13 రాష్ట్రాల్లో కొత్తగా సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్‌లు

3755

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): మహిళలపై పెరుగుతున్న నేరాలను అరికట్టడంలో భాగంగా త్వరలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సైబర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీలను, డీఎన్‌ఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఈ 13 రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, మిజోరం, మణిపూర్, త్రిపుర, ఢిల్లీ ఉన్నాయని పేర్కొన్నారు.

మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా ఈ కేంద్రాలను నెలకొల్పుతున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టును నిర్భయ నిధి కింద అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సైబర్ ఫొరెన్సిక్ ట్రైనింగ్ ల్యాబొరేటరీలను నెలకొల్పామని చెప్పారు.