ఉల్లిధరకు నిరసనగా తెదేపా ఆందోళన

110
  • ఉల్లి ధరలకు నిరసనగా అసెంబ్లీకి టీడీపీ ర్యాలీ

  • కోస్తే కాదు… కొంటేనే కన్నీళ్లొస్తున్నయన్న చంద్రబాబు

  • వెలగపూడి సచివాలయ ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన

అమరావతి, డిసెంబర్ 9 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో అమాంతంగా పెరిగిన ఉల్లి ధరలకు నిరసనగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సోమవారం నుంచి ప్రారంభమైన శీతాకాల సమావేశాల సందర్భంంగా అసెంబ్లీ వైపు ర్యాలీ నిర్వహించింది. ‘కోస్తే కాదు… కొంటేనే కన్నీళ్లొస్తున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వెలగపూడి సచివాలయ ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు.

ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లిపాయల దండలు మెడలో వేసుకొని నాయకులు ఆందోళన చేపట్టారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చంద్రబాబు చూపించారు. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నామని, సబ్సిడీపై తక్కువ ధరలకే అందించామని ఆయన గుర్తు చేశారు. ఉల్లి ధరలు దిగివచ్చేవరకు తెదేపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఉల్లికోసం క్యూలో నిలబడి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది నిరద్శనమన్నారు. గత 30, 40 రోజుల నుంచి సమస్య ఉన్నా సీఎం జగన్‌ ఒక్క సమీక్ష కూడా దీనిపై నిర్వహించలేదని మండిపడ్డారు. దేశమంతా ఉల్లి సమస్య ఉందని ప్రభుత్వం చెప్పటం అబద్దమని ఆయన ఆక్షేపించారు. రూ.3వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని ఏం చేశారో చెప్పాలని రామానాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.