టీఆర్పీలే టీవీ ఛానళ్లకు టార్గెట్‌!

156
  • రేటింగ్‌ల పిచ్చి రానురానూ ముదురుతోంది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 (న్యూస్‌టైమ్): పిచ్చి తలకెక్కింది రోకలి చుట్టమన్నాడట వెనకటికొకడు. ఇడియట్‌ బాక్సులో రియాల్టీ షోల పిచ్చి రోజురోజుకూ ముదిరిపోతోంది. ఇప్పుడా పిచ్చి పీక్సుకి చేరింది. టిఆర్‌పిల కోసం నిరంతరం కక్కుర్తి పడే టీవీ చానల్స్‌ ఎంత నీచానికైనా దిగజారుతాయని రియాల్టీ షోలు చూస్తే అర్ధమవుతోంది. ఎంటర్‌టెయిన్‌మెంట్‌లో కొత్తదనం, వైవిధ్యాన్ని కోరుకోవటం ప్రేక్షకుడి లక్షణం. ఈ లక్షణాన్ని టిఆర్‌పిగా మలుచుకోడానికి ఛానల్స్‌ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ రియాల్టీ షో కాన్సెప్ట్‌.

వాస్తవానికి ఇది మంచి ఎంటర్‌టెయిన్‌మెంట్‌ ఫార్మాట్‌. కానీ విపరీత పోకడలతో, రియాల్టీ షోలు కాస్తా నాన్సెన్స్‌ షోలుగా తయారయ్యాయి. దీంతో రియాల్టీ షోలలో రియాల్టీ ఎంత అని అనిపించకమానదు. బిగ్‌ బాస్‌. కత్రోంకా ఖిలాడీ. దస్‌ కా దమ్‌. ఝలక్‌ దిక్‌ లాజా. ఇండియన్‌ ఐడల్‌ లాంటి రియాల్టీ, గేమ్‌ షోలెన్నో ఇండియన్‌ ఛానళ్లలో హంగామా చేశాయి. ఈ రియాల్టీ షోలకు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ప్రధానంగా సెలబ్రిటీలే. టీవీ ఛానల్స్‌ సంఖ్య పెరిగిపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పోటా పోటీగా కొత్త కాన్సెప్ట్‌ల వెతుకులాట మొదటైంది.

విదేశీ ఛానళ్లలో వస్తున్న ప్రోగ్రామ్‌లకు రెప్లిగా కొన్ని కార్యక్రమాలు మాత్రం మొదలు పెట్టారు. ఇక్కడే డివైడ్‌ టాక్‌ మొదటైంది. ప్రేక్షకులు వీటిని ఇష్టపడుతున్నారు. టీఆర్పీ వస్తోందంటూ పలువురు ప్రొడ్యూసర్లు ఈ తరహా షోలు రూపొందించటం మొదలు పెడుతుంటారు. బిగ్‌ బాస్‌ చుట్టూ అనేక వివాదాలున్నాయి. తోటి పార్టిసిపెంట్సుతో అసభ్యంగా, అశ్లీలంగా ప్రవర్తించడం లాంటివి పెరుగుతున్నాయనే వాదనలొస్తున్నాయి. ఆ మధ్య బ్రెజిల్లో ఇలాంటి షోలో తోటి పార్టిసిపెంటుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో పార్టిసిపెంట్‌. అలాంటి ఘటనే మన దగ్గర బిగ్‌ బాస్‌ షోలో కూడా జరిగిందనే వార్తలొచ్చాయి. ఈ షోలో బహిరంగంగా ముద్దులు, హగ్‌లు మామూలే.

