అన్ని రంగాలలో తెలంగాణ పురోభివృద్ధి

580

హైదరాబాద్, నవంబర్ 20 (న్యూస్‌టైమ్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించిందని ఫార్మా, ఐటీ, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా అన్నారు. బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో చెన్నైలోని సింగపూర్ కన్సుల్ జనరల్ పొంగ్ కుక్ తియాన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయస్ధాయి విమానాశ్రయంతో పాటు అవుటర్ రింగ్ రోడ్ ద్వారా మెరుగైన రవాణా వ్యవస్ధ అందుబాటులో ఉందని తెలుపుతూ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కొనసాగింపుగా జీఏడీ ద్వారా వివిధ శాఖలతో, స్టేక్ హోల్డర్‌లతో సమావేశాలు నిర్వహించడానికి తగు చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాణిజ్య సంబంధాల మెరుగుకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం, ఎడ్యుకేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, హెల్త్, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన శాంతి భద్రతలో ప్రశాంత వాతవరణం నెలకొని ఉందని, పెట్టుబడులకు అనుకూలమని, వాణిజ్యవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు దశల వారిగా ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలపగా, సింగపూర్ ప్రతినిధి బృందం అభినందించింది.

కోల్డ్ చైన్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని సింగపూర్ బృందం తెలిపింది. వివిధ శాఖలతో అవసరమైన సమావేశాలు నిర్వహించి, ఆసక్తి ఉన్నరంగాలలో పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలన్నారు. సింగపూర్‌లో వాణిజ్య సంబంధాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫార్మా సిటీ, జినోమ్ వ్యాలీ, స్మార్ట్ సిటీ తదితర అంశాలపై చర్చించారు.