ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో భారత్‌ 60 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ నడిపించాడు. కోహ్లీ నిలకడగా ఆడుతున్నా ధావన్‌ బౌండరీలు సాధిస్తూ రన్‌రేటును నియంత్రణలో ఉంచాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. వెంటనే భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు.

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సంజు శాంసన్‌ (15; 10 బంతుల్లో, 1×4, 1×6) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరోవైపు కోహ్లీ దూకుడు పెంచి లక్ష్యాన్ని కరిగించసాగాడు. ఆండ్రూ టై బౌలింగ్‌లో స్కూప్‌ షాట్‌తో అద్భుతంగా సిక్సర్‌ సాధించాడు. అయితే కోహ్లీని డేనియల్ సామ్స్‌ బోల్తా కొట్టించడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (12*) బ్యాటు ఝుళిపించడంతో భారత్‌ విజయ సమీకరణం ఆఖరి రెండు ఓవర్లలో 25 పరుగులుగా మారింది. అనంతరం హార్దిక్‌ విధ్వంసం సృష్టించాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో శివమెత్తాడు. ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమవ్వగా రెండు సిక్సర్లు బాది మరో రెండు బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. ఆఖరి రెండు ఓవర్లు పాండ్యనే స్ట్రైకింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, స్వెప్సన్‌, ఆండ్రూ టై, డేనియల్ తలో వికెట్‌ తీశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించింది.

షార్ట్‌ (9)ను ఔటైనప్పటికీ వేడ్‌ దూకుడుగా ఆడటంతో ఆ జట్టు పవర్‌ప్లేలో 59 పరుగులు చేసింది. ఎడాపెడా బౌండరీలు బాదుతూ వేడ్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. 8వ ఓవర్‌లో కోహ్లీ అతడిని రనౌట్ చేయడంతో స్కోరువేగానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అనంతరం మాక్స్‌వెల్‌ (22; 13 బంతుల్లో, 2×6)తో కలిసి స్టీవ్‌ స్మిత్‌ (46; 38 బంతుల్లో, 3×4, 2×6) అడపాదడపా బౌండరీలు బాదడంతో ఆసీస్‌ 11 ఓవర్లకు 100 పరుగులు చేసింది. కాగా, భారత్‌ బౌలర్లు పుంజుకుని వికెట్లు తీస్తూ స్కోరును కట్టడిచేశారు. అయితే ఆఖర్లో హెన్రిక్స్‌ (26; 18 బంతుల్లో, 1×6), స్టాయినిస్ (16*, 7 బంతుల్లో, 1×6) బ్యాట్‌ ఝుళిపించారు. భారత బౌలర్లలో నటరాజన్‌ రెండు, శార్దూల్, చాహల్ చెరో వికెట్‌ సాధించారు. ముగింపు ముక్తాయింపు విషయానికి వస్తే, వన్డేలు ఆడే ఓపిక తమకు లేదని, టీ20లే తమకు సరిజోడన్న సెటైర్లను టీమిండియా నిజం చేసేలా ఆస్ట్రేలియా పర్యటన సాగుతోంనడంలో సందేహంలేదు.

ధనుంజయ్

వన్డే సిరీస్‌లో టీమిండియా సరైన ఆటతీరు ప్రదర్శించలేకపోవడం పట్ల దేశీయ క్రీడాభిమానులు ఎంతగానో కలతచెందారు. ఇతర దేశాలతో పోల్చిచూసినప్పుడు భారత్‌లో క్రికెట్ క్రీడాభిమానులు ఎక్కువగానే ఉన్నారన్నది ప్రపంచానికి తెలుసు. అలాంటి దేశం వన్డే సిరీస్‌లో ఓడిపోవడం బాధకలిగించిందని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బుల్లోడిగా పేరుగాంచిన ధనంజయ్ పేర్కొన్నారు. తను పదేళ్ల వయసు నుంచే క్రికెట్ క్రీడల పట్ల అవగాహన ఉందని, ఎవరు, ఏ దేశం ఎలా ఆడుతుందో, అసలు గెలుస్తుందో లేదో కూడా చెప్పేటంత విశ్లేషకుడిని కాకపోయినా ఆటతీరును బట్టి విజయం ఎవరిని వరిస్తుందో చెప్పగలని అంటున్నాడు.

నరేంద్ర

(* క్రికెట్ క్రీడలో వర్ధమాన విశ్లేషకులు ధనుంజయ్, నరేంద్రతో కలిసి రచయిత జగన్ ఉరప్ పవన్ కల్యాణ్ విశ్లేషణ)

ఇలాంటి విశ్లేషణలు రాయాలన్న ఆసక్తి ఉన్నవాళ్లు తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ రంగంలో గుర్తింపు పొందవచ్చు.