శృతి మించుతున్న రొమాంటిక్‌ బిహేవియర్‌తో, బూతులు, తిట్లతో టీఆర్‌పీ కొట్టేయాలన్న దరిద్రపు ఆలోచన ఈ తరహా షోల నిర్వాహకులది. ఇక అప్పట్లో రాఖీ కా స్వయంవర్‌ అనే షో ఒకటొచ్చింది. ఆసాంతం చూశాక, ప్రేక్షకులే పెద్ద బకరాలనే చాలా గట్టిగా ప్రూవ్‌ చేశారు ఈ షో ప్రొడ్యూసర్లు. వెండితెరపై హీరోయిన్‌గా గెలవలేక ఐటమ్‌గాళ్‌గా మారిన రాఖీ, అక్కడా గిట్టుబాటు కాకపోవడంతో ఆ మధ్య బుల్లి తెరషోలలో పార్టిసిపేట్‌ చేసింది.

వీటిలో రాఖీ కా స్వయంవర్‌ ఆ మధ్య కాలంలో సంచలనం సృష్టించింది. ఇక రాఖీ సావంత్‌ మరో షో రాఖీ కా ఇన్‌సాఫ్‌. ఇక్కడ మేడంగారు తనదగ్గరకు సమస్యలతో వచ్చే వారికి సలహాలు, సూచనలు ఇచ్చి ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేస్తానన్నారు. అదీ ఫార్మాట్‌. తను సైకాలజీ చదువుకోలేదు కానీ పబ్లిక్‌కు ఉండే ప్రాబ్లమ్స్‌ ఏంటి? దేనికెలా స్పందిస్తారనే విషయం బాగా తెలుసని ఆవిడగారి స్టేట్‌మెంట్‌. ఓ షోలో ఆవేశం తట్టుకోలేక ఒకతణ్ని నపుంసకుడని అని నోరు జారింది.

పాపం ఆ ఆమాయకుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదీ రాఖీ కా ఇన్సాఫ్‌ కధ. ఇక సచ్‌ కా సామ్నా మరో టైప్‌ షో. ద మూమెంట్‌ ఆఫ్‌ ట్రూత్‌ అనే అమెరికన్‌ షో దీనికి ఆధారం. నిజం నిప్పులాంటిది. మరి అది జీవితాల్ని కాల్చేస్తుందో, బాగు చేస్తుందో ఈ షోలో పాల్గొన్న వాళ్లందరికీ బాగా అర్ధమై ఉంటుంది. ఈ షోలో పార్టిసిపెంట్స్‌ వాళ్ల జీవితంలో నిజాలను చెప్పి డబ్బులు గెల్చుకోవాలి. ప్రశ్నల రేంజ్‌ మాత్రం వినడానికి రెండో ఎక్కం అడిగినట్టు, చెప్పడానికి లైఫ్‌ అండ్‌ డెత్‌ క్వొశ్చన్‌లాగాను ఉంటాయి. ఓ పక్క పాలీగ్రాఫ్‌ బిగించి కుటుంబ సభ్యులముందు ఓ మహిళను పట్టుకుని, మీకు మీ భర్త కాకుండా ఎవరితోనయినా ఎఫైర్‌ ఉందా అని అడిగితే ఏం చెప్తారు.

దాన్ని టీఆర్‌పీగా మలుచుకుని కోట్లు ఆదాయం గడిద్దామనుకునే నీచపు ఆలోచన క్షమించరానిది. ఇలాంటి దరిద్రపు షో దెబ్బకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. సెలబ్రిటీ జీవితాల్లో తొంగి చూడాలనే సామాన్యుడి ఉత్కంఠను క్యాష్‌ చేసుకుంటున్నాయి. ఛానళ్లు. సినీనటులు, పొలిటీషియన్లు, స్పోర్ట్‌ పర్సన్లు వీరంతా మామూలు మనుషులే. వారి రంగాల్లో ప్రత్యేకతను సాధించిన వారు మాత్రమే. కానీ, ఈ స్పెషాలిటీ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే ప్రయత్నం వరకు తీసుకెళ్లి బిజినెస్‌ చేస్తున్నాయి ఈ రియాల్టీ షోలు. రియాల్టీ షోలు చాలా ఉత్కంఠగా సాగుతూ ఉంటాయి.

