న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (న్యూస్‌టైమ్): జల్ జీవన్ మిషన్ ద్వారా నాలుగు కోట్ల గృహాలకు కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయడం పట్ల కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి రత్తన్ లాల్ కటారియా హర్షం వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ గ్రామీణ జనాభాలో 38% జనాభాకి ప్రయోజనం కలిగించింది. నాలుగు కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లను ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 21.14% మందికి 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడం జరిగింది. ప్రతి గృహానికి కొళాయి కనెక్షన్ కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఇంతవరకు 58 జిల్లాలు,711 బ్లాకులు, 44,459 పంచాయతీలు,87,009 గ్రామాలల్లో 100% లక్ష్యాన్ని సాధించారు.

ఆసుపత్రి నుంచే కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి రత్తన్ లాల్ కటారియా విధులు

గత వారం కోవిడ్-19 బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ రత్తన్ లాల్ కటారియా డిజిటల్ విధానంలో తన అధికార విధులను నిర్వర్తిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద సాధించిన ప్రగతిని అధికారులు మంత్రికి వివరించారు. గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడానికి టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్ (టీసీఐటీ), టాటా ట్రస్టుల సహకారంతో అయిదు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటీ)లో సెన్సార్లను ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంతాలను గుర్తించి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. వినియోగదారులకు సరఫరా అవుతున్న నీటి పరిమాణం దాని నాణ్యతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వ్యవస్థ ద్వారా ప్రజారోగ్య అధికారులు, గ్రామ నీటి సరఫరా కమిటీ (వీడబ్ల్యూఏస్సీ) సభ్యులకు అందుతుంది. ప్రవాహం, పీడన స్థాయి, క్లోరిన్ శాతాన్ని అంచనా వేయడానికి భూగర్భ జలాల స్థాయిని గమనించడానికి సెన్సార్లను ఉపయోగిస్తారు. వినియోగానికి పనికిరాని నీరు సరఫరా కాకుండా చూడడానికి, లీకేజీలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలతో పాటు ఈ వ్యవస్థ జల వనరుల అభివృద్ధి, సరఫరాను మెరుగుపరిచే అంశాలలో గ్రామ నీటి సరఫరా కమిటీకి విలువైన సమాచారాన్ని అందిస్తుంది.

పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో దీనిని అమలు చేయడానికి మరికొన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టును 500 గ్రామాల నుచి జిల్లా స్థాయి వరకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి)ని అమలు చేయడానికి గుజరాత్, బీహార్, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు టెండర్లను ఆహ్వానించాయి. సిక్కిం, మణిపూర్, గోవా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలులోకి తీసుకుని రావడానికి చర్యలు ప్రారంభించాయి.

ప్రజలకు సమగ్ర సేవలను అందించే అంశంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని కటారియా అన్నారు. సామజిక దూరాన్ని పాటించడానికి నిబంధనల మేరకు విడిగా ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచంతో సంబంధాలను కలిగివుంటూ విధులను నిర్వర్తించడానికి అవకాశం కలుగుతుందని మంత్రి అన్నారు.