తెలంగాణ ఆడపిల్లలకు అండ: అల్లోల

74

నిర్మల్, నవంబర్ 20 (న్యూస్‌టైమ్): తెలంగాణలోని అర్హులైన పేద ఆడపిల్లలందరి పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా అండగా నిలుస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో మామడ, లక్ష్మణ్చందా, నర్సాపూర్ (జి) మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు రూ 95లక్షల64వేల 252/- విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ఆడపిల్లల పెళ్లి సందర్భంగా తల్లిదండ్రులకు భారం పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఆదుకుంటున్నదని తెలిపారు . గతంలో రూ 51000/-లు, 75116/-ఉన్న కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వివాహ కానుకాను రూ1,00,116/-లుకు పెంచడం జరిగింది అన్నారు.

అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలతో నిరుపేదలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు అన్నారు. ప్లాస్టిక్ నిషేధంతో 50% పర్యావరణను సంరక్షించుకోవచ్చు అన్నారు.

రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రసన్న మాట్లాడుతూ మామడ మండలంలో, 33 మందికి లక్ష్మణ చాంద మండలంలో 45 మందికి, నర్సాపూర్ (జి) మండలంలోని 22 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం పంపిణీ చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ చైర్మన్ కె. రామకిషన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, పార్టీ నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏనుగు లింగారెడ్డి, రఘునందన్ రెడ్డి, తహసీల్దార్లు కిరణ్మయి, సత్యనారాయణ, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.