భారత ఆర్థిక వ్యవస్థపై పన్నుల ప్రభావం

0
14 వీక్షకులు
  • నేడు అంతర్జాతీయ కస్టమ్స్‌ దినోత్సవం సందర్భంగా…

న్యూఢిల్లీ, జనవరి 26 (న్యూస్‌టైమ్‌): ప్రభుత్వం అనుసరించే పన్ను విధానం ప్రభుత్వ రాబడిని పెంచే విధంగా, వివిధ ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉండాలి. పన్ను వసూళ్లకు, ఆర్థికాభివృద్ధికి ప్రత్యక్ష సంబంధం ఉంది. సరళీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాల్లో ప్రైవేట్‌ రంగ పాత్ర పెరిగిన కారణంగా ప్రభుత్వం సాంఘిక అవస్థాపన కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాంఘిక అవస్థాపన కల్పన కోసం పన్ను రాబడిని పెంచుకోవాలి.

పన్ను రాబడిలో వృద్ధిని కొలవడానికి పన్ను-జీడీపీ నిష్పత్తిని ఉపయోగించొచ్చు. 1990 తర్వాత పన్నుల విధానాన్ని ఓసారి పరిశీలిస్తే… భారతదేశంలో 1990ల్లో పన్ను నిర్మాణతలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎక్సైజ్‌, కస్టమ్స్‌ డ్యూటీ రేట్లలో తగ్గుదల వచ్చింది. వ్యక్తిగత, కార్పొరేషన్‌ పన్ను అంతర్జాతీయ ప్రమాణాల కంటే తక్కువగా ఉంది. ప్రత్యక్ష పన్నులకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చారు. 1994-95లో సేవలపై పన్ను ప్రవేశపెట్టారు. 1994-95లో ఈ పన్ను ద్వారా రూ.410 కోట్ల రాబడి లభించింది. 2009-10లో సేవలపై పన్ను ద్వారా రూ. 58,319 కోట్ల రాబడి వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ మొత్తం రాబడిలో పన్నుల నుంచి వచ్చే రాబడి అధికంగా ఉంటుంది. 2009-10లో కేంద్ర ప్రభుత్వ రాబడిలో పన్నుల వాటా 65 శాతం, పన్నేతర రాబడి వాటా 35 శాతం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 264, 293 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను వివరిస్తాయి. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ లిస్ట్‌-1లో కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులను వివరించారు.

వ్యవసాయ ఆదాయం మినహా ఇతర ఆదాయాలపై పన్ను, కార్పొరేషన్‌ పన్ను, కస్టమ్స్‌ డ్యూటీలు, ఎక్సైజ్‌ డ్యూటీలు, ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్స్‌పై స్టాంప్‌ డ్యూటీలు, రైల్వే సరుకు, ప్రయాణికుల చార్జీపై పన్ను, టెర్మినల్‌ ట్యాక్స్‌, ఎస్టేట్‌ డ్యూటీ, మూలధన రాబడి పన్ను, న్యూస్‌ పేపర్ల అమ్మకాలు, కొనుగోలు, ప్రకటనలపై పన్నులు కేంద్ర ప్రభుత్వం విధించే పన్నుల్లో ముఖ్యమైనవి. ఏడో షెడ్యూల్‌లోని లిస్ట్‌-2లో రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పన్నులను పేర్కొన్నారు.

భూమిశిస్తు, న్యూస్‌పేపర్‌ మినహా మిగిలిన వస్తువుల అమ్మకం, కొనుగోలుపై పన్ను, వ్యవసాయ ఆదాయంపై పన్ను, భూమి, భవనాలపై పన్ను, మత్తు పానీయాలపై ఎక్సైజ్‌ పన్ను, ఫైనాన్షియల్‌ డాక్యుమెంట్లు మినహా మిగతా వాటిపై విధించే స్టాంప్‌ డ్యూటీ వృత్తిపన్ను, న్యూస్‌ పేపర్‌లోని ప్రకటనలు మినహా మిగిలిన వివిధ ప్రకటనలపై పన్ను, విద్యుచ్ఛక్తి అమ్మకం, కొనుగోలుపై పన్ను మొదలైన పన్నులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం పన్నులను విధించి, వసూలు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పన్నులను విధించి, వసూలు చేసే పన్నుల్లోనూ రాష్ట్రాలకు వాటా ఉంటుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల రాబడి పంపిణీ వాటాను నిర్ణయిస్తుంది. రాష్ట్రాలకు సంబంధించిన రాబడి, వాటి మధ్య ఏ ప్రాతిపదికన నిర్ణయించాలో రాష్ట్రపతికి ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తుంది. 13వ ఆర్థిక సంఘం పన్ను రాబడిని వివిధ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి జనాభా, విస్తీర్ణం, కోశపరమైన క్రమశిక్షణ అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొంది.

స్వాతంత్య్రానంతరం పన్నుల రాబడికి సంబంధించి పరోక్ష పన్నుల ద్వారానే ప్రభుత్వానికి అధిక రాబడి లభించేది. 2007-08లో మొదటిసారి ప్రత్యక్ష పన్నుల వాటా మొత్తం పన్నుల రాబడిలో 49.9 శాతానికి చేరుకొని, తర్వాత కాలంలో పెరిగింది. పన్ను ప్రాతిపదికలో వచ్చే మార్పునకు, పన్ను రేటులో వచ్చే మార్పునకు మధ్య సంబంధాన్ని బట్టి పన్నులను పురోగామి, తిరోగామి, అనుపాత పన్నులుగా విభజిస్తారు. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక అసమానతలను నిర్మూలించడానికి పురోగామి పన్ను విధానం ఉపకరిస్తుంది.

సామాజిక న్యాయాన్ని సాధించడానికి ఈ పన్ను విధానం ఎంతగానో తోడ్పడుతుంది. భారత్‌లో విధించే అధిక పన్నులు అనుపాత పన్ను విధానానికి సంబంధించినవి. పన్ను ప్రాతిపదిక పెరిగినా లేదా తగ్గినా పన్నురేటు స్థిరంగా ఉంటే దాన్ని అనుపాత పన్ను విధానం అంటారు. తిరోగామి పన్ను విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంది. పన్ను ప్రాతిపదిక పెరిగితే పన్నురేటు తగ్గడం, పన్ను ప్రాతిపదిక తగ్గితే పన్నురేటు పెరగుతూ ఉంటే దాన్ని తిరోగామి పన్ను విధానం అంటారు. కేంద్ర కేబినెట్‌ ప్రత్యక్ష పన్ను కోడ్‌ బిల్లును ఆగస్ట్‌ 26, 2010న ఆమోదించింది.

దీన్ని ఆగస్ట్‌ 30, 2010న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వ్యక్తు లు, కంపెనీలకు సంబంధించి ఈ బిల్లులో కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చారు. రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. ప్రభుత్వం అనుమతించిన ఫండ్‌లపై పెట్టుబడికి సంబంధించి పన్ను మినహాయింపు పరిమితి రూ. 1 లక్ష. లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌, ట్యూషన్‌ ఫీజు మొదలైన వాటిపై పెట్టుబడిలో రూ. 50 వేల వరకు పన్ను రాయితీ. గృహ రుణాల వడ్డీలో రూ. 1.5 లక్షల వరకు పన్ను రాయితీ.

విద్యా రుణాలకు అదనపు సబ్సిడీ వంటివి… అదే విధంగా కంపెనీలకు సంబంధించినవి వాటిని పరిశీలిస్తే… కార్పొరేషన్‌ పన్ను 30 శాతం. బుక్‌ ప్రాఫిట్‌లో 20 శాతం కనీస ప్రత్యామ్నాయ పన్ను. డివిడెంట్‌ పంపిణీలపై పన్ను 15 శాతంగా ప్రతిపాదించారు. 1950-51లో పన్ను-జీడీపీ నిష్పత్తి 4.3 శాతం. తర్వాత కాలంలో ఇది పెరిగింది. పంచవర్ష ప్రణాళికల్లో ప్రభుత్వ రంగ పెట్టుబడికి సంబంధించి స్వదేశీ బడ్జెటరీ వనరుల్లో భాగంగా పన్నుల రాబడిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

