తెలుగు సంస్కృతీ వైభవ చిహ్నం!

2422

విశాఖపట్నం, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): విశాఖలోని కైలాసగిరి తెలుగు సాంస్కృతిక మ్యూజియం శాతవాహనుల కాలం నుంచి స్వాతంత్య్రోద్యమ కాలం వరకూ ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని కళ్ళకుకడుతుంది. సుమారు 5 ఎకరాల్లో రూ. 12 కోట్ల రూపాయల ఖర్చుతో తెలుగు చారిత్రక విశేషాలు ప్రత్యేక హంగులతో ఈ మ్యూజియాన్ని నిర్మించారు. విశాఖపట్నం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీ (వుడా), వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ (డబ్ల్యూటిఎఫ్‌) సంయుక్తంగా ఈ మ్యూజియంను నిర్మించాయి.

ఆరునెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ఈ మ్యూజియం నేడు సందర్శుకలను, మరీ ముఖ్యంగా తెలుగు సంస్కృతీ అభిలాషులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖ టూరిస్టు హబ్‌గా విస్తరించడానికి ఈ సాంస్కృతిక మ్యూజియం మరొక ఆకర్షణగా నిలుస్తున్నది. మ్యూజియంలోకి ప్రవేశించగానే అందమైన నందనవనంలోకి వెళ్ళిన అనుభూతి అందరిలోనూ కలుగుతోంది. దీంట్లో ప్రత్యేక ఆకర్షణగా ఆడిటోరియం ఉంది. ఆడిటోరియం మధ్యలో రొటేట్‌ టేబుల్‌ (రివాల్వింగ్‌ టేబుల్‌) 80 మంది కూర్చొనడానికి సరిపడా కుర్చీలతో తిరుగుతూ ఉంటోంది. దీన్ని సినీ కళాకారుడు తోట తరణి డిజైన్‌ చేశారు. రొటేట్‌, రౌండ్‌ టేబుల్‌ తిరుగుతూ చారిత్రక ఎపిసోడ్స్‌, అందులోగల వ్యక్తులకు సంబంధించిన ఆడియో, విజువల్‌ సౌండ్‌ సిస్టంతో కూడిన మాటలు, పాటలు వినిపిస్తాయి.

సుమారు 58 నిమిషాల పాటు ఈ టేబుల్‌ రొటేట్‌ అవుతూ ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయాలకు చిహ్నాలుగా ఉండే చారిత్రక వ్యక్తుల గురించి, సంఘటనల గురించి వివరిస్తుంది. మధ్యలో ఉండే ఈ టర్న్‌ టేబుల్‌ లేదా రొటేట్‌ టేబుల్‌ చుట్టూ చారిత్రక వ్యక్తుల శిల్పాలను చెక్కి వాటికి లైటింగ్‌ను అమర్చారు.

శాతవాహనులలు, అమరావతి మహాస్థూపం, తెలుగు లిపి, బుద్ధుడు, అజంతా కుఢ్య చిత్రాలు, కోటిలింగాలు, ధూళికట్ట, ఆచార్య నాగార్జున, బుద్ధుని పరిత్యాగం, గౌతమీపుత్ర శాతకర్ణి, బ్రహ్మనాయుడు, రాజరాజ నరేంద్రుని ఆస్థానం, భీమవరం జైనాలయం, పల్నాటియుద్ధం, వేయిస్తంభాల దేవాలయం, శ్రీనాధుడు, భక్తపోతన, శ్రీకృష్ణదేవరాయుల రాజ చిహ్నం, భువన విజయం, అష్ట దిగ్గజాలు, గురజాడ, శ్రీశ్రీ, చాసో, పింగళి వెంకయ్య, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు, పొట్టిశ్రీరాములు, తాండ్రపాపారాయుడు, విజయరామగజపతిరాజు, భద్రాచల రాముడు, అన్నమాచార్య, త్యాగయ్య, శ్యామశాస్త్రి, తిరుపతి దేవస్థానం, తంజావూరు వంటి చారిత్రక ప్రాధాన్యమున్న చిత్రాలను అందంగా చెక్కి, తెలుగు వైభవాన్ని కళ్లకు కట్టించారు.

80 మంది వరకూ ఒకేసారి కూర్చొని తిలకించడానికి వీలుగా అకర్షణీయంగా దీన్ని తీరిచిదిద్దారు. ఇంకా తెలుగు రాష్ట్రం నుంచి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన ఏడుగురు చిత్రపటాలు, తెలుగు రాష్ట్రం నుంచి ప్రధాని అయిన పివి నరసింహారావు చిత్రపటం, తెలుగు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఛాయాచిత్రాలను గ్యాలరీలో ప్రదర్శించారు. తెలుగు భాషా పరిరక్షణ కావాలనే నినాదం బలంగా వినపడుతోన్న నేటి తరుణంలో తెలుగు మ్యూజియం మంచి ప్రేరణగా నిలుస్తుంది.