19న తెలంగాణ కేబినెట్ భేటీ

0
18 వీక్షకులు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్ ధరించే క్యాంప్ కార్యాలయంలో తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 16 (న్యూస్‌టైమ్): తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్‌లో జరిగే ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించడమా? లేక కేంద్ర ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌కు మినహాయింపులు ఇవ్వడం కంటే కూడా కేంద్రం సూచించిన ప్రకారం మహమ్మారి నియంత్రణకు కట్టుబడి ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం అయినప్పటికీ రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుంచి వస్తున్న సూచనలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయాన్ని వెల్లడించాలని భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో లాక్‌డౌన్ మరింత కట్టుదిట్టం చేసి మిగిలిన జిల్లాలలో ఆంక్షలను సరళతరం చేయాలన్న ఆలోచనలో మెజారిటీ మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్ వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని, ముఖ్యంగా పేదలు, వలస కార్మికుల విషయంలో యంత్రాంగం పటిష్టవంతమైన చర్యలు చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల కోసం ఎవరూ సమస్యలు ఎదుర్కోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, పేదలకు ఇచ్చే ఉచిత రేషన్, 1500 ఆర్ధిక సాయం కచ్చితంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని సీఎం పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకుంటే కరోనాను తక్కువ సమయంలోనే నియంత్రించవచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here