‘ఎస్పీడీసీఎల్’ అభ్యర్ధులకు టీ-సాట్ అవగాహన

114

హైదరాబాద్, నవంబర్ 19 (న్యూస్‌టైమ్): తెలంగాణ ప్రభుత్వం టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్. ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్న సుమారు 3,025 వేల పోస్టులకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అవగాహన పాఠ్యాంశాలు ప్రసారం చేస్తున్నాయి. నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ ఉద్యోగ గైడ్ పేరుతో ప్రసారాలు అందనున్నాయి. నెల రోజుల పాటు సుమారు 160 గంటలు వివిధ సబ్జెక్టుల్లో అభ్యర్థులకు బోధన పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు మంగళవారం టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అవగాహన పాఠ్యాంశాలను టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు అందిస్తున్నాయని తెలిపారు. తెలంగాణలోని పేద, మారు మూల ప్రాంత నిరుద్యోగులకు ఉచితంగా పోటీ పరీక్షల పాఠ్యంశాలను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానేఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ సంస్థల ఉద్యోగాల భర్తీ ప్రకటనకు అనుబంధంగా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తున్నామని సీఈవో తెలిపారు.

నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు 31 రోజులు సుమారు 160 గంటల ప్రసారాలు చేయనున్నామన్నారు. ఈ ప్రసారాలు ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు మూడు గంటల పాటు విద్య ఛానల్, సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మూడు గంటలు నిపుణ ఛానల్లో ప్రసారాలుంటాయని సీఈవో వివరించారు. టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన 10 ప్రధాన సబ్జెక్టులతో పాటు 15 అనుంబంధ సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యాంశాలను పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ప్రసారం చేస్తున్నామని శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ ప్రసారాలు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు టి-సాట్ నిపుణ, విద్యతో పాటు టి-సాట్ సోషల్ మీడియాలో భాగమైన యాప్ టీసాట్.టీవీ, వెబ్‌సైట్ సాఫ్ట్‌వేర్.తెలంగాణ.జీవోవీ.ఇన్ అందుబాటులో ఉంటాన్నాయన్నారు. విద్యుత్ ఉద్యోగ సంస్థల పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు టి-సాట్ ప్రసారాలను వినియోగించుకుని మంచి ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.