కర్రపెండలం సాగుకు తెలంగాణ అనుకూలం

0
8 వీక్షకులు

సేలం, మార్చి 4 (న్యూస్‌టైమ్): తమిళనాడులోని సేలం సమీపంలో ఏతాపూర్‌లో ఉన్న కర్రపెండలం, ఆముదం పరిశోధన, విత్తనోత్పత్తి క్షేత్రాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. కర్రపెండలం సాగుకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమని, ఇక్కడి సారవంతమైన భూములలో కర్రపెండలం పంటను ప్రోత్సహించి రైతులకు మేలు చేయవచ్చని మంత్రి నిరంజన్ తెలిపారు.

ఈ పంటకు జాతీయంగా, అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని, వర్షాధారంతో పాటు ఆరుతడి ద్వారా కర్రపెండలం సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కర్రపెండలం నుండి సాపుదనా (సగ్గుబియ్యం), గంజిపొడి, చిప్స్ తయారీ చేయడమే కాకుండా ఈ ఉత్పత్తిని వస్త్ర పరిశ్రమలో విరివిగా వినియోగంచవచ్చని అభిప్రాయపడ్డారు. దాదాపు 18 రకాల వస్తువుల తయారీకి కర్రపెండలాన్ని వాడుతున్నారని మంత్రి చెప్పారు. కేవలం 7 నుండి 10 నెలల్లో పంట చేతికి వస్తుందని, వర్షాధారంతో 12 టన్నులు, ఆరుతడితో ఎకరాకు 15 టన్నుల వరకు దిగుబడి సాధించవచ్చాన్నారు.

తక్కువతేమ, ఉష్ణోగ్రత గల తెలంగాణ నేలలు ఈ పంట సాగుకు అనుకూలమని మంత్రి చెప్పారు. దక్షిణాఫ్రికాలో కర్రపెండలం సాగు అధికంగా ఉందని, పొరుగు రాష్ట్రం ఏపీలో సుమారు 80 వేల ఎకరాలలో కర్రపెండలం సాగు చేస్తున్నారని, సాగునీటి వసతి పెరిగిన నేపథ్యంలో తెలంగాణలో సాగు విస్తీర్ణం మరింత పెరిగిందన్నారు. అధిక దిగుబడి ఇచ్చే కర్రపెండలం సాగుకు ప్రోత్సాహిస్తామని, పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించే క్రమంలో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. కర్రపెండలం సాగుకు సహకరిస్తామని మంత్రి నిరంజన్ తెలిపారు.

పంట కాలనీల ఏర్పాటు, ప్రత్యామ్నాయ పంటల వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెట్టారని, సాంప్రదాయ పంటల సాగుతో ఆదాయం కోల్పోతున్న రైతాంగానికి, పంటల మార్పిడితో అధిక దిగుబడి, గిట్టుబాటు ధర కల్పించాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు. వెయ్యి ఎకరాలలో కర్రపెండలం సాగు చేస్తే పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు మాట్లాడుతూ ఆరుతడి కింద పాలమూరు జిల్లాలో ఆముదం విత్తనోత్పత్తి సాగుకు రైతులను ప్రోత్సహిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. వర్షాధారం కింద రంగారెడ్డి, నల్లగొండలలో ఆముదం పంట సాగవుతున్నట్లు చెప్పారు. వివిధ రకాల ఆయిల్, సబ్బులు, ఆయిట్‌మెంట్లలో ఆముదం వినియోగిస్తారని, త్వరలో కర్రపెండలం పంట సాగవుతున్న ప్రాంతాలలో రైతులకు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here