బోటు ప్రమాదంపై టీడీపీ విమర్శలు

3722

గుంటూరు, సెస్టెంబర్ 25 (న్యూస్‌టైమ్): అప్పట్లో మంటూరు వద్ద మునిగిన లాంచీని సీఎం చంద్రబాబు గోదావరి గట్టున కూర్చుని స్థానిక జాలర్లతోనే పడవను బైటకు తీయించి, బాధితులకు సత్వర న్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మరిప్పుడు కచ్చులూరువద్ద నీట మునిగిన ప్రయాణికుల బోటును 10 రోజులు దాటినా ప్రభుత్వం ఎందుకు బైటికి తీయట్లేదని ప్రశ్నించారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ ఎందుకంటే బోటు బయటపడితే వాస్తవాలు బయటకొస్తాయని, పడవ ప్రమాదం వెనుక వైసీపీ నేతల ధనదాహం ఉందని ప్రజలకు తెలుస్తుందన్నారు.

అందుకే బోటు తీయకుండా, గల్లంతైన వారి మృతి నిర్ధారణ కాకుండానే ‘డీమ్డ్ టు బి డెత్’ సర్టిఫికెట్ ఇస్తామని మృతుల కుటుంబాలతో పరిహాసమాడుతోంది ప్రభుత్వమని విమర్శించారు. ‘‘అందుకే ఇది ప్రమాదం కాదు ప్రభుత్వం చేసిన హత్యలు. అన్యాయంగా 73 మందిని పొట్టనబెట్టుకుంది జగన్ ప్రభుత్వం’’ అని ఆరోపించారు. పోలవరం రీటెండర్లతో రూ.750 కోట్లు మిగిలించేశామని చెప్పుకోడానికి, తెదేపా హయాంలో టెండర్లలో అవినీతి జరిగిందని ప్రజలని నమ్మించడానికి నానా పాట్లు పడిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రిజర్వుడు టెండరింగ్ ద్వారా రూ.7,500 కోట్లకు పైగా నష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. నవయుగ జల విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తికి గడువు 28 నెలలు ఉండగా ఇప్పుడు రివర్స్‌లో మేఘాకి ఇచ్చింది 58 నెలల గడువు మాత్రమేనని, అంటే 30 నెలలు పొడిగించారని పేర్కొన్నారు.

ఈ 30 నెలల్లో విద్యుత్తు ఉత్పత్తి జరగకపోవడం వల్ల వచ్చే నష్టం దాదాపు రూ.5,000 కోట్లకు పైమాటేనని, రివర్స్ టెండరింగ్ అంటూ పోలవరం పనులు ఆగిపోవడం వల్ల ఈ నాలుగు నెలల్లో నష్టం అంటే కాస్ట్ ఎస్కలేషన్ రూ.300 కోట్లని తెలిపారు. రివర్సు టెండర్ల వలన ఒక యేటి పంట కూడా కోల్పోయామని, ఈ పంట నష్టం రైతుకు పెను భారమేనని చెప్పారు. ఇక పాత కాంట్రాక్టర్ల పనులను కాంట్రాక్టుకు విరుద్ధంగా ఆపేసినందుకు ఇవ్వాల్సిన నష్టపరిహారం అదనమని రాజప్ప పేర్కొన్నారు. ఇదంతా కలిసి వైసీపీ నిర్వాకం వల్ల రాష్ట్రప్రజలు రూ.7,500 కోట్లకు పైనే నష్టపోతున్నారని, ఇంత చేసినా ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రశ్నార్థకమేనని, ప్రజల ప్రాణాలు గాలిలో దీపమేనని వ్యాఖ్యానించారు.

తెదేపా ముందే చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం ముందుగానే రిజర్వు చేసి పెట్టుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకే పోలవరం ప్రధాన డ్యామ్, జలవిద్యుత్ కేంద్రం పనులను అప్పచెప్పిందని ఆరోపించారు. రూ.4,987 కోట్ల ఇనీషియల్ బెంచ్ మార్కు ఉండగా రూ.4,358 కోట్లు అనగా 12.6 శాతం తక్కువకే బిడ్ వేసి పనులు దక్కించుకుంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ అని తెలిపారు. ఈ సంస్థకు టెండర్ కట్టబెట్టడానికి ఎన్నో నిబంధనలను సడలించింది ప్రభుత్వమని, ప్రీబిడ్‌లో రంగంలో ఉన్న 8 సంస్థలు బిడ్ దాఖలు చేసే నాటికి అనూహ్యంగా తప్పుకున్నాయన్నారు.

దాంతో బిడ్ దాఖలు చేసిన ఒకే ఒక సంస్థ మేఘా ఇంజనీరింగ్‌కు పనులు అప్పచెప్పారన్నారు. వెంటనే రీటెండరింగ్ ద్వారా రూ.629 కోట్లు మిగిల్చామని వైసీపీ నేతలు ప్రచారం మొదలు పెట్టారని, తెదేపా హయాంలో జరగని అవినీతిని జరిగిందని భ్రమింపచేయడం కోసమే మేఘాను రంగంలోకి దింపి మిగులు నాటకాలు ఆడుతోంది వైసీపీ అని ఎద్దేవాచేశారు.