కాకినాడ పోర్టులో తప్పిన ఘోర ప్రమాదం

1360
  • ఆఫ్‌షోర్ క్రేన్లు కుప్పకూలడంతో పది మందికి గాయాలు

  • భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లేనని నిరసన

కాకినాడ, డిసెంబర్ 29 (న్యూస్‌టైమ్): కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టులో శనివారం ఘోర ప్రమాదం తప్పింది. భారీ ఓడల నుంచి సరకు కిందకు దించేందుకు ఉపయోగించే ఆఫ్‌షోర్‌ క్రేన్లు రెండు కుప్పకూలడంతో పది మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్రేన్ల శిథిలాల కింద మరికొంత మంది కార్మికులు చిక్కుకున్నారు.

ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడిని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వట్టిపల్లి లక్ష్మణ్‌ కుమార్‌ (35)గా గుర్తించారు. గాయపడిన మరో కార్మికుడు పోతిలేడి ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా దెబ్బతిన్న క్రేన్‌ను మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భారీ క్రేన్లు కుప్పకూలిపోవడంతో అక్కడి కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌) సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు, పోర్టు యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందునే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు నిరసన వ్యక్తంచేశారు.

అయితే, జరిగిన దుర్ఘటనపై అటు పోలీసు యంత్రాంగం, ఇటు పోర్టు యాజమాన్యం వేర్వేరుగా విచారణ జరుపుతున్నాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చింది. గాయపడ్డ కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు కేఎస్‌పీఎల్ అధికారులు తెలిపారు.