మచిలీపట్నం, అక్టోబర్ 12 (న్యూస్‌టైమ్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగల 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్నం ఆర్డీఓ ఎన్ఎస్‌కె ఖాజావలి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సముద్రతీర మండలాలు మచిలీపట్నం, కోడూరు, నాగాయలంక, కృష్ణానది తీరప్రాంత మండలాలు ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ ప్రాంతాలలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందన్నారు.

లోతట్టు ప్రాంతాలు ముందుగా గుర్తించి అవసరమైతే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించుటకు సిద్ధంగా ఉండాలని, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన ముందస్తు చర్యలు గైకొనాలని ఆర్డీఓ ఆయా మండల తహసీల్దార్లు, మచిలీపట్నం, పెడన మున్సిపల్ కమీషనర్లకు ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని ఈ మేరకు వారికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలక్టర్ తహసిల్దార్లకు టెలికాన్ఫరెన్సు నిర్వహించి అప్రమత్తంగా చేస్తూ ఆదేశాలు ఇచ్చారన్నారు.

వరదతాకిడి మండలాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, వరద పరిస్థితి ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. గ్రామాల్లో టాంటాం వేయించాలన్నారు. లంక గ్రామాలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన బోట్లు సిద్ధం చేయాలన్నారు. ఆయా మండలాల్లో పీహెచ్‌సీలలో పాము కాటు మందులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌డివో కార్యా లయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 08672-252486 ఏర్పాటు చేసినట్లు ఆర్‌డీవో తెలిపారు.