ఎవరు గెలుస్తారా అని ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తుంటారు. లేదంటే ఏ జరుగుతుందా అని కళ్లప్పగించేస్తారు. ఏదో ఒక ఫలితం రాక మానదు. చివరికి ఎవర్నో ఒకరిని గెలుపు వరిస్తుంది. కోట్లాది ప్రేక్షకులను అనేక ప్రలోభాలకు గురిచేస్తూ, పనిగంటలను వృధా చేస్తూ, కేవలం టీఆర్పీల కోసం ఆరాటపడే ఈ పోటీల్లో మొదటి నుంచీ ఓడిపోతున్నది ప్రేక్షకుడు మాత్రమే. చాలా షోల మీద ఉన్న అపవాదు ఏంటంటే, వాటిలో జరుగుతున్నదంతా నిజంగా పోటీ కాదు అని. ఎందుకంటే వీటిలో అంతా స్క్రిప్ట్‌ ప్రకారం మాత్రమే జరుగుతుంది.

ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలి అంతా ప్రీడిపైన్డ్‌. ఏ జడ్జ్‌ ఎవర్ని తిట్టాలి? ఏ పార్టిసిపెంటుకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వాలి ఇవన్నీ ముందే నిర్ణయించేస్తారు. మనం అత్యంత ఉత్కంఠభరితంగా చూసేదంతా ఆ ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్‌ తెలివిగా అల్లిన స్క్రీన్‌ ప్లేని మాత్రమే. ఇవన్నీ చూడ్డానికి వ్యక్తిగత ప్రతిభను వెలికి తీసేవిగా, బ్రేక్‌ ఇచ్చేవిగా కనిపించినప్పటికీ కేవలం ప్రేక్షకుల నుండి ఎస్సెమ్మెస్సులు, టీఆర్పీలు గుంజాలనే ఆరాటం మాత్రమే. ఈ రియాల్టీషోల్లో పార్టిసిపెంట్స్‌ కోసం ఎస్సెమ్మెస్సులు ఆహ్వానిస్తారు. గెలుపు ఓటములు యస్‌ఎంయస్లపై ఆధారపడి ఉందంటారు. ఓ పాపులర్‌ రియాల్టీషోలో ఒక ఎపిసోడ్‌ కు 70 లక్షల యస్‌ఎంయస్లు వచ్చాయి!

అంటే ఒక ఎపిసోడ్‌కి 2 కోట్ల 80 లక్షల రూపాయలు. ఒక సంవత్సరానికి 146 కోట్లు. ఈ సొమ్మును టీవీ చానెల్‌, మొబైల్‌ ఆపరేటర్లూ సగం సగం పంచుకుంటారట. ఇడియట్‌ బాక్సులో వచ్చే అన్ని ప్రోగ్రామ్లు నాన్సెన్స్‌ కాకపోయినా, చాలా వరకు అదే కేటగిరీ అనటంలో డౌట్‌ అనవసరం. అలాంటి వాటి మధ్య ఉపయోగపడే వాటిని జాగ్రత్తగా పిక్‌ చేసుకోవటం అవసరం. అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా రియాల్టీ షోల నియంత్రణకు పటిష్ట యంత్రాంగం అవసరం. ఆకలేస్తే తిండి కావాలి. వేసుకోవటానికి బట్ట కావాలి. నేర్చుకోటానికి జ్ఞానం అందుబాటులో ఉండాలి.

ఆ తర్వాత ఆహ్లాదానికి వినోదం కావాలి. అందరికీ కనీస అవసరాలు దాటి పరిపూర్ణ వికాసం వైపు పయనించాలి. అదే నిజమైన రియాల్టీ. అంతే తప్ప బలహీనతలను నిద్రలేపి వాటితో బిజినెస్‌ చేయాలనుకోవటం రియాల్టీ కాదు. అది నేరంతో సమానం.