హిందూమతంలో పుట్టిన వారు ఏదో ఒక సందర్భంలో ఆలయాలను సందర్శించకుండా ఉండరు. ప్రతిరోజూ ఆలయాలకు వెళ్లే వారు కొందరైతే, ఉత్సవాల రోజుల్లో ఆలయాలను సందర్శించి భగవంతునికి పూజలు చేసేవారు. మరికొందరుంటారు. అలయాన్ని సందర్శించే భక్తులు ముందుగా ఆలయ పరిసరాల పరిశుభ్రత, పూజా విధానాన్ని నిశితంగా గమనిస్తారు. ఒక ఆలయం శోభాయమానంగా ఉందనుకుంటే దాని వెనుక ఆ ఆలయ కార్యనిర్వాహణాధికారి పడే కఠోర శ్రమను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.

అర్చకులు, ఆలయ సిబ్బంది భక్తులను సంతృప్తి పరిచే పనిలో ఉంటున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాల్లో సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆలయాలకు భక్తులు అధికంగా రావాలన్నా, ఆదాయం పెరగాలన్నా అది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమర్ధత మీదే ఆధారపడి ఉంటుంది. విశాఖపట్నంలో పనిచేస్తున్న మహిళా వెంక్యూటివ్ ఆఫీసర్లు పురుషులతో సమానంగాను మరికొన్ని సందర్భాల్లో వారికి మించిపోయి పనిచేస్తూ ఆలయాల ఔన్నత్యాన్ని కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు.

అలయాల్లో జరిగే ఉత్సవాలను అందరూ మెచ్చే రీతిలో నిర్వహిస్తూ తమ తమ ప్రతిభా కౌశలాన్ని చాటుకొంటున్నారు. ఒకరికొకరు పోటాపోటీగా పనిచేస్తూ తాము ఎందులోనూ తక్కువ కామంటున్నారు. ఆలయాల ఆస్తులను కాపాడడంలో కూడా ఎవరు వెనుకడుగు వేయడం లేదు. తక్కువ వయసులో రిక్రూట్ అయిన వారు కూడా బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది మంది మహిళా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు దర్భముళ్ళ భ్రమరాంబ, అన్నపూర్ణలు నేరుగా దేవాదాయ శాఖలో చేరి పదోన్నతులపై ఈ స్థాయికి వచ్చారు. మరొకరు ఎస్.జే.మాధవి రెవెన్యూ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాగా డెప్యూటేషన్‌పై ఈఓగా పనిచేస్తున్నారు. మరో ముగ్గురు ఈటలు శిరీష, ఎం.నీలిమ, షి, హైమావతిలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్ కాగా వారిలో ఒకరు హైమావతి అంధురాలు కావడం గమనార్హం.

మరో ఇద్దరు జి .వి.రమాభాయి, పద్మ టెంపుల్ సర్వీస్‌లో చేరి పదోన్నతిపై ఈఓలయ్యారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న రీజనల్ జాయింట్ కమిషనర్ డి. భ్రమరాంబి, డిప్యూటీ కమిషనర్ సుజాత, సహాయ కమిషనర్ కె. శాంతి కూడా మహిళలు కావడం విశేషం. ఈ అధికారులంతా కర్తవ్య నిర్వహణలో రాజీపడకుండా తమతమ పాలనానుభవాన్ని రంగరిస్తూ భగవంతుని ముచ్చట్లు తీరుస్తున్నారు. వీరంతా దేవుని ఆస్తుల సంరక్షకులు అయినప్పటికీ భక్తుల మనసెరిగి పనిచేస్తూ ఆలయాల గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు. భగవంతునికి ఏమి కావాలో ఆ విధంగానే పూజా విధానాన్ని అర్చకులు ద్వారా నిర్వర్తిస్తూ దేవ దేవుళ్లు, అమ్మవార్ల సేవలో పునీతులవుతున్నారు. ఏటా జరిగే ఉత్సవాలను తమ సామర్థ్యానికి మించి జరుపుతున్నారు.

విమర్శలు, ప్రతి విమర్శలు, రాజకీయ, డిపార్ట్మెంట్ ఒత్తిళ్లు ఎలా ఉన్నప్పటికీ బాధ్యతలను గుర్తెరిగి పనిచేస్తున్నారు. సర్వీసులో ఎక్కడ ఎటువంటి మచ్చ లేకుండా పనిచేస్తూ దేవాదాయ శాఖకు ఈ మహిళా రత్నాలు వన్నె తెస్తున్నారు. ముందుముందు మరింత సమర్థవంతంగా పని చేస్తూ మెరుగైన వసతులు కల్పిస్తూ ఆలయాల గొప్పతనం చాటి చెబుతూ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండేలా కృషి చేస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కరోనాతో కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పలు ఆలయాలు మూతపడినప్పటికీ, తెరిచి ఉన్న ఆలయాల్లో మాత్రం సామాజిక దూరం, మాస్కులు, శానిటైజ్ చేస్తూ భక్తులకు భగవంతుని దర్శనం కల్పిస్తూ వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నారు.

కరోనాతో విధి నిర్వహణ కష్టసాధ్యమైనప్పటికీ కర్తవ్య నిర్వహణలో తమపై ఉన్న బాధ్యతలను విస్మరించకుండా పనిచేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులంతా శ్రావణమాసోత్సవాలు, వరలక్ష్మి వ్రతం వేడుకల్లో తలమునకలై వున్నారు. వీరంతా మెరుగైన ప్రజా సంబంధాలతో భక్తులను మెప్పిస్తూ వారి పట్ల మరో శ్రావణలక్ష్మిలే అవుతారని ఆశిద్దాం.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, ‘ఎరుక’ దినపత్రిక ప్రాంతీయ బాధ్యులు; +91 98491 47350)