న్యూఢిల్లీ, రాజ్‌కోట్, జనవరి 1 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్‌కోట్ తాలూకు నిర్మాణ ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజున శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష్ వ‌ర్ధన్‌, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ్ వ్ర‌త్‌, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాణీ కూడా పాలుపంచుకొన్నారు. ఈ సంద‌ర్భంలో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ మాన‌వాళిని కాపాడ‌టం కోసం ప్రాణాల‌ను నిరంతరం ప‌ణంగా పెట్టిన ల‌క్ష‌ల కొద్దీ వైద్యుల‌ను, ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను, పారిశుధ్య కార్మికుల‌ను, ఇత‌ర‌త్రా ముందు వ‌రుస‌లో నిల‌చిన క‌రోనా యోధుల ప్ర‌యాస‌ల‌ను స్మరించుకొన్నారు. శాస్త్రవేత్త‌ల కృషిని, అంతేకాక ఈ క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు ఆహారాన్ని పూర్తి సమర్పణ భావంతో అందించిన వారంద‌రి కృషిని కూడా ఆయ‌న ప్ర‌శంసించారు.

భార‌త‌దేశం ఒక్క‌టిగా ఉన్న‌ప్పుడు అది అత్యంత క‌ష్ట‌మైన సంక్షోభాన్ని సైతం దీటుగా ఎదుర్కోగ‌లుగుతుంద‌ని ఈ సంవ‌త్స‌రం చాటిచెప్పింద‌ని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్ర‌భావవంత‌మైన చ‌ర్య‌ల ఫ‌లితంగా భార‌త‌దేశం ఎంతో మెరుగైన స్థితిలో ఉంద‌ని, మ‌రి క‌రోనా బాధితుల‌ను కాపాడ‌డంలో భార‌త‌దేశం రికార్డు ఇత‌ర దేశాల కంటే ఎంతో మెరుగ్గా ఉంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశంలో టీకామందును తయారు చేయడానికి సంబంధించిన స‌క‌ల స‌న్నాహాలు జరుగుతున్నాయి అని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశంలో తయారు చేసే టీకాను దేశంలోని ప్రతి ప్రాంతానికి శరవేగంగా చేర్చేందుకుర ప్ర‌య‌త్నాలు తుది ద‌శకు చేరుకొన్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచంలోనే అతి పెద్దది అయినటువంటి టీకాల‌ను వేయించే ఉద్య‌మాన్ని నిర్వహించడానికి భార‌త‌దేశం స‌న్నాహక చర్యలు పూర్తి స్థాయిలో సాగుతున్నట్లు ఆయ‌న చెప్పారు. టీకాలను ఇప్పించే కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి కింద‌టి ఏడాదిలో సంక్ర‌మ‌ణ‌ను నివారించ‌డం కోసం మ‌నం చేసిన విధంగానే క‌ల‌సిక‌ట్టుగా ముందుకు పోదాం అంటూ ఆయ‌న పిలుపునిచ్చారు.

ఎఐఐఎమ్ఎస్ రాజ్‌కోట్ గుజ‌రాత్‌లో ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల‌ను, వైద్య విద్య‌ను అభివృద్ధి చేస్తుంద‌ని, ఉద్యోగావ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని మోదీ అన్నారు. ప్రత్యక్షంగా దాదాపు 5 వేల కొలువులు, ప‌రోక్షంగా అనేక నౌక‌రీలు ఏర్ప‌డ‌తాయని ఆయ‌న అన్నారు. కోవిడ్‌తో పోరాడ‌డంలో గుజ‌రాత్ ప్రయాసలను ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొంటూ, గుజ‌రాత్ కోవిడ్‌పై యుద్ధం చేయ‌డంలో మార్గాన్ని చూపించింద‌న్నారు. క‌రోనా స‌వాలును గుజ‌రాత్ మెరుగ్గా ఎదుర్కొన్నందుకు ఖ్యాతి అంతా అక్క‌డి ప‌టిష్ట‌మైన వైద్య‌ రంగ మౌలిక స‌దుపాయాల‌కే ద‌క్కుతుంది అని ఆయ‌న అన్నారు. వైద్య చికిత్స రంగంలో గుజ‌రాత్ సాధించిన ఈ సాఫల్యానికి వెనుక రెండు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ప‌ట్టు విడువ‌క సాగిన ప్ర‌య‌త్నాలు, స‌మ‌ర్ప‌ణ భావం, సంక‌ల్పం ఉన్నాయని ఆయ‌న చెప్పారు.

