సినిమా హాళ్లు కార్మికులకు భరోసా ఏది?

అసంఘటిత రంగం కన్నా దారుణమైన ఇబ్బందులు

(* డాక్టర్ ఎం.ఆర్.ఎన్. వర్మ)

సినిమా ప్రపంచంలో సక్సెస్ఫుల్‌గా పెట్టిన పెట్టుబడులలో కాసుల వర్షం కురిపించే వివిధ రాష్ట్రంలో, కేంద్రపాలిత ప్రాంతంలోనూ కీలక పాత్ర వహిస్తున్న సినిమా హాళ్లు.. అందులో పని చేసే కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. వినోదం కాపలాదారులకు కాలే కడుపులే కోవిడ్-19 మిగిల్చింది. సినిమా థియేటర్లు మూతపడడంతో వాటిలో పని చేసే ఆపరేటర్లు, బుకింగ్ క్లర్క్‌లు చూపరులు సినిమా హాళ్లలో శౌచాలయాల కార్మికులు, ప్రవేశ ద్వారం వద్ద టికెట్లు తనిఖీ చేసే సిబ్బంది, క్యాంటిన్ సిబ్బంది, సైకిల్, స్కూటర్ స్టాండ్లు, కార్ పార్కింగ్ సిబ్బందితో పాటు సినిమాని సమాజానికి పరిచయం చేసే వాల్ పోస్టర్లు అంటించే కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపనలు, ప్యాకేజీలు కరోనా నేపథ్యంలో వీరి జీవితాల్లో కనీసం కడుపు నింపలేకపోతున్నాయి. ఏ రోజుకు తమ బతుకులకు పాత రోజులు వస్తాయోనని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా మహానగరాల నుంచి చిన్న చిన్న పట్టణాల వరకు 3,763 సినిమా హాళ్లు ఉన్నాయి.

అందులో మల్టీప్లెక్సులు, ఐనాక్స్ థియేటర్లు అదనంగా వుంటున్నాయి. దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలు దక్షిణాది రాష్ట్రాల్లోనే సినిమా హాళ్లు ఎక్కువగా వుండడం గమనార్హం. అందులో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 923 సినిమా హాళ్లు వుండడం కొసమెరుపు. ఆంధ్రాలో 572, తెలంగాణలో 351 ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అగ్రభాగాన ఒక్క తమిళనాడులోనే 745 సినిమా హాళ్లు ఉంటున్నాయి. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 572 సినిమా హాళ్లు ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సినిమా హాల్ కలిగిన రాష్ట్రాలుగా త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, గోవా, డైమండ్ డైన్, దాదర్, నాగర్ వల్లీలో ఒక్కో సినిమా హాలు ఉన్నాయి.

అండమాన్లో 2 ఉన్నాయి. దేశ రాజధాని అయిన ఢిల్లీలో 43 సినిమా హాళ్లే ఉండడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా పాండిచ్చేరిలో 14 సినిమా హాళ్లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో పువ్వులు అమ్మిన చోట కనీసం కట్టెలు కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. కరోనా లాక్‌డౌన్లో మొదటి రెండు నెలలు సగం జీతాలు చెల్లించి ఈ రోజు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా సినిమా థియేటర్ల యాజమాన్యాలు చేతులెత్తేయడంతో సినిమా హాళ్లపై ఆధారపడి బతికే కార్మికుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. అభిమాన ప్రముఖ హీరో సినిమా విడుదల సందర్భంలో ముఖ్యంగా పండగల్లో, వేసవి సెలవుల్లో సినిమా హాళ్లకు ఉన్న రద్దీ అంతా ఇంతా కాదు. ఆ సందర్భాల్లో వారి పరిచయస్తులు, స్నేహితులు, విజ్ఞాపనలతో సినిమా హాళ్లలో పని చేసే పై స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది సహాయంతో సినిమా టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటారు.

అంత డిమాండ్, క్రేజ్ కలిగిన సినిమా హాళ్ల సిబ్బందిని ఈ రోజు పలుకరించే వాడు కరువై ఎవరు ఆదుకుంటారా? అని దీనంగా ఎదురు చూసే పరిస్థితి వుంది. పెద్ద సినిమాలు విడుదలైన సందర్భంలో బ్లాక్ టిక్కెట్ల దందాతో పాటు పోలీసులు, రెవెన్యూ, ప్రజాప్రతినిధులకు షోల వారీగా టిక్కెట్ల కేటాయింపు కోత వుండడం సర్వ సాధారణం. అభిమాన నాయకుడు సినిమా విడుదలైతే ఫ్యాన్స్ థియేటర్ల ముందు కటౌట్లు, అలంకరణలు, హారతులు, సినిమా వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి సినిమా హాల్స్ ఈ రోజు ప్రదర్శనలు లేక వెలవెలబోతున్నాయి. అందులో పని చేసే కార్మికులకు ఎప్పటికి సినిమా హాల్స్ ప్రారంభమవుతాయి, తమ బతుకుల్లో ఒక్క పూటైనా కడుపు నింపుకోడానికి ఉపాధి దొరుకుతుందో ఎదురు చూడడమే మిగిలింది.

