విద్యార్థి ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త విధానం ఉందని ప్రశంసలు

ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు ప్రాముఖ్యం పట్ల వెంకయ్య హర్షం

న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్‌టైమ్): కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి నివాస్‌లో కలుసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన 2020వ సంవత్సరపు కొత్త విద్యావిధానాన్ని గురించి కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతికి వివరించారు. విద్యావిధానం ప్రతిని ఉపరాష్ట్రపతికి అందజేశారు. కొత్త విద్యావిధానంలోని ముఖ్యమైన అంశాలను పొందుపరుస్తూ ఒక పత్రాన్ని కూడా కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతికి అందించారు.

ఎంతో దార్శనికత్వంతో కూడిన విద్యావిధానంపట్ల ఉపరాష్ట్రపతి సంతోషం వ్యక్తంచేశారు. బాలలకు, యువకులందరికీ నాణ్యమైన విద్యను మరింత ఎక్కువగా అందుబాటులో తెచ్చే కృషిలో ఈ విధానం ఒక ముందడుగని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. సంపూర్ణమైన, విద్యార్థి ప్రయోజనాలే లక్ష్యంగా, సడలింపులతో కూడిన విద్యావ్యవస్థకు కొత్త విధానంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, భారతదేశాన్ని చైతన్యవంతమైన విజ్ఞాన సమాజంగా తీర్చిదిద్దే వ్యవస్థను ఏర్పరచడమే కొత్త విద్యా విధానం లక్ష్యమని వెంకయ్యనాయుడు చెప్పారు. విద్యావిధానం ఎంతో సమతుల్యంగా ఉందని, విద్యకు సంబంధించి ప్రపంచంలోని ఉత్తమ భావనలను, పద్ధతులను ఆమోదించేదిగా ఉందని ఆయన అన్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వడం హర్షణీయమని ఉపరాష్ట్రపతి అన్నారు. ‘‘విభిన్నత్వం, స్థానిక అంశాలకు తగిన గౌరవం ఇవ్వడం, భారతదేశపు ప్రాచీన భాషలకు ప్రాముఖ్యం ఇవ్వాలన్న అంశాన్ని విద్యావిధానం గుర్తించడం సంతోషకరం. ఈ విధానం విద్యార్థులకు నిస్సందేహంగా ప్రపంచంపై సంపూర్ణ అవగాహనను అందిస్తుంది.’’ అని నాయుడు అన్నారు.

మానవతా విలువలకు, రాజ్యాంగ విలువలకు కొత్త విద్యావిధానం ప్రాధాన్యం ఇవ్వడం, పౌరసత్వాన్ని ఎంతగానో వికసింపజేస్తుందని, దేశంలో ప్రజాస్వామ్య మూలాలు మరింత బలోపేతం కావడానికి ఇది అవసరమని ఉపరాష్ట్రపతి చెప్పారు. సిసలైన ప్రపంచ స్థాయిని, ప్రత్యేకించి భారతీయత్వాన్ని 2020 సంవత్సరపు విద్యావిధానం ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల సద్భావనలను స్వాగతించాలన్న భారతదేశపు తృష్ణను ఇది మరింత పెంపొందిస్తుందని చెప్పారు. ఏ భాషనైనా బలవంతంగా రుద్దడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయరాదన్న దృఢ విశ్వాసాన్ని విద్యావిధానం ప్రతిఫలిస్తోందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.