ఆకట్టుకుంటున్న టెక్నో ఫెయిర్

154
  • జేఎన్‌టీయూకే విద్యార్ధుల్లో సందడి

కాకినాడ, డిసెంబర్ 27 (న్యూస్‌టైమ్): కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్‌టియుకె) ఆవిర్భవించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జెఎన్‌టియుకె డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (డిఐసి), కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డి)ల సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘టెక్నో ఫెయిర్‌’ విద్యార్ధులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండురోజుల పాటు కొనసాగే ఈ ఫెయిర్ గురువారం ప్రారంభమైంది.

ఈ టెక్నో ఫెయిర్‌లో జెఎన్‌టియుకె, అనుబంధ కళాశాలల ఇంజనీరింగ్‌ విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలు, స్టార్టప్‌ ప్రోగ్రామ్‌లు, ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు సెనేట్‌ హాలులో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్ వి.వి.సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన టెక్నో ఫెయిర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా విశిష్ట అతిథిగాను, ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

యూనివర్సిటీ రెక్టార్‌ ప్రొఫెసర్ ఐ.శాంతిప్రభ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి ప్రొఫెసర్ ఎ. గోపాలకృష్ణ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్‌గా వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఏ వృత్తినైతే ఎంచుకున్నారో ఆ వృత్తికి న్యాయం చేకూర్చాలని, బట్టీ విధానానికి స్వస్తి చెప్పి ఆవిష్కరణలు సాధించేలా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకతతో కూడిన ఆవిష్కరణలను సంఘానికి ఉపయోగపడేలా పరిశోధనలు సాగించి ముందుకు సాగాలన్నారు.

హక్కుల గురించి కాకుండా బాధ్యతలు గురించి ఎక్కువ దృష్టిసారించి దేశం తమకు ఏం చేసిందని ప్రశ్నించకుండా, దేశానికి తాము ఏం చేశామని ప్రతీ ఒక్కరు తమను తాము ప్రశ్నించుకోవాలన్నారు. సమస్యల గురించి ఎత్తి చూపకుండా ఉన్న వనరులతోనే పరిశోధనలు సాగించాలని, మార్పు విద్యార్థుల నుంచే రావాలని సూచించారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగ పద్ధతిలో విద్యనభ్యసిస్తూ ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు. ప్రతీ పనిని సునిశితంగా పరిశీలించి దేశాభివృద్ధికై పరిశోధనలకు పెద్దపీట వేయాలన్నారు. ఐఐటి, ఐఐఎస్‌సి, బిట్స్‌ పిలానీ, ఎన్‌ఐటి వంటి విద్యాసంస్థల్లో 1990లలో ఏర్పాటుచేసిన ప్రయోగశాలల ఫలితమే నేడు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ అన్నారు.

అదేవిధంగా నేటి విద్యార్థుల ఆవిష్కరణలే 20 సంవత్సరాల తర్వాత టెక్నాలజీగా రూపాంతరం చెందుతుందన్నారు. అనంతరం సిఎస్‌ఈ ప్రొఫెసర్‌ ఎ. కృష్ణమోహన్‌ రచించిన పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఉపకులపతి ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు మాట్లాడుతూ ఈ రెండు రోజుల పాటు జరిగే టెక్నో ఫెయిర్‌కి ప్రతీ ఒక్కరు హాజరు కావచ్చునని, విద్యార్థులు తమ ఆవిష్కరణలు, నూతన సాంకేతిక ప్రక్రియలకు ఇదొక మంచి సదావకాశమన్నారు.

టెక్నో ఫెయిర్‌ సందర్భంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లను, నూతన ఆవిష్కరణలను యూనివర్శిటీ అధికారులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌లు, ప్రోగ్రాం డైరెక్టర్‌లు, జెఎన్‌టియుకె, అనుబంధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.