పీసీసీ పీఠం కోసం పాకులాట…

హైదరాబాద్, డిసెంబర్ 6 (న్యూస్‌టైమ్): రాజకీయంగా క్రమంగా కనుమరుగవుతున్న కాంగ్రెస్‌ పార్టీలో మరో ముసలం మొదలైంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్‌ ఓటర్‌ హస్తం పార్టీకి మొండిచెయ్యి చూపడంతో అలక బూని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి షరామామూలుగా తన రాజీనామా లేఖను బయటకు తీశారు. ఓటమికి నైతిక బాధ్యత నాదేనంటూ పల్లవి అందుకున్నారు.

ఇంకేముంది ఎప్పటి నుంచో పీసీసీ పీఠం కోసం కాచుక్కూచున్న కాంగ్రెస్‌ సీనియర్లలో ఒక్కసారిగా ఆశలు పుట్టుకొచ్చాయి. ‘చే’జారిపోతున్న పార్టీకి జవసత్వాలు తెచ్చి జిల్లాకు ఒకరుగా ఉన్న పార్టీ లీడర్లను, క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చే సత్తా తనకే ఉన్నదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా ప్రకటించుకొన్నారు. తెలంగాణ కోసం పదవీత్యాగం చేసిన తనకంటే గొప్పవాళ్లు లేరని కితాబిచ్చుకొన్నారు. పనిలోపనిగా పీసీసీ చీఫ్‌ రేస్‌లో తానే ఉన్నానంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించుకొన్నారు.

ఇదిలా ఉంటే సైకిల్‌ దిగి రాహుల్‌గాంధీ చేతిలో ‘చెయ్యి’వేసుకొంటూ పార్టీలోకి వచ్చిన మల్కాజ్‌గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి తనను మించిన సమర్థుడు లేనేలేడన్న తరహాలో చెప్పుకొంటున్నారు. రాష్ట్రంలో మిగిలిన పార్టీలను ఎదుర్కొనేందుకు తాను అవసరమైతే నోరు చేసుకోగలనంటూ అధిష్ఠానం దగ్గర ఇప్పటికే మార్కులు కొట్టేశానన్న ధీమాలో ఉన్నారు. రేవంత్‌రెడ్డికి ఎక్కడ పీసీసీ చీఫ్‌ ఇస్తారోనని ఇప్పటికే కాంగ్రెస్‌లోని కురువృద్ధులంతా అతడిపై అవకాశం ఉన్నప్పుడల్లా మాటలదాడి చేస్తూనే ఉన్నారు.

ఈ విషయంలో వీహెచ్‌ ముందు వరుసలో ఉన్నట్టు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందునుంచి కాంగ్రెస్‌లో ఉంటున్న తమకే పార్టీ చీఫ్‌ బాధ్యతలు వస్తాయన్న ఆశతో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య వంటివాళ్ల జాబితా చాంతాడుకంటే పొడుగే ఉంటుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత శనివారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పెట్టిన విలేకరుల సమావేశంలో అంతా కలిసి కూర్చున్నట్టుగానే ఫొటోలకు ఫోజులిచ్చినా ఎవరి మదిలో వాదన వారికి ఉన్నదని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో మరోమారు సీనియర్‌ నాయకుడు జానారెడ్డి తెరపైకి వచ్చారు.

చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన, ఈ ఉపఎన్నికలో బీజేపీలో చేరబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో మరో హాట్‌ టాపిక్‌గా మారింది. మొత్తంమీద క్యాడర్‌లేని పార్టీకి డజన్లకొద్ది లీడర్లు పోటీపడుతున్నారు. కానీ ఢిల్లీ నాయకుల దయ ఎవరిపైన ఉంటుందో అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

పదవి కావాలని అడిగా.. తప్పేముందీ?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయనే చెప్పాలి. బలం పుంజుకొని బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. స్థానాలు తగ్గడంతో టీఆర్ఎస్‌లో ఆందోళన నెలకొంది. అటు ఎంఐఎం తన సీట్లను తాను కాపాడుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయంతో టీపీసీసీ చీఫ్ పదవికి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ ఏఐసీసీకి లేఖ పంపారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త అధ్యక్షుడు ఎవరు? పార్టీ చీఫ్ పగ్గాలు చేపట్టేది ఎవరు? అన్న చర్చ అన్ని పార్టీల్లో కూడా మొదలైంది.

ఇప్పటికే ఎంపీ ఎ. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి వంటి నాయకులు పీసీసీ చీఫ్ రేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై మీడియా చిట్‌చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తనకు పీసీసీ చీఫ్‌ ఇవ్వండి అని అధిష్టానాన్ని అడిగానని పేర్కొన్నారు. అయితే ఆ అవకాశాలు కూడా ఉన్నాయన్నారు.

అంతేకాకుండా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు అంతా తనకే మద్దతు ఇస్తారని తెలిపారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీని బతికించాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను పీసీసీ పదవి అడగడంలో న్యాయం ఉందన్నారు కోమటిరెడ్డి. ఎన్‌ఎస్‌యూఐ నుండి పనిచేశానని, తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదిలేశానని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరోవైపు పీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క లాంటి ఇతర నేతలు కూడా ఉన్నారు. అధిష్టానం పిలిచి పగ్గాలు అప్పగిస్తేనే స్వీకరించాలనే ఉద్దేశంలో జీవన్‌రెడ్డి కూడా ఉన్నారు. మరి హైకమాండ్ ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.