ప్రత్యేక పూజలు అందుకున్న తిరుమల వెంకటేశ్వరుడు

హైదరాబాద్, అమరావతి, డిసెంబర్ 25 (న్యూస్‌టైమ్): తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాల వద్ద భారీగా వరుసలు కట్టారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. దీంతో వేకువ జామున 3.30 గంటల నుంచి ప్రముఖుల దర్శనాలు ప్రారంభమయ్యాయి.

3 వేల మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనానికి హాజరైనట్లు తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి జనవరి 3 వరకు తిరుమలలో భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులకు టోకెన్లు జారీ చేశారు. 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ దర్శనం కల్పించడం ఇదే తొలిసారి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తిరుమలలోని 4 మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేశారు.

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బోబ్డే, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ వెంకట రమణ, రాష్ట్ర మంత్రులు నారాయణ స్వామి, సురేష్‌, ఏపీ సీఎస్‌గా ఎంపికైన ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం 6.43 గంటల నుంచి స్వామి వారు ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇచ్చారు. యాదగిరి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. వేకువ జాము నుంచే స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.

యాదగిరి లక్ష్మీనరసింహునికి ప్రత్యేక అలంకరణలో విశేష పూజలు చేస్తున్న అర్చకులు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రంగు రంగుల పూలతో అలంకరించారు. ఆలయంలో ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే శుక్రవారం నుంచి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరు రోజుల పాటు వైభవోపేతం కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రోజుకో అవతారంలో స్వామి వారు భక్తులను కటాక్షించనున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కనులపండువలా జరిగాయి. ఉత్తర ద్వారం నుంచి దర్శనమిచ్చిన స్వామి వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్‌ బోబ్డే శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. ఆయనకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్‌ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథిగృహం వద్దకు చేరుకున్న సీజేకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.

అలాగే, ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న జిల్లెలగూడలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సబితా ఇంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఇవాళ వేకువజామున మత్స్య వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకున్న శోభ, కవితకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజానంతరం ఆలయ అర్చకులు వారికి ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న కవిత రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించానని చెప్పారు.