సదరం క్యాంపు నిర్వాహకులను జక్కనపల్లి గణేష్ నిలదీస్తున్న దృశ్యం

కరీంనగర్, మే 4 (న్యూస్‌టైమ్): ‘సదరం’ క్యాంపుల పేరిట దివ్యాంగుల సహనాన్ని పరీక్షిస్తున్నారు ప్రభుత్వ వైద్యులు కొందరు. అంగవైకల్యాన్ని నిర్ధారించి ధ్రువీకరణ పత్రాలను జారీచేయాల్సిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో అర్హత కలిగిన వికలాంగులు పింఛన్లకు నోచుకోక నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని వికలాంగులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, పక్షవాతంతో మంచాన పడ్డ ఎంతోమంది సర్కార్‌ పింఛన్‌ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన ఇచ్చే పింఛన్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూడాలంటే అందుకు సదరం సర్టిఫికేట్ తప్పనిసరి. వికలాంగుల సదరన్‌ సర్టిఫికెట్‌ కోసం అనేక దఫాలుగా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విసిగివేసారిపోయిన వారెందరో ప్రభుత్వ వైద్యులు కనికరించకపోవడంతో పింఛన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

నడిచే శక్తి సామర్థ్యం లేక ఇతరులపై ఆధారపడి బతుకుతూ దుర్భర జీవితం గడుపుతున్నామని కన్నీటి పర్వతమైయ్యారు. తమ దుస్థితి చూసి కూడా డాక్టర్లకు జాలి కలగలేదని తెలిపారు. బస్సుల్లో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆటోలను అద్దెకు తీసుకొని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి ఉదయం ఆరేడు గంటలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి మధ్యాహ్నం అయినా పరీక్షలు నిర్వహించే డాక్టర్ రాకపోవడంతో విసిగిపోయిన బాధితులు మీడియా ఎదుట తమ గోడు వివరించారు. ఉదయం ఆసుపత్రి పనివేళలు ప్రారంభమయ్యే సమయానికి రావాల్సిన వైద్యుడు మధ్యాహ్నం ఒంటి గంట అయినా రాని రోజులే ఎక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాప్తి సమయంలోనూ తమకు కష్టాలు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో పింఛన్‌కు, ఇతర రాయితీలకు నోచుకోలేకపోతున్నామని బోరున విలపించారు.

‘సదరం’ క్యాంపు నిర్వాహకులను నిలదీసిన గణేష్

దివ్యాంగులకు (వికలాంగులకు) ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు గాను మంగళవారం నాడు కరీంనగర్‌లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సదరం క్యాంపునకు పరీక్షలు నిర్వహించే డాక్టర్ కుమార్ సకాలంలో రాకపోవడం వల్ల దివ్యాంగులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులకు గురయ్యారని బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అడ్వకేట్ జక్కనపల్లి గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఆయన సదరన్ క్యాంపును సందర్శించి నిర్వాహకులను నిలదీశారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వికలాంగుల రక్షణకై ఎలాంటి కోవిడ్ నివారణ చర్యలు తీసుకోకపోవడం ఆసుపత్రి అధికారుల పనితీరుకు నిదర్శనం అన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా డాక్టర్ రాకపోవడంతో ఉదయం తొమ్మిది గంటల నుంచి వికలాంగులు కూర్చోవడానికి వసతులు లేక, తాగడానికి మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అన్నారు. కరోనా సమయంలో సదరం క్యాంపులు రద్దు చేయాలని, ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి సదరు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ నాయకులు బోయిని కృష్ణ బాబు, ఎనగందుల అనిల్, ఉప్పులేటి రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.