అభిమాన సంఘాలు తమ హీరోల సినిమాలు సక్సెస్ చేయడంలో సిబ్బందితో సమన్వయం సినిమా కార్మికులు మరిచిపోలేకపోతున్నారు. సంక్రాంతి, శివరాత్రి, స్థానిక జాతరల సందర్భాల్లో రాత్రి, పగలూ జాగారణ కోసం సినిమా ప్రదర్శనలతో సిబ్బంది బిజీలను తలుచుకుని కుమిలిపోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో సైతం టెంట్లు పేరుతో కూర్చొని రేకుల షెడ్లు సినిమా హాల్స్ నుండి నగరాల్లో భారీ షాపింగ్ మాల్స్‌లో ఆధునిక ఐనాక్స్ థియేటర్లు సైతం దాదాపు 133 రోజులుగా ప్రదర్శనలు లేక, ఆదాయం లేకపోవడంతో సినిమా హాల్స్‌పై ఆధారపడి బతికే కార్మికుల కడుపులు కాలిపోతున్నాయి. కనీస వేతనాల చట్టం ఉన్నప్పటికీ సినిమా హాల్స్ యాజమాన్యాలు ఖాళీ ఓచర్లలో సంతకాలు తీసుకుని నామమాత్రపు జీతాలే చెల్లించడం సర్వసాధారణం. నాగరిక ప్రపంచంలో చిత్రాల మాయా ప్రపంచం ప్రజలను ఎంతో ప్రభావితం చేస్తుంటుంది.

తెర వెనుక సినిమా హాల్స్ కార్మికులు కరోనా నేపథ్యంలో కష్టాలు విపరీతం. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మళయాళ సినిమాలతోముఖ్యంగా హాస్యం, థ్రిల్లర్, హీరోయిజం, సస్పెన్స్, అనేక సినిమాలతో ఎంతో ఉత్సాహంగా విధుల్లో పాల్గొనే కార్మికులు ఒక్కసారిగా అవి కనుమరుగు అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా సినిమా హాల్స్‌లో పని చేసే కార్మికులంతా ప్రైవేటు రంగంలోనే వుంటారు. అసంఘటిత రంగంలో కార్మికులకు వచ్చే ఆదాయానికి కూడా వీరు నోచుకోవడం లేదు.

సినిమా హాల్స్‌లో 40 సంవత్సరాలు అనుభవం వున్న వారు సైతం నేటికీ విశాఖ నగరంలాంటి నడిఒడ్డులో వున్న హైటెక్ సినిమా హాలో 14 వేల లోపే జీతానికి నోచుకుంటున్నారు. సాధారణ సినిమా హాల్స్‌లో బుకింగ్ క్లర్క్‌లు నలుగురు, గేట్ వద్ద టిక్కెట్లు తనిఖీ చేసే సిబ్బంది ఆరుగురు, స్వీపర్లు ఇలా మొత్తం ఒక సినిమా హాల్‌లో 30 మంది వరకు సిబ్బంది బతుకుతుంటారు. నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో మల్టీప్లెక్సులు రావడం నాలుగు సినిమా థియేటర్లు కలిపి 20 మందితోనే కొనసాగించడంతో గణనీయంగా కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. కార్మికులు ఇంత జీతం కావాలని చట్టాలు ఇలా ఉన్నాయని నిలదీసి అడిగే పరిస్థితి లేదు. ఇచ్చిన జీతంతోనే సర్దుకోవడం పరిపాటి. కరోనా నేపథ్యంలో మొదటి రెండు మాసాలు సగం జీతం ఇచ్చినా నేడు రూపాయి కూడా ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. పైగా సినిమా హాల్స్ యాజమాన్యాలు ముందు జాగ్రత్తగా కార్మికుల వద్ద నుంచి వ్యక్తిగతంగా సెలవు కోరుతున్నట్టు ఉత్తరాలు రాయించుకుని జాగ్రత్త పడ్డారు.

