వైసీపీ బాధితులకు టీడీపీ చెక్కుల పంపిణీ

44

గుంటూరు, నవంబర్ 19 (న్యూస్‌టైమ్): వైకాపా పాలనలో దాడులు, దోపిడీ తప్ప ఎక్కడా అభివృద్ధి లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావులు విమర్శించారు. పల్నాడు ప్రాంతంలోని వైకాపా బాధితులకు గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం పరిహారం అందజేశారు.

కార్యక్రమంలో ఆనందబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు తెదేపా వైకాపా మాదిరిగా ఏనాడూ అరాచకాలకు పాల్పడలేదని, ఆవిధంగా చేసి ఉంటే వైకాపా ఎప్పుడో కనుమరుగయ్యేదన్నారు. అక్రమ కేసులతో వేధించి కోడెలను బలితీసుకున్న ప్రభుత్వం యరపతినేని, చింతమనేనిపై కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. దాడులతో ఎల్లకాలం పాలన కొనసాగించలేరన్న విషయాన్ని గ్రహించాలని హితవు పలికారు.

జిల్లా పార్టీ అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు మాట్లాడుతూ చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో విర్రవీగుతున్న వైకాపాను భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు. తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఆరిపోయే దీపం, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నాళ్లో ప్రభుత్వాన్ని నడపలేరన్నారు. పల్నాడు ప్రాంత కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్న వారందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ మాట్లాడుతూ చంద్రబాబు పోరాటం చేశాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. తెదేపాను నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదన్నారు. ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని జంగమేశ్వరపాడు, పిన్నెల్లి గ్రామాలకు చెందిన 210 మంది తెదేపా కార్యకర్తలకు నష్టపరిహారం కింద నగదు పంపిణీ చేశారు.

కార్యక్రమంలో తెదేపా నాయకులు దారపనేని నరేంద్ర, మన్నవ సుబ్బారావు, ధారూనాయక్‌, మానుకొండ శివప్రసాద్‌ పాల్గొన్నారు.