బుద్ద వెంకన్న

నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్

విజయవాడ, సెప్టెంబర్ 16 (న్యూస్‌టైమ్): ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మహా మండపం కింద ఉన్న అమ్మవారి రథంలో వెండి తాపడం నాలుగు సింహాలలో 3 సింహాలు చోరీకి గురి కావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. దుర్గమ్మ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీనిపై ఈవో నీళ్లు నమలడం దొంగలకు వత్తాసు పలకడమే. ఈ చోరీ వెనుక హస్తం ఎవరిది? ఎవరిని రక్షించడానికి దీనిని కప్పిపెట్టాలని చూస్తున్నారు? 3 సింహాల మాయం దుర్ఘటనపై నిజానిజాలు వెంటనే బైటపెట్టాలని ప్రతిపక్ష తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఆ పార్టీ నాయకుడు బుద్ద వెంకన్న మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ గుడికి భద్రత లేకుండా పోయిందన్నారు.

వైసిపి నాయకులు గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉన్నారని, ఎండోమెంట్ భూముల ఆక్రమణలు, రథాలకు నిప్పు, విగ్రహాల ధ్వంసం, వెండి తాపడాల మాయం, రోజుకో నేరం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కిమ్మిన్నాస్తిగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం అప్పన్న దేవాలయం, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, శ్రీశైలం, అన్నవరం… ఇప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ గుడి దేనికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. దొంగలు, దగాకోర్లు ఆలయాల్లో తిష్టవేసి అరాచకాలు చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ అండ చూసుకుని అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని, ఆలయాల్లో చోరీలు, విధ్వంసాలు, అరాచకాలు చేస్తున్న నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

‘‘భక్తుల మనోభావాలు గౌరవించాలి. 15నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో జరిగిన అరాచకాలపై సిబిఐ విచారణ జరిపించాలి. అన్ని దేవాలయాల వద్ద భద్రత మెరుగుపర్చాలి. విజయవాడ దుర్గమ్మ గుడిలో 3సింహాల చోరీకి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి.’’ అని పట్టుబట్టారు.