తిరుపతి, ఆగస్టు 6 (న్యూస్‌టైమ్): యావత్ భారతావణి ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్యలో నిన్న జరిగిన రామమందిర భూమి పూజ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోవడానికి కారణాన్ని వెల్లడించి ఆ వివాదానికి టీటీడీ ముగింపు పలికే ప్రయత్నం చేసింది.

‘‘తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం లైవ్ కారణంగానే అయోధ్యలో శ్రీ రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో లైవ్ ఇవ్వలేకపోయాము. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి స్వామి వారి నిత్య కళ్యాణం నిరంతరాయంగా లైవ్ ఇస్తూనే ఉన్నాము. స్వామి వారి కల్యాణాన్ని ప్రతిరోజూ కోట్లాది మంది భక్తులు చూస్తారు. తిరుమలలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో బుధవారం నాడు శ్రీ కుప్పా శివ సుబ్రమణ్యం అవధాని అయోధ్యలో జరగనున్న రామ మందిర భూమి పూజ గురించి మాట్లాడారు. రామమందిర నిర్మాణం భూమి పూజ 12 – 44 గంటల సమయంలో నిర్ణయించారు. ఆ సమయంలో శ్రీవారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉన్నందున అయోధ్య కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోయాము’’ అని టీటీడీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

అయితే, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట న్యూస్ బులిటిన్లో అయోధ్య కార్యక్రమం ఎస్వీబీసీ ప్రముఖంగా ప్రసారం చేసిందని తెలిపింది. రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషనుతో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసిందని, టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉందని, పాలక మండలి ఈ దిశగా అనేక చర్యలు తీసుకుందని పేర్కొంది.

అయోధ్య కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకపోవడాన్ని రాష్ట్రంలోని బీజేపీ నాయకుల సహా అధికార పార్టీ వ్యతిరేకులు సైతం పెద్ద ఎత్తున విమర్శించారు. ‘‘ఎస్వీబీసీకి ఇంతకంటే ప్రముఖ హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటుందా? స్వయాన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న ఈ భూమిపూజకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణం’’ అంటూ బీజేపీ అసంతృప్తి వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. నిన్న మధ్యాహ్నం నుంచే ఈ విమర్శలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన నేపథ్యంలో టీటీడీ గురువారం స్పందించడం గమనార్హం.