పట్టణాల ప్రగతే లక్ష్యం: మంత్రి సత్యవతి

57

వరంగల్, ఫిబ్రవరి 25 (న్యూస్‌టైమ్): వరంగల్ అర్బన్ జిల్లా ఈస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతి వార్డుకు 60 మంది సభ్యులతో కమిటీ వేస్తున్నామని, వార్డులో అవసరాలు తీర్చేందుకు పట్టణ ప్రగతి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రికి అత్యంత ఇష్టమున్న నగరం వరంగల్ అని, అనేక హామీలు ఇచ్చి, అందులో కొన్ని పూర్తి అయ్యాయయనీ తెలిపారు. మరికొన్ని కొనసాగుతున్నాయని, పట్టణం పెరిగే క్రమంలో ఇష్టం వచ్చినట్లు లే అవుట్లు, కట్టడాలు వచ్చాయయని, కొన్ని భూములు ఆక్రమణకు గురి అయ్యాయని తెలిపారు. వీరిలో పేదవాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారని మంత్రి తెలిపారు.

మున్సిపాలిటీలు అంటే మురికి కూపాలు, అవినీతి నిలయాలు అన్న పేరు పొందాయని, నేడు పట్టణ ప్రగతిలో ఈ పేరు మార్చి పట్టణాలు అంటే ప్రగతి నిలయలుగా మార్చే ఉద్దేశ్యంతో పని చేస్తున్నామని, పల్లెల నుంచి పట్టణాలకు వివిధ కారణాలతో వచ్చే వారి మౌలిక అవసరాలు తీర్చే విధంగా మన పట్టణ ప్రణాళిక ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.

‘‘ప్రభుత్వ స్థలాలు గుర్తించాలి. స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు నిర్మించాలి. మురికి కాలువలు రోజు రోజు పరిశుభ్రం చేయాలి. రోడ్ మీద స్తంభాలు ఉన్నాయి. వీటివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాటిని పట్టణ ప్రగతిలో అక్కడి నుంచి తొలగిస్తాము. పట్టణాల్లో ఉన్న అవసరాలను తీర్చే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా పట్టణ ప్రగతి నిర్వహించుకోవాలి. ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు.