తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ‘బండి’

98

హైదరాబాద్, మార్చి 11 (న్యూస్‌టైమ్): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను నియమితులయ్యారు. యువతలో గట్టిపట్టున్న బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్‌తోనూ సత్సంబంధాలున్నాయి. 2018 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్ తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1971 జులై 11న బండి నర్సయ్య, శకుంతలకు జన్మించిన సంజయ్ భారతీయ స్టేట్ బ్యాంకు ఉద్యోగిని అపర్ణను వివాహం చేసుకున్నారు.

ఆయనకు ఇద్దరు పిల్లలు. సాయి భగీరత్, సాయి సుముఖ్. బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో స్వయం సేవకుడిగా పనిచేసిన సంజయ్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో పట్టణ కన్వీనర్‌గా, తర్వాత పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. ది కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు (1994-1999;1999-2003) డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన తనదైన పనితీరుతో బిజెపి అధిష్ఠానాన్ని ఆకట్టుకుని దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచార విభాగం ఇన్‌చార్జిగా పనిచేశారు.

భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీ చేపట్టిన ‘సురాజ్ రథ యాత్ర’లో వెహికల్ ఇన్‌చార్జిగా సేవలందించిన సంజయ్ కరీంనగర్ నగరపాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్‌గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుండి భారీ మెజారిటీ‌తో హ్యాట్రిక్ విజయం సాధించారు. వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా పనిచేశారు.

2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీజేపీ తరుపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి టీఆర్‌ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా నిర్ణయం మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ బుధవారం నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచిన తర్వాత రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు భాజపా పావులు కదుపుతోందన్న విషయం తాజా నియామకం ద్వారా రుజువైంది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని ఎన్నికపై కొద్ది నెలలుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటివరకు అధ్యక్షునిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్‌తో పాటు మాజీ మంత్రి డి.కె.అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. రాజకీయంగా దూకుడుగా వెళ్లడం, తొలి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉండటం, ముఖ్యంగా సంఘ్‌ ఆశీస్సులు తెలంగాణలోని బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సంజయ్‌ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది. మంగళవారం సాయంత్రమే ఓ నిర్ణయానికి వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పార్టీ రాష్ట్ర ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌, మరికొందరు నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డితో మంగళవారం, బుధవారం రెండుదఫాలు మాట్లాడారు. అనంతరం సంజయ్‌ పేరును ఖరారుచేశారు. వి.రామారావు, బంగారు లక్ష్మణ్‌, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ హైదరాబాద్‌ నగరానికి చెందిన, హైదరాబాద్‌లో స్థిరపడ్డ నేతలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ భాజపా అధ్యక్షులుగా పనిచేశారు. 1998-99లో సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. మళ్లీ చాలాకాలం తర్వాత హైదరాబాద్‌ వెలుపల ఉన్న నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కింది. భాజపా తెలంగాణ నూతన అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్‌కు ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్‌ అభినందనలు తెలిపారు. సంజయ్‌ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని, తెరాసకు ప్రత్యామ్నాయశక్తిగా ఎదిగి 2023లో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన అనంతరం బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమష్ఠి నిర్ణయాలతో పార్టీని ముందుకు నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య కార్యకర్తను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షా, భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డాలకు ధన్యావాదాలు తెలిపారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏ నమ్మకం, విశ్వాసంతో బాధ్యతలు తనకు అప్పజెప్పారో దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. జాతీయ స్థాయిలో భాజపా బలానికి, రాష్ట్రంలో పరిస్థితికి పోలిక లేదని, తెరాసకు ప్రత్యామ్నాయమని ఎలా చెబుతారని, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగామని సంజయ్ అన్నారు.

నాయకులందరితో మాట్లాడి సమష్ఠి నిర్ణయాలతో కార్యక్రమాలు రూపొందిస్తామని, సీనియర్లు ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదుర్కొనడం వల్లనే తాము ఎంపీలుగా గెలిచామన్నారు. వాళ్లతో కలిసి ముందుకు వెళతానని, పార్టీపై నమ్మకం, విశ్వాసంతో చేరిన నాయకుల అభిప్రాయాలు తీసుకుంటామని, సిద్ధాంతపరంగా పనిచేసే కార్యకర్తలు భాజపాకు ఉన్నారని, ఈ క్రమంలోనే పలువురు నక్సల్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయారని, ఆ అమరుల స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామన్నారు.