అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈసీ కొత్త నిబంధన

11161

రాజకీయ నాయకులు అలవికాని హామీలిస్తూ గద్దెనెక్కాలని చూస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా తాయిలాలతో ప్రభావితం చేసి అనుకున్నది సాధిస్తారు. అధికార పగ్గాలు చేపట్టేందుకు కొందరు నేరమయ చరిత్రను దాచుకునేందుకు మరికొందరు రాజకీయాల వైపు దృష్టిసారిస్తున్నారు. ఇవీ ప్రతి ఎన్నికల్లో వెలుగుచూసేవే. నేరచర్రిత ఉన్న వారిని నిలువరించాలని, ఇందుకు పార్టీలే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులో వెల్లడించింది. నేరాలను అడ్డుకుని స్వచ్ఛ రాజకీయ నాయకులు ఎన్నికయ్యేలా చేసేందుకు ఎన్నికల సంఘం సంస్కరణల బాట పట్టింది.

అందులో భాగంగా తాజాగా విప్లవాత్మకమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. అభ్యర్థుల నేర చరిత్రను ప్రజల ముందు పెట్టాల్సిందేనని స్పష్టంచేసింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలోనే అభ్యర్థులు నింపే నామపత్రాల్లో ఈ వివరాలు తప్పనిసరిగా చేర్చాలని తెలిపింది. వారి నేరాలు, కేసుల వివరాలు, వాటి సెక్షన్లు, ప్రస్తుత స్థితి, ఒకవేళ శిక్షలు అనుభవించే కేసులుంటే వాటి వివరాలు ఇలా సమగ్ర నేర చరిత్రను ప్రజలకు తెలియచెప్పాలని తేల్చిచెప్పింది. ఈ నిబంధన తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నుంచే అమల్లోకి వస్తుందని సీఈసీ స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ.

తప్పు చేశామని తామే ప్రజలకు చెబితే వారు తమకు ఎలా ఓట్లు వేస్తారనే ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన గత ఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీనిచ్చి కాంగ్రెస్‌ జిల్లాలో తన బలాన్ని చాటుకుంది. కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి నాయకుల్లోని ముఖ్యులు ఇక్కడి నుంచే గెలుపొందారు. దీంతో ఈసారి అన్ని స్థానాల్లో పాగా వేసేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. అధికార పార్టీలో కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడటం, హత్య రాజకీయాలకు సహకరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లవెత్తాయి. ఈ విషయాలు పలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.

మిగిలిన పార్టీల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య నాయకులకు నేర చరిత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి 40 మందికి పైగా వివిధ పార్టీల నుంచి పోటీపడే అవకాశముంది. వీరిలో ఎంత మందికి నేర చర్రిత ఉంటుందో తెలియాలంటే నామినేషన్లు ముగిసేవారు ఆగాల్సిందే. అభ్యర్థులంతా తమ నేరాల చిట్టాను నామపత్రాల్లో స్పష్టంగా పొందుపరచాల్సిందే. తమ ఎన్నికల ఖర్చును వినియోగించి నేరాలు, కేసుల వివరాలు, ప్రకటనలు, వార్తల రూపంలో పొందుపరిచి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు వెల్లడించాలి. ఇందుకు అధిక ప్రజాదరణ కలిగిన ప్రతికలు, ఛానళ్లను మాత్రమే ఎంచుకోవాలని ఈసీ నిబంధన విధించింది.

అభ్యర్థుల ఖర్చు రూ.28 లక్షలుగా విధించిన నేపథ్యంలో ప్రకటనల వ్యయాన్ని పార్టీలు భరించే వెసులుబాటును కల్పించింది. ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు ఈ తంతు ముగించాలని పేర్కొంది. ఎన్నికలు పూర్తయిన నెల వ్యవధిలో తమ అభ్యర్థుల వివరాలన్నీ ఆయా పార్టీలు నివేదిక రూపంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. వాటికనుగుణంగా తర్వాత చర్యలు తీసుకుంటారు.

తాజా నిర్ణయం అభ్యర్థులకు మరో ముఖ్య పనిని తెచ్చిపెట్టింది. గత ఎన్నికలంటే ప్రచారాలు, ఆకర్షణలు, తాయిలాల పంపిణీ, గెలుపు కోసం వ్యూహాలు రచించడం, ఎత్తుకుపైఎత్తు వేసి గెలవడమే లక్ష్యంగా పోరాటం చేసేవారు. ప్రస్తుత ఎన్నికల్లో వీటన్నింటితోపాటు వైరి వర్గాల నేర చర్రితను తవ్వే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు అటువైపు దృష్టి సారించినట్లు సమాచారం. తమతో పోటీపడే అభ్యర్థుల గతాన్ని నిశితంగా పరిశీలించి వారి తప్పులను గుర్తించేందుకు న్యాయశాస్త్ర నిపుణులను నియమించుకునేందుకు యోచిస్తున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ఐటీ నిపుణులను నియమించుకుని పార్టీలు విజయం సాధించిన ఉదాహరణలు కోకొల్లలు. ప్రత్యర్థుల నేర జీవితాన్ని తవ్వి తీసి ఆయన నామపత్రాల్లో పొందుపరిచిన వివరాలు సరైనవా? కావో తేల్చుకుని తప్పుడు వివరాలు నమోదుచేస్తే వాటిని అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లడమే నిపుణుల ప్రధాన విధి. వీరికి అడిగినంత జీతభత్యాలు ఇచ్చేందుకూ వెనకాడటం లేనట్లు తెలుస్తోంది.