హైదరాబాద్, అక్టోబర్ 24 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఎంగిలిపూలతో మొదలైన పూల పండుగ సద్దులతో ముగిసింది. తీరొక్క పువ్వలతో లొగిళ్లు పూల వనాలుగా మారగా ఉయ్యాల పాటలతో మార్మోగాయి. దసరా అంటేనే గుర్తుకొచ్చే సంబురం బతుకమ్మ పండుగ. శీతాకాలపు తొలి రోజుల పువ్వలనే దేవుళ్లుగా భావించి పూజించడం తెలంగాణలో విశేషం. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ సంబురాలకు మహిళల సిద్ధమయ్యారు. కరోనా వేళ ఎవరికి వారే పరిమితంగా బతుకమ్మ ఆటలాడుతుండగా వచ్చే ఏడాదైనా తమ కష్టాలు తీరేలా చూడు తల్లీ అంటూ ఆ గౌరమ్మను వేడుకుంటున్నారు. కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి కాస్త సందడి తగ్గినా సద్దుల వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే మహిళలు మార్కెట్లలో రంగు రంగుల పూల కొనుగోలు చేసి బారులు తీరడంతో మార్కెట్లు కళకళలాడాయి. గునుగు, తంగేడు పూలు బంతి, చేమంతి, నంది వర్ధనం తదితర రంగు రంగుల పూలను సేకరించారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ మహిళలు బతుకమ్మ సంబురాలను వైభవంగా జరుపుకొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బొడ్డమ్మ ఆడారు. కార్యక్రమంలో కృష్ణ, పద్మావతి, చంద్రకళ, లక్ష్మి, ఉమాదేవి, గీత, రాజేంద్రమణి, శారద, వెంకటరమణ, కృష్ణవేణి, శారద, ఉమాదేవి, రమాదేవి, శ్రీవాణి పాల్గొన్నారు. అదేవిధంగా రాజాపూర్‌ మండలంలోని తిర్మలాపూర్‌ శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దాచని మహేశ్వరి పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి క్రమంలో నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని అధికారులు, నాయకులు పిలుపునిచ్చారు. మాస్కులు ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటిస్తూ ఆటలు ఆడుకోవాలని ముందుగానే కోరారు. ఇదిలా ఉండగా ఆయా ప్రాంతాల్లో నదీ తీరాలు, చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ వేడుకల కోసం అధికారులు, నాయకులు ఏర్పాట్లు చేశారు.

తీరొక్క పూలతో అంగరంగ తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంగిలి పూవ్వు పండుగను తెలంగాణలో సంబురంగా షురూ అయ్యాయి. జగిత్యాల జిల్లా వేములవాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకున్నారు. మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా ఆయా కూడళ్లలో ఆటపాటలతో హోరెత్తించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు. గుడి చెరువు, బతుకమ్మ తెప్ప వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు.

అటు రాష్ట్రవ్యాప్తంగా ఎంగిలి పూవు బతుకమ్మను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయరీతిలో ఆడిపాడారు. కాగా, ఈ ఏడాది అధికమాసం రావడంతో ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి ఈనెల 17 నుండి మళ్లీ యథావిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకొన్నారు. అయితే, మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం కలిగింది. రాష్ట్రమంతా సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు. విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో పాటు సజావుగా బతుకమ్మలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆడ పడుచులకు పలువురు గవర్నర్‌ తమిళసైతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జి. జగదీశ్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్‌ పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌర‌వ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభ‌వానికి చిహ్నంగా నిలుస్తున్న బ‌తుక‌మ్మ పండుగ‌ను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి నేపథ్యంలో తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

మొత్తానికి ఊరూరా బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించారు. మహిళలంతా సాయంత్రం రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఇండ్ల మధ్య ఉంచి ఆట పాటలతో సందడి చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చ బండ భవానీ మండపం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలో మహిళలంతా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకుకొచ్చి ఒక చోట ఉంచి బతుకమ్మ పాటలు పాడారు. అలాగే అంబేద్కర్‌నగర్‌ కాలనీలో ఎల్లమ్మ దేవాలయం వద్ద మహిళలు బతుకమ్మలను ఉంచి ఆటలు అడి పాడారు. హౌసింగ్‌ బోర్డు, రంగారెడ్డి నగర్‌, టీచర్ల కాలనీ, బాలాజీనగర్‌ కాలనీ మహిళలు ఒక చోట చేరి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.

వేడుకల చివరి రోజు కావడంతో మహిళలు పెద్ద సంఖ్యలో సంబరాలు చేసుకుంటూ కనిపించారు. రాజేంద్రనగర్‌ మండల వట్టినాగులపల్లి, మంచిరేవుల, కిస్మత్‌పూర్‌ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. శనివారం సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు ఆటలుఆడి పాడారు. పల్లె పదం, పాదం కలిపారు. ముందు గ్రామ పంచాయతీ పరిధిలో గౌరమ్మను వేడుకున్నారు. శివ.. ఉయ్యాల్లో.. శివుడా.. నిన్ను తలుతూ అంటూ మహిళలు సామూహికంగా అడి పాడారు. సర్పంచుల సమక్షంలో బతుక్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం గౌరమ్మ తీరొక్క పూవులతో బంగారు బతుకమ్మలను తయారు చేశారు. పిల్లా పాపలతో బతుకమ్మ వేడుకలు ఊరూ వాడల్లో సాగాయి. కాగా, దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజేంద్రనగర్‌ మండలంలోని ఆడిటోరియం వద్ద శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ సంబరాలకు ఏపీఎం జయమాళిని ఆధ్వర్యంలో సుమారు ఏడొందల మంది మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా తయారు చేసి ఒక చోట పేర్చి మన సంస్కృతికి అద్దం పట్టే పల్లె పాటలను లయ బద్ధంగా పాడుతూ మహిళలు హుషారుగా ఆడారు. చప్పట్లతో ప్రాంగణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు వెంకట్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, రాంరెడ్డి, ఈఓఆర్డీ అన్నపూర్ణ, శేషగిరిశర్మ తదితరులు పాల్గొన్నారు. ఊట్‌పల్లి అనుబంధ గ్రామమైన ఇంద్రానగర్‌ దొడ్డిలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు యువతులు బతుకమ్మ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సద్దుల బతుకమ్మ కార్యక్రమం తెలంగాణవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఎల్బీ స్టేడియంలో సంబురాలు అంబరాన్ని తాకాయి. ఆడపడుచులంతా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ట్యాంక్‌బండ్‌‌పై శోభాయాత్ర నిర్వహించారు. వివిధ జిల్లాల్లో ఈ వేడుకల చివరి రోజున మహిళలు సద్దుల బతుకమ్మను పేర్చి, గంగమ్మ ఒడికి సాగనంపారు. శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమం తెలంగాణవ్యాప్తంగా ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఆడపడుచులంతా తీరొక్క పూవులతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు బతుకమ్మలతో మహిళలు ర్యాలీగా బయలుదేరారు. ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాలు విద్యుత్‌ దీపాలతో కళకళలాడాయి. హుస్సేన్‌ సాగర్‌ జలాలపై ఆకర్షణీయంగా బతుకమ్మ కటౌట్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్‌పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల బతుకమ్మలను పేర్చిన మహిళలు బతుకమ్మ సంబరాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మను పేర్చి, గంగమ్మ ఒడికి సాగనంపారు.