దేశంలో స్వాతంత్య్రం అనంత‌రం అనేక ద‌శాబ్దాలు గ‌డచిపోయిన‌ప్ప‌టికీ 6 ఎఐఐఎమ్ఎస్‌లు మాత్ర‌మే ఏర్పాటు అయ్యాయని ప్ర‌ధాన మంత్రి అన్నారు. అట‌ల్ జీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న 2003వ సంవ‌త్స‌రంలో, మ‌రో 6 ఎఐఐఎమ్ఎస్‌ల‌ను నెల‌కొల్ప‌డం కోసం చ‌ర్య‌లను తీసుకోవ‌డ‌ం జరిగిందని, గ‌త ఆరేళ్ళ‌లో 10 నూత‌న ఎఐఐఎమ్ఎస్‌ల ఏర్పాటు తాలూకు ప‌నులు మొద‌ల‌య్యాయన్నారు. అనేకం ప్రారంభం కూడా అయ్యాయని ప్రధాన మంత్రి వివ‌రించారు. ఎఐఐఎమ్ఎస్‌తో పాటే 20 సూప‌ర్ స్పెశాలిటీ హాస్పిటల్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. 2014 వ సంవ‌త్స‌రాని క‌న్నా ముందు మ‌న ఆరోగ్య రంగం విభిన్నమైన దిశ‌ల‌లో, మార్గాల‌లో కృషి చేస్తూ వ‌చ్చింద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

2014 వ సంవ‌త్స‌రం త‌రువాత ఆరోగ్య రంగం స‌మ‌గ్ర‌ కృషిని చేసింద‌ని, ఆధునిక చికిత్స సౌక‌ర్యాల‌కు ప్రాధాన్యాన్ని ఇస్తూనే నివార‌క సేవ‌లకు కూడా పెద్ద పీట వేసింద‌న్నారు. పేద‌ల చికిత్స ఖ‌ర్చును ప్ర‌భుత్వం త‌గ్గించింద‌ని, అదే కాలంలో వైద్యుల సంఖ్య‌ను త్వరితగతిన పెంచ‌డంపై కూడా శ్ర‌ద్ధ తీసుకొంద‌ని ఆయ‌న అన్నారు. ‘ఆయుష్మాన్ భార‌త్’ ప‌థ‌కంలో భాగంగా మారుమూల ప్రాంతాల‌లో ఇంచుమించు 1.5 మిలియన్ హెల్థ్ ఎండ్ వెల్‌‌నెస్ సెంట‌ర్‌లను ఏర్పాటు చేసే ప‌నులు జ‌రిగాయ‌ని, వీటిలో దాదాపుగా 50000 సెంట‌ర్‌లు ఇప్ప‌టికే ప‌ని చేయ‌డం ప్రారంభించాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. వాటిలో సుమారు 5 వేల సెంట‌ర్‌లు ఒక్క గుజ‌రాత్‌లోనే ఉన్నాయ‌ని చెప్పారు. ర‌మార‌మి 7000 జ‌న్ ఔష‌ధి సెంటర్‌లు సుమారు మూడున్న‌ర ల‌క్ష‌ల పేద రోగుల‌కు మందుల‌ను త‌క్కువ ఖ‌ర్చులో అందిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను గురించి ఆయ‌న ఒక్క‌టొక్క‌టిగా వివ‌రించారు.

