అంతరిక్ష కార్యకలాపాల కోసం సాంకేతిక మార్గదర్శనం, సౌకర్యాల వినియోగాన్ని అభ్యర్థిస్తూ 26 కంపెనీలు, అంకుర సంస్థలు ఇస్రోను సంప్రదించినట్లు, లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
భారత భూభాగంతో పాటు చుట్టూ 1500 కిలోమీటర్ల వరకు పీఎన్టీ (స్థానం, చలనం, సమయం) సేవలను వినియోగదారులకు అందించేలా, భారత శాటిలైట్ ఆధారిత స్వతంత్ర నావిగేషన్ వ్యవస్థ అయిన ‘నావిక్’ (నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్)ను భారత్ అభివృద్ధి చేసి ఆచరణలోకి తెచ్చినట్లు మంత్రి వివరించారు. భారత్లో టెలికాం సేవలు అందించే సంస్థలు లేదా తయారీదారులు భారత్లో వృద్ధి చేసిన జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించడం ప్రారంభించారా అన్న అంశానికి సమాధానంగా, ప్రధాన మొబైల్ చిప్సెట్ తయారీదారులు (క్వాల్కమ్, మీడియాటెక్) నావిక్ ఆధారిత మొబైల్ ప్రాసెసర్లను విడుదల చేసినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రాసెసర్లను కలిగిన మొబైల్ ఫోన్లను భారత విఫణిలోకి తెచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ టెలికాం ముఖ్యాంశాల్లో నావిక్ను భాగం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమైనట్లు మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.