వరంగల్, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): మనోధైర్యామే కరోనాకు నిజమైన మందు అని, సర్కారు దవాఖానలో ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకుందాం, కరోనాను జయిద్దామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. పాలకుర్తి పరిధిలోని కరోనా బాధితులతో మంత్రి టెలిఫోన్‌లో మాట్లాడి మనోధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ‘‘కరోనా తీవ్రత తగ్గింది.. భయపడకండి.. మీకు మనో ధైర్యం కల్పించడం కోసమే నేను ప్రతి రోజూ మాట్లాడుతున్నా.’’ అన్నారు.

‘‘రోజు రోజుకు కరోనా తగ్గుతుండటం శుభ పరిణామం… తాజా పరీక్షల్లో ఒకటి రెండు కేసులు కూడా నమోదు కాలేదని మంత్రి తెలిపారు. కరోనాకు సర్కారు దవాఖానలో మంచి మందులు ఇస్తున్నారన్నారు. ఇచ్చిన ఆ మందులను సరిగ్గా వేసుకోవాలన్నారు. కరోనాకు నిజమైన మందు మన మనోధైర్యమే. ఆ ధైర్యం ఇవ్వడం కోసమే నేను ప్రతి రోజూ మీతో మాట్లాడుతున్నాను’’ అని అన్నారు. కరోనా బాధితుల్లో నిరుపేదలు వుంటారని వాళ్ళని గుర్తించి ప్రజా ప్రతినిధులు అందుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు మంత్రితో స్వయంగా మాట్లాడి ధన్యవాదాలు తెలిపారు.