విశాఖలో రామకృష్ణ, లక్ష్మీ టాకీస్, సంగం, శరత్ తదితర థియేటర్లు మూతపడ్డాయి. చిత్రాలయ, సరస్వతి థియేటర్లు భారీ హోటల్స్‌గా, షాపింగ్ మాల్స్‌గా మారిపోయాయి. వేల కోట్లు కలెక్షన్లు సినిమా హాల్స్‌లో పని చేసే కార్మికుల పాత్ర ఎంతో కీలకం. అలాంటి కార్మికులకు కరోనా నేపథ్యంలో కనీసం మేమున్నామనే నాధుడు కరువయ్యారు. సినిమా హీరోలకు, సైడ్ యాక్టర్లకు, సినిమా పరిశ్రమలో పని చేసే సాంకేతిక సిబ్బందికి వివిధ సంఘాలు మేమున్నామని చేయూతనిస్తుంటే సినిమా హాల్లో పని చేసే వేలాది మంది కార్మికులకు ఎలాంటి ఆదరణకు నోచుకోకపోవడం బాధాకరం. వినోదపు పన్ను పేరుతో సినిమా హాల్స్ నుంచి 20 శాతం పన్నులు వసూలు చేసే వారు ఈ రోజు సినిమా ప్రదర్శన సందర్భంలో అమ్మిన టిక్కెట్ల ఆదాయం నుంచి 40 శాతం పన్నులు ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయినా సినిమా హాల్స్‌లో పని చేసే కార్మికులను గాలికొదిలేస్తోందన్న అసంతృప్తి వారిలో వుంది. శని, ఆదివారాల్లో సినిమా హాల్స్‌లో రద్దీ అంతా ఇంతా కాదు. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే వారం రోజులపాటు వంద శాతం అదనంగా టిక్కెట్లు ఉన్నా సినిమా హాల్స్ కార్మికులకు అదనపు పనికి తగ్గ అదనపు చెల్లింపులు వుండవు. కొన్ని సినిమా హాల్స్ సినిమా డిస్ట్రిబ్యూటర్లో రోజువారీ అద్దె తీసుకుంటారు.

కొన్ని సందర్భాల్లో మొదటి వారం రోజులు వినోదపు పన్ను పోను వచ్చిన ఆదాయంలో సగం సగం వాటాలు, రెండో వారంలో 60 శాతం డిస్ట్రిబ్యూటరు, 40 శాతం సినిమా హాల్ యజమానికి, మూడో వారం వచ్చే సరికి 40 శాతం డిస్ట్రిబ్యూటరు, 60 శాతం సినిమా హాల్ యజమానికి ఆదాయాలు వాటాలు వేసుకుంటారు. ఇలా ఎవరి వాటాలు వారికి చేరిపోతుంటాయి. కానీ సినిమా హాలులో పని చేసే కార్మికులను ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆదాయం పొందే వాణిజ్య పన్నుల శాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, సినిమా హీరోలు గాని, డిస్ట్రిబ్యూటర్లు, యాజమాన్యాలు పట్టించుకోకపోవడం పట్ల సినిమా కార్మికులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆదాయం కోసం కొన్ని సందర్భాల్లో ఆరు షోలకు కూడా అనుమతులిస్తుంటారు. సినిమా హాల్స్‌లో క్యాంటిన్ అద్దెలు ఎక్కువ కావడం, అందులో విక్రయించే పానీయాలు, స్నాక్స్ అధిక రేట్లకు విక్రయించడం సర్వసాధారణం. ఇదంతా ప్రేక్షకులపై భారమవుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీన వైఖరే నేటికీ సినిమా హాల్ కార్మికులను కరోనాలో కూడా పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడింది.

సినిమా తీస్తే పాత రోజుల్లో ఒక ఫిలిం తీయడానికి 75 వేలు ఖర్చయ్యేది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజు యూఎఫ్ఓ, పీహెచ్ఓ, టీయూబీ లాంటి కంపెనీలు ఆన్‌లైన్ సేవలతో వారానికి 10 నుంచి 15 వేల రూపాయలు ఫీజులతో ఫిలింలు లేకుండా ప్రత్యక్ష సేవలందిస్తున్నాయి. సినిమా కార్మికులు రంగుల ప్రపంచంలో కీలకమైన సినిమా తెరవెనుక కరోనా తెచ్చిన కష్టాలు అంతా ఇంతా కాదు. కనీసం ప్రభుత్వం వెండితెరను ప్రారంభిస్తామని అన్‌లాక్ 3.0పై కేంద్ర హోం శాఖ కసరత్తు చేసి కబురు ఊరటనిస్తున్నప్పటికీ హాల్స్‌లో చిత్రాలు తిలకించడానికి 25 శాతం సిట్టింగ్‌తోనే సినిమా హాళ్లకు అనుమతిస్తామనడం కార్మికులకు ఎలాంటి ఊరటనిస్తుందో వేచి చూడాలి.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, +91 94919 99678; ‘విశాలాంధ్ర’ సౌజన్యంతో…)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here