యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్లకు ఏపీలో గుర్తింపు నిల్..

‘న్యూ మీడియా’ పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మాదిరిగానే యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా వేదికలను ఎంపానెల్‌మెంట్ చేసి, ధరలు నిర్ణయించి, ప్రకటనలు జారీచేయాలన్న జర్నలిస్టుల కోరిక ఇప్పట్లో ఫలించే సూచనలు కనిపించడంలేదు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రస్థాయిలో కూడా అమలుచేయాలన్న వత్తిడిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదిలోనే నీళ్లు చల్లింది. యూనియన్లకు అతీతంగా ‘అఖిల భారత అంతర్జాల, సామాజిక మాధ్యమాల సంఘం’ పేరిట ఉద్యమిస్తున్నామన్న నాయకులు మాత్రం దీనిపై స్పందించకపోవడం శోచనీయం. ఈ సంఘానికి జాతీయ గౌరవ అధ్యక్షుడు హోదాలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బండి సురేంద్రబాబు నాయకత్వంలో ప్రారంభమైన కృషిలో భాగంగా తొలి దశలో సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయించడంతో పాటు రెండో దశలో న్యాయపోరాటానికి దిగారు జర్నలిస్టులు. (ఇదీ చదవండి… ‘న్యూ మీడియా’ రిజిస్ట్రేషన్ తప్పనిసరి)

ఈ మేరకు, ఏపీ హైకోర్టులో అక్టోబర్ మొదట్లో దాఖలైన రిట్ పిటిషన్ నెంబర్‌ 19697పై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేశారు. సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) తరపు న్యాయవాది (ప్రభుత్వ న్యాయవాది) విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ కేసులో నాలుగు వారాల గడువు ఇచ్చారు. అయితే, ఆ గడువు కూడా దాదాపు ముగియడం, అక్రిడిటేషన్ల జారీ విషయంలో సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ రికార్డు స్థాయిలో మరోసారి పొడిగింపు పర్వాన్ని కొనసాగించడం నేపథ్యంలో న్యూ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల్లో ఆశలు చిగురించాయి. కానీ, న్యాయస్థానం ఉత్తర్వులకు జవాబుగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ పిటిషనర్ అభ్యర్ధన అమలు సాధ్యపడదని తేల్చివేసింది. ఈ మేరకు పిటిషనర్‌కు లేఖ కూడా పంపింది. అయితే, ఆ లేఖపై పిటిషనర్ ముందుకు వెళ్లకపోవడం గమనార్హం.

ఇతర యూనియన్లు, అసోసియేషన్ల మాదిరిగా కేవలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకే పరిమితం కాకుండా తమ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్ల అసోసియేషన్ ప్రత్యేకించి ‘న్యూ మీడియా’ విభాగాన్ని ఏర్పాటుచేసి ఆ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, నిర్వాహకుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం కృషిచేస్తూ వస్తోందని మొదట్లో పిటిషనర్ ప్రచారం చేశారు. కానీ, ఇప్పుడు తమ న్యాయ పోరాటం ఎంత వరకు వచ్చింది? తదనంతర పరిస్థితులు ఏమిటన్నదానిపై మాత్రం చెప్పడానికి ఆసక్తికనబర్చడం లేదు.

గతం నుంచి తాము చేస్తున్న పోరాటంలో భాగంగానే అఖిల భారత అంతర్జాల, సామాజిక మాధ్యమాల సంఘాన్ని నెలకొల్పి వారికి ప్రభుత్వ పరంగా న్యాయబద్దంగా రావాల్సిన సదుపాయాల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు పిటిషనర్ చెబుతూ వచ్చారు. తమ సంఘం ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు అందజేసినంత వరకూ అసలు ‘న్యూ మీడియా’లో తామూ ఒక భాగంగా ఉన్నామన్న విషయమే చాలా మంది యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, వెబ్‌సైట్‌ల నిర్వాహకులకు తెలియదంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు. 2016లోనే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో గుర్తించి వెబ్‌సైట్లు (ఇంటర్నెట్ ఎడిషన్లు), యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎంపానెల్‌మెంట్ చేస్తూ రేట్ కార్డులు జారీచేస్తూ వస్తోందని, దీని కోసం కేంద్రం ‘న్యూ మీడియా’ పేరిట ప్రత్యేక మార్గదర్శకాలను కూడా జారీచేసిందని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ‘న్యూ మీడియా’ను గుర్తించి ఆయా సంస్థల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డుల జారీతో పాటు అన్ని రాయితీలు, హక్కులు కల్పించాలని కోరుతూ సురేంద్రబాబు రెండు వేర్వేరు రిట్ పిటిషన్లను హైకోర్టు సీనియర్ న్యాయవాది సిహెచ్.బి.ఆర్.పి.శేఖర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేశారు. ‘న్యూ మీడియా’ జర్నలిస్టుల అక్రిడేషన్‌లపై సురేంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన మొదటి పిటిషన్ నెంబర్: 19314/2020. అలాగే, ‘న్యూ మీడియా’కు సంబంధించిన వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానళ్లకు ఎంపానెల్‌మెంట్ చేసి రేట్ కార్డ్ జారీచేయాలని దాఖలు చేసిన రెండవ పిటిషన్ నంబర్ 19697/2020.

ఈ రెండింటినీ విచారణకు స్వీకరించిన హైకోర్టు నిర్ణీత గడువులోగా పిటిషినర్ అభ్యర్ధనపై సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన మీడియా అవసరాలు, కొత్తగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికత నేపథ్యంలో వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నానాటికీ విస్తరిస్తున్నాయని, ఒకప్పుడు కేవలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రమే పరిమితమైన జర్నలిజం.. నేడు వెబ్ మీడియాకు విస్తరించి తక్కువ సమయంలోనే తన ఉనికిని చాటుకుందన్నారు. అదే క్రమంలో ‘న్యూ మీడియా’ పేరిట నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం జాతీయ స్థాయిలో అందిస్తున్న చేదోడు, ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేనివని, 2016 నుంచి ప్రతి ఏటా వెబ్‌సైట్లు (ఇంటర్నెట్ ఎడిషన్లు), యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఎంపానెల్‌మెంట్ చేస్తూ ఆన్‌లైన్ మీడియా ద్వారా ప్రకటనలు జారీచేస్తూ ఆర్ధికంగా చేయూతనందిస్తోందన్నారు.

అయితే, ఈ ‘న్యూ మీడియా’ రంగానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం రాష్ట్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని, ఉదాహరణకు వెబ్‌సైట్లు (ఇంటర్నెట్ ఎడిషన్లు), యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని న్యూ మీడియా జర్నలిస్టులకు యాజమాన్యాలకు న్యాయం చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలియచేసారు. ఈ రెండు పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు విచారణకు అనుమతించి ‘న్యూ మీడియా’ జర్నలిస్టులకు న్యాయం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడంతో న్యూ మీడియా జర్నలిస్టులు జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయని, ఈ సందర్భంగా ఆయన హైకోర్టు న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘న్యూ మీడియా’ జర్నలిస్టులకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. (ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు)

సాంకేతికతకు అనుగుణంగా మారడం తప్పా?

ఇక, మీడియా రంగంలో సాంకేతికంగా మారుతున్న పరిస్థితులు, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సరికొత్త వెసులుబాట్లను ఉపయోగించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానళ్లు దినదిన ప్రవర్ధమానం చెందుతున్నాయి. గూగుల్ అంచనా ప్రకారం, 2019 నాటికి 31 మిలియన్ యూట్యూబ్ ఛానళ్లు నమోదుకాగా, వీటిలో దాదాపు 25 శాతానికి పైగా న్యూస్ ఛానళ్లే ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఛానళ్ల సంఖ్య రోజురోజుకూ బలంగా పెరుగుతోంది. గత సంవత్సరం ఇది 25% కంటే ఎక్కువ పెరిగింది. 2020 జనవరి 31 నాటి అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఒక యూట్యూబ్ ఛానల్‌ను సృష్టిస్తున్నారు, ప్రతి నిమిషానికి 500 గంటల వీడియోను అప్‌లోడ్ చేస్తున్నారు. గత నెల 3 నాటి అంచనా ప్రకారం, నేడు, 1 మిలియన్ కంటే ఎక్కువ మంది చందాదారులతో 1700కు పైగా భారతీయ యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి.

ఇకపోతే, కరోనా కారణంగా బాగా దెబ్బ తిన్న రంగాల్లో మీడియా ఒకటి. అందులోనూ ప్రింట్ మీడియా అయితే దారుణంగా నష్టపోయింది. ఓవైపు యాడ్ల ఆదాయం తగ్గిపోవడం ఓ కారణం అయితే.. మరోవైపు ప్రింటింగ్ ఖర్చులు పెరిగిపోవడం మరో కారణం. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో అంతగా ఖర్చులు లేకపోయినా.. కనీసం సిబ్బంది వేతనాలకు సరిపోయే యాడ్లు కూడా రావడం లేదు. అయితే, ఇలాంటి సయమంలో జర్నలిస్టులకు యూట్యూబ్ ఓ వరంగా మారింది. గతంలో అనేక యాజమాన్యాల దగ్గర ఊడిగం చేసే కంటే.. కంటెంట్ ఉన్న జర్నలిస్టు ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అటు పేరుకు పేరు.. ఇటు ఉద్యోగానికి దీటుగా సంపాదన లభిస్తోంది. తెలుగులో ఇలా కొందరు జర్నలిస్టులు బాగా సంపాదిస్తున్నారు. ప్రత్యేకంగా రాజకీయాలను విశ్లేషించే వారికి ఈ యూట్యూబ్ రంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. రోజు వారీ పరిణామాల్లోని లోతుపాతులను సాధికారికంగా వివరించే వారిని నెటిజన్లు బాగా ఆదరిస్తున్నారు.

ప్రధాన మీడియా పూర్తిగా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోవడం వల్ల నెటిజన్లు వాస్తవాల వెనుక కథల కోసం ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లను ఆశ్రయిస్తున్నారు. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల వెనుక అసలు కథ ఏంటో వీరు చక్కగా వివరిస్తున్నారు. ఇలాంటి విశ్లేషణ నిష్పాక్షికంగా ప్రధాన మీడియాలో లభించకపోవడం వీరికి వరంగా మారింది. ఒక విధంగా ఈ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఆయా జర్నలిస్టుల ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. గతంలో ఏదో ఒక ఛానళ్లో ఎప్పుడో కొద్దిసేపు కనిపించే వీరు. ఇప్పుడు రోజుకు దాదాపు 10 వీడియోల వరకూ పోస్టు చేస్తూ బిజీగా గడిపేస్తున్నారు. కరోనా వచ్చినా.. గిరోనా వచ్చినా వీరి ఆదాయానికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉంది.

యూట్యూబ్‌ కంటెంట్‌పై మరింత కఠిన ఆంక్షలు…

అదే సమయంలో యూట్యూబ్ ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్నాయి. లక్షల కొద్దీ వీడియోలు ప్రతి నిత్యం అప్‌లోడ్ అవుతున్న తరుణంలో యాజమాన్యం ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి రివ్యూ చేస్తున్న యూట్యూబ్ నిర్వాహకులు పనికిమాలిన వీడియోలను డిలేట్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను సైతం తొలగిస్తున్నారు. ప్రతి రోజు లక్షల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ గూగుల్ సంస్థకు చెందిన యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద దూసుకెళుతోంది. ప్రతి నిత్యం లక్షల కొద్దీ వీడియోలు అప్‌లోడ్ చేసే మహత్తర వేదికగా యూట్యూబ్ క్రెడిట్ అంతా ఇంతా కాదు. న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ.. ఇలా వివిధ రంగాల్లో ఔత్సాహికులకు యూట్యూబ్ మంచి వేదికలా నిలుస్తోంది. అకౌంట్ క్రియేట్ చేయడానికి రూపాయి ఖర్చు లేకుండా పోవడంతో చాలామంది క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లు ఈ దిశగా అడుగులేస్తున్నారు. సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తూ మంచి మంచి వీడియోలు రూపొందిస్తూ నెలకు లక్షల రూపాయలు సంపాదించే యూట్యూబర్స్ కూడా ఉన్నారు. మంచి కన్నా చెడు ఎక్కువగా!

అయితే, అదంతా ఒక పార్శ్వం. మరోవైపు చూస్తే యూట్యూబ్‌లో మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తోందనే వాదనలు లేకపోలేదు. ఆ క్రమంలో సెన్సార్ కటింగ్ లాగా యూట్యూబ్ నిర్వాహకులే చెత్తను తొలగించే పనిలో పడ్డారు. అలా ఈ ఏడాదిలో జూన్ నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇప్పటికే దాదాపు లక్ష వరకు వీడియోలను తొలగించినట్లు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 17 వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లలో నిబంధనలకు విరుద్దంగా ఉన్న లక్ష వీడియోలను డిలేట్ చేసినట్లు తెలిపారు. వాటిలో చాలా మటుకు ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న వీడియోలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ – జూన్‌లో 90 లక్షల వీడియోలు డిలేట్ ఏప్రిల్ – జూన్ క్వార్టర్లీకి సంబంధించి మొత్తం 90 లక్షలకు పైగా వీడియోలను డిలేట్ చేయడమే గాకుండా 40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని నిర్వాహకులు ప్రకటించారు. వాటిలో చాలా మటుకు వీడియోలు వీక్షకులను తప్పు దోవ పట్టించే విధంగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు స్పామ్ కేటగిరీలో కూడా చాలా వరకు వీడియోలు ఉన్నట్లు వివరించారు.

అందుకే ముందు జాగ్రత్తగా అలాంటి వీడియోల్లో కొన్నింటిని ఒక్కరు కూడా వీక్షించకముందే డిలేట్ చేసినట్లు ప్రకటించింది యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్. భవిష్యత్తుల్లో కూడా వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ వీడియోలకు పెద్ద పీట వేస్తూ చెత్త చెదారం లాంటి వీడియోలను ఎప్పటికప్పుడు డిలేట్ చేస్తామని ప్రకటించింది. ఇకపై నిబంధనలను కఠినతరం చేస్తూ వీక్షకులకు ఎలాంటి డిస్ట్రబెన్సు లేకుండా చూస్తామని తెలిపింది. ఆయా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు అప్‌లోడ్ చేసే వీడియోలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు దాదాపు 10 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించింది గూగుల్. చెత్త చెదారం నింపడమే గాకుండా పైన థంబ్ నెయిల్ ఒకటి, లోపల కంటెంట్ మరొకటి ఉంటున్న వీడియోలపై యూట్యూబ్ సీరియస్‌గా ఉంటోంది.

అంతేగాకుండా అత్యాచారం కేసుల్లో మైనర్లను చూపించడం లాంటి విషయాల్లో కూడా ఆచితూచి స్పందిస్తోంది. నేర ప్రవృత్తి కలిగి ఉన్న వీడియోల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వాస్తవానికి మైనర్లను, అత్యాచార బాధితులను నేరుగా చూపించకుండా ముఖానికి మాస్కు వేసేలా బ్లర్ చేస్తూ చూపించడమనేది ఎలక్ట్రానిక్ మీడియా ఫాలో అవుతోంది. కానీ యూట్యూబ్ ఛానళ్ల విషయంలో మాత్రం అది కంట్రోల్ లేకుండా అవుతోంది. అందుకే ఇలాంటి వీడియోలను స్క్రూటినీ చేస్తూ వేలాది వీడియోలను తొలగించడమే గాకుండా ఆయా యూట్యూబ్ ఛానళ్లపై ఉక్కుపాదం మోపుతోంది గూగుల్.

సమాచార విప్లవాన్ని స్వాగతించాల్సిందే…

ఇదే క్రమంలో పత్రిక, మీడియా రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందివచ్చిన టెక్నాలజీ ఈ రంగం కొత్తపుంతలు తొక్కడానికి దోహదపడుతోంది. ఒకప్పుడు టీవీ ఛానల్‌ పెట్టాలంటే వందల కోట్ల వ్యవహారం. ఇప్పుడు నామమాత్రపు ఖర్చుతో సామాన్యులైనా టీవీ ఛానల్‌ పెట్టగల అవకాశం వచ్చింది. ఈ పరిణామాలు ప్రధాన స్రవంతి మీడియాకు పెను సవాలు విసురుతున్నాయి. ఆ మీడియాను కలవరపెడుతున్నాయి. ఒకప్పుడు టీవీ ఛానల్‌ అంటే దూరదర్శన్‌ మాత్రమే. ఆ తరువాత ప్రైవేట్‌ వ్యక్తులకూ లైసెన్సులు ఇవ్వడంతో అనేక న్యూస్‌ ఛానళ్లు ఆవిర్భవించాయి. ఇప్పుడే ఏ భాషలో చూసినా 10–15 న్యూస్‌ ఛానళ్లు కనిపిస్తున్నాయి.

దీన్నే పెద్ద సమాచార విప్లవంగా భావించారు. యూట్యూబ్‌ వల్ల ఇప్పుడు అంతకు కొన్ని వందల రెట్లు మార్పు సంభవింవిస్తోంది. ఒక్కో భాషలో 10–15 ఛానళ్లు కాదు, వందల, వేల టివి ఛానళ్లు వచ్చేశాయి. యూట్యూబ్‌ ఛానళ్ల ప్రవేశంతో వార్తలపైన కొన్ని సంస్థల గుత్తాధిపత్యానికి కాలం చెల్లుతోంది. ఒకటి రెండు సంస్థలు చెప్పిందే వేదం అనే ధోరణికి శుభం కార్డు పడుతోంది. ప్రజలకు అన్ని కోణాల నుంచి సమాచారం తెలుసుకునే అవకాశం లభిస్తోంది. వాస్తవాలను దాచి పెట్టడానికి ప్రధాన స్రవంతి మీడియాకు సాధ్యం కావడం లేదు. దాచిపెట్టినా వెబ్‌ఛానళ్లు వాస్తవాలను జనం ముందుకు తెస్తున్నాయి. ఈ సందర్భంగా తాజా ఉదాహరణ ఒకటి చూపించవచ్చు. ఎన్‌టిఆర్‌ కథానాయకుడు సినిమా విడుదలైన నేపథ్యంలో, ప్రధాన ప్రసంతి మీడియా పట్టించుకోలేదుగానీ మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్‌రావు ఇంటర్వ్యూను వదుల సంఖ్యలో యూట్యూబ్‌ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఒక్కో ఛానల్‌లో లక్షల మంది ఈ ఇంటర్వ్యూలు చూశారు.

ఒకప్పుడు ఎన్‌టిఆర్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి తొలగించి, ఆ కుర్చీలో కూర్చున్న నాదేండ్ల భాస్కర్‌రావును మీడియా ఒక విలన్‌గా చూపుతూ వచ్చింది. నాదేండ్ల భాస్కర్‌రావు తన ఇంటర్వ్యూల్లో నమ్మలేని నిజాలు చెప్పారు. ఇంతకాలం ఇవన్నీ ఎందుకు బయటకు రాలేదనేది ప్రశ్న? ఇదొక్కటే కాదు ప్రధాన స్రవంతి మీడియా, ఆర్థిక ప్రయోజనాలను ఆశించో, రాజకీయ ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతోనే చాచిపెడుతున్న, వక్రీకరిస్తున్న విషయాలను యూట్యూబ్‌ ఛానళ్లు మరో కోణంలో వెలుగులోకి తెస్తున్నాయి.

ఈ ఛానళ్ల వల్ల ఒకే అంశానికి సంబంధించి వివిధ కోణాల్లో విశ్లేషణలు తెలుసుకునే వీలు కలుగుతోంది. ఇది కచ్చితంగా సామాజానికి మేలు చేస్తున్నదనడంలో సందేహం లేదు. వేగంలోనూ మెయిస్‌ స్ట్రీమ్‌ మీడియా కంటే వేగంగా ఉంటున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. సెల్‌ఫోన్‌ ద్వారానైనా లైవ్‌ ఇవ్వగల అవకాశం ఉండటంతో సంప్రదాయ టీవీ ఛానళ్లు ప్రసారం చేసేలోపే యూట్యూబ్‌ ఛానళ్లు వార్తలను ప్రజలకు చేర్చేస్తున్నాయి. ఇక ప్రాంతాల వారీగా, అంశాల వారీగా యూట్యూబ్‌ ఛానళ్లు వస్తున్నాయి. ఇటువంటి అవకాశం ప్రధాన స్రవంతి మీడియాకు తక్కువే. చిన్నచిన్న స్థానిక వార్తలను కూడా యూట్యూబ్‌ ఛానళ్లు దృశ్యమానంగా ఇవ్వడం వల్ల వాటికి ఆదరణ పెరుగుతోంది.

ఇక ప్రకటనల విషయంలోనూ యూట్యూబ్‌ ఛానళ్లు పోటీగా మారుతున్నాయి. ఒక సంప్రదాయ టీవీ ఛానల్‌కు ప్రకటన ఇచ్చేబదులు ఒక వంద యూట్యూబ్‌ ఛానళ్లకు ఇవ్వడం ప్రయోజనకం అనే విధంగా మారింది. బహుళజాతి సంస్థలు కూడా తమ యాడ్‌ బడ్జెట్‌లో డిజిటల్‌ మీడియాకూ వాటా కేటాయిస్తున్నారు. ఈ మేరకు ప్రధాన స్రవంతి ఛానళ్లకు, పత్రికలకు ప్రకటనలు తగ్గుతున్నాయనడంలో సందేహం లేదు. ఇలా ఒకటి కాదు అనేక అంశాల్లో యూట్యూబ్‌ ఛానళ్లు మెయిన్‌ స్ట్రీమ్‌ టివి ఛానళ్లకు పోటీగా మారుతున్నాయి. సవాలును విసురుతున్నాయి. దంతో అవికూడా తమ పంథాను మార్చుకుంటున్నాయి. పెద్దపెద్ద టివి ఛానళ్లు తమ ఛానళ్లను శాటిలైట్‌ ద్వారా మాత్రమే కాదు యూట్యూబ్‌ ద్వారానూ ప్రసారం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వార్తలను చిన్నచిన్న బిట్లుగా విభజించి యూట్యూబ్‌లో పోస్టు చేస్తున్నాయి. ఈ పని కోసం ఒక్కో ఛానల్‌లో 30 నుంచి 50 మంది దాకా పని చేస్తున్నారు.

యూట్యూబ్ ఛానళ్ల వల్ల ప్రభుత్వానికి ప్రయోజనమే…

పోనీ, యూట్యూబ్ ఛానళ్లు, వెబ్‌సైట్‌ల వల్ల ప్రభుత్వాలకు ప్రయోజనం లేదా? అంటే ఒప్పుకోని వారి శాతమే ఎక్కువ. ప్రధానమంత్రి దగ్గర నుంచి గ్రామ స్థాయి సర్పంచ్ వరకూ అందరూ ఇవాళ, రేపు ‘న్యూ మీడియా’ మీదే ఆధారపడుతున్నారు. చివరికి ఎన్నికల సమయంలో ఇదే మాధ్యమాన్ని వాడుకుని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు అనేకం చేస్తున్నారు. కానీ, ఆ మీడియాను గుర్తించే విషయానికి వచ్చేసరికి మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. వీటి వల్ల మనకు ప్రయోజనం ఏమిటన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ రాష్ట్రం విషయానికే వస్తే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక, కేవలం ఆయనకు అనుకూలంగా ఆవిర్భవించిన యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య రమారమి 1200. అంటే ఆయా ఛానళ్లన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సాధారణ ప్రజల్లోకి తీసుకువెళ్తున్నవే కదా?

యూట్యూబ్‌ ఛానళ్లకు ఆదరణ పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ ఫోన్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్‌ ఛార్జీలు భారీగా తగ్గడం; ఎక్కడ ఉన్నా సెల్‌ ద్వారా టివి చూసే అవకాశం ఏర్పడటంతో యూట్యూబ్‌ ఛానళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇక జర్నలిస్టులకూ పెద్ద భరోసా ఇస్తోంది యూట్యూబ్‌. పెన్నులో సత్తా ఉన్న ఏ జర్నలిస్టు అయినా సొంