ఆపద సమయాన అడవిలో ‘సీతక్క’

0
25 వీక్షకులు
మారుమూరు గిరిజిన గ్రామాల్లోని అడవి బిడ్డలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ట్రాక్టర్‌పై వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్క

ములుగు, మే 2 (న్యూస్‌టైమ్): ఆపదకాలంలో అడవిబిడ్డల పాలిట ఆమె ఆశాదీపమైంది. ఆదివాసీల ఆకలి తీర్చేందుకు నిత్యం కొండా, కోనల్లో పర్యటిస్తోంది. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా, ఆపన్నులకు అమ్మగా, విపత్కర పరిస్థితుల్లో తన ప్రజల కోసం పరితపిస్తోంది ములుగు ఎమ్మెల్యే సీతక్క. అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీతక్క పేదల ఆకలి తీర్చేందుకు ‘గో హంగర్‌ గో’ పేరుతో ఛాలెంజ్‌ విసిరారు.

కరోనా విపత్తున… కాలినడకన… ఎమ్మెల్యే సీతక్క

కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ, ఎంతో మందికి పూట గడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డల ఆశాదీపంగా వారి ఆకలి తీర్చేందుకు నిరంతరం పరితపిస్తోంది ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క.

కరోనా కష్టాల్లో ఉన్న అడవి బిడ్డలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క

లాక్‌డౌన్‌ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి.. ప్రజా ప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ నిత్యావసర సరకులను అందిస్తున్నారు. రాత్రింబవళ్లు గుత్తి కోయల గూడేలలో పర్యటిస్తూ ప్రజల్లో భరోసా నింపుతున్నారు. ములుగు నియోజకవర్గంలో 7 వందలకు పైగా పల్లెలుండగా ఇప్పటి వరకు 320 గ్రామాల్లో పర్యటించిన సీతక్క అందరికీ నిత్యావసరాలు అందజేశారు.

పేదలకు స్వయంగా నిత్యావసర సరుకులు అందజేస్తున్న అనసూయ

ఆదివాసీలకు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పు దినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా పంపిణీచేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో, అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి, ప్రజలకు అందిస్తున్నారు. కరోనా పట్ల అవగాహన తక్కువగా ఉండే గిరిజన గూడేలలో వైరస్‌ వ్యాప్తిని తెలియజేస్తూ మాస్కులు పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు పౌష్ఠికాహారం, అప్రమత్త చర్యలను తెలియజేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజన గ్రామాల పర్యటనలో చెలిమల్లో దప్పిక తీర్చుకుంటూ అడవుల్లోనే సేదతీరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here