2020వ సంవ‌త్స‌రం ఆరోగ్యప‌ర‌మైన స‌వాళ్ళ సంవ‌త్స‌రంగా ఉండ‌గా, 2021వ సంవ‌త్స‌రం ఆరోగ్య సంబంధిత ప‌రిష్కార మార్గాల సంవ‌త్స‌రంగా నిల‌వ‌బోతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌పంచం మ‌రింత చైతన్యంతో ఆరోగ్య ప‌రిష్కారాల దిశ‌లో ప‌య‌నించగలదన్నారు. 2020వ సంవ‌త్స‌రం తాలూకు స‌వాళ్ళ‌కు ఎదురొడ్డి నిల‌వ‌డంలో భార‌త‌దేశం త‌న పాత్ర‌ను పోషించిన‌ట్లుగానే ఆరోగ్య ప‌రిష్కారాల విష‌యంలో కూడా ఒక ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. 2021వ సంవ‌త్స‌రంలో ఆరోగ్య‌ సంబంధ ప‌రిష్కారాల విష‌యంలో భార‌త‌దేశం తోడ్పాటు ఆ ప‌రిష్కారాల స్థాయిని పెంచ‌డంలో కూడా కీల‌కం కానుంద‌ని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశ వైద్య‌ రంగ వృత్తి నిపుణుల స‌త్తాతో పాటు సేవా భావాన్ని గ‌మ‌నిస్తే, దానికి భార‌త‌దేశంలో భారీఎత్తున చేపట్టబోయే టీకాలను వేయించే కార్యక్రమ అనుభ‌వం తాలూకు నైపుణ్యం ప్ర‌పంచానికి ఆక‌ర్ష‌ణీయ‌మైన‌టువంటి, అందుబాటులో ఉండేట‌టువంటి ప‌రిష్కారాల‌ను అందించ‌గ‌ల‌ద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఆరోగ్య రంగంలోని అంకుర సంస్థ‌లు స్వాస్థ్య సంబంధిత ప‌రిష్క‌రాల‌ను, సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం చేసి, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను అంద‌రికీ అందుబాటులోకి తెస్తున్నాయ‌న్నారు.

‘‘ఆరోగ్య‌ ప‌ర‌మైన భవిష్య‌త్తుతో పాటు భ‌విష్య‌త్తు కాలంలోని ఆరోగ్యం రెంటిలో భార‌త‌దేశం ఒక ముఖ్యమైనటువంటి పాత్ర‌ను నిర్వ‌హించ‌బోతోంది’’ అని మోదీ అన్నారు. వ్యాధులు ప్ర‌పంచ‌వ్యాప్తం అవుతున్న కారణంగా ప్ర‌పంచ‌ వ్యాప్త ఆరోగ్య ప‌రిష్కారాల ప‌ట్ల స‌మ‌న్వ‌యంతో కూడిన ప్ర‌పంచ ప్ర‌తిస్పంద‌నకు సైతం స‌మ‌యం ఆస‌న్నం అయింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ప‌నిని భార‌త‌దేశం ఒక ప్ర‌పంచ శ్రేణి పాత్ర‌ధారిగా నిర్వ‌ర్తించినట్లు ఆయ‌న చెప్పారు. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు స‌ర్దుబాటు చేసుకోవ‌డం, ఎద‌గ‌డం, కార్య‌క‌లాపాల‌ను విస్త‌రించ‌డం ద్వారా భార‌త‌దేశం త‌న ప్రావీణ్యాన్ని నిరూపించుకొంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశం ప్ర‌పంచంతో పాటు అడుగులు వేసి సామూహిక ప్ర‌యాస‌ల‌కు విలువ‌ను జోడించింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌పంచ ఆరోగ్య రంగానికి భార‌త‌దేశం ఒక కీల‌క కేంద్రంగా ఆవిర్భ‌విస్తోంద‌ని, భార‌త‌దేశం ఈ భూమిక‌ను 2021వ సంవ‌త్స‌రంలో మ‌నం మ‌రింత బ‌లోపేతం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here