దీంతోపాటు దిగుమతుల పెరుగుదల, తయారీ రంగ విస్తరణ నేపథ్యంలో ఈ నిష్పత్తిలో పెరుగుదల ఆవశ్యకత ఏర్పడింది. 1987లో అధిక కరువుతో దేశంలో తిరోగమన పరిస్థితులు ఏర్పడి, రెవెన్యూ రాబడి స్తంభించింది. 1990-91లో పన్ను-జీడీపీ నిష్పత్తి 10.1 శాతం ఉంది. 2001-02లో ఇది 8.2 శాతానికి తగ్గి, 2009-10లో 9.6 శాతానికి చేరుకుంది. పన్నుల అడ్మినిస్ట్రేషన్‌లో ప్రగతి కారణంగా పన్ను-జీడీపీ నిష్పత్తిలో పెరుగుదల సాధ్యమైంది. పాలనా సంబంధ పన్ను సంస్కరణలు రెవెన్యూ ఉత్పాదకత పెంపునకు దోహదపడతాయి.

కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించినప్పటికీ ఇప్పటికీ భారత్‌ రక్షిత విధానాలు అమలుచేస్తోన్న దేశంగానే కన్పిస్తోంది. దిగుమతులపై పన్నును సరళతరం చేయడం ద్వారా రెవెన్యూ రాబడి తగ్గినప్పటికీ, మిగిలిన అన్ని పన్నుల రెవెన్యూ ఉత్పాదకతలో పెరుగుదల ఉంటుంది. పన్ను సంస్కరణల్లో భాగంగా ముఖ్యంగా ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌పై దృష్టి సారించాలి. 2011-12 బడ్జెట్‌లో వస్తు, సేవలపై పన్ను విధింపును ఏప్రిల్‌ 1, 2012 నుంచి ఆర్థికమంత్రి ప్రతిపాదించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు వస్తువులపై విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, స్థానిక పన్నులను విధించగా వచ్చిన రాబడిని తమ వద్దే ఉంచుకొంటాయి. 1986లో కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వస్తువులపై వాట్‌ను ప్రవేశపెట్టింది. తర్వాత కాలంలో వస్తువుల సంఖ్యను పెంచుతూ దీని స్థానంలో సిఇఎన్‌ వాట్‌ ప్రవేశపెట్టింది. జీఎస్‌టి భారత్‌ జీడీపీని 0.9 శాతం నుంచి 1.7 శాతం వరకు పెంచగలదు. డాలర్‌ రూపంలో పెరిగే విలువ 9.5 బిలియన్‌ డాలర్ల నుంచి 18.6 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చని నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది.

జీఎస్‌టీ టాక్స్‌ ఇన్‌పుట్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా భారత్‌లో వస్తు, సేవల ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్‌ పోటీతత్వాన్ని పెంచుకోవడం వల్ల ఎగుమతుల రాబడి పెరుగుతుంది. ఒకే పన్ను విధానం అమల్లో ఉన్నప్పుడు కాంప్లియన్స్‌ కాస్ట్‌ తగ్గుతుంది. ఉత్పత్తి కారకాల సమర్థ పంపిణీకి ఎఖీ దోహదపడుతుంది. సాధారణ ధరల స్థాయిలో తగ్గుదల వస్తుంది. ఉత్పత్తి కారకాల వాస్తవిక ప్రతిఫలాల రేటులో పెరుగుదల ఉంటుంది.

నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ అభిప్రాయంలో భూమి వాస్తవిక ప్రతిఫలంలో పెరుగుదల 0.42 నుంచి 0.82 శాతం, వేతనాల్లో పెరుగుదల 0.68 నుంచి 1.33 శాతం, మూలధనం వాస్తవిక ప్రతిఫలంలో 0.37 నుంచి 0.74 శాతం వరకు పెరుగుదల ఉంటుంది. ఉత్పాదకతతో కూడిన ఉపాధి 4 నుంచి 5 మిలియన్ల వరకు అదనంగా లభిస్తుంది. కేంద్ర బ్యాంక్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ రిపోర్ట్‌ 2010- 11లో జి.ఎస్‌.టి. విధింపు వల్ల రాష్ట్రాల రెవెన్యూ రాబడిని విశ్లేషిస్తూ రాష్ట్రాల మధ్య రాబడి వ్యత్యాసాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడింది.

జీఎస్‌టీ విధించిన ప్రారంభ కాలంలో ద్రవ్యోల్బణ సమస్య కొంత మేర ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఇలాంటి అనుభవాలే చవి చూసింది. భారత్‌ స్థానిక మార్కెట్‌లో సప్లయ్‌ చెయిన్‌లోని అసమర్థతను తొలగించుకున్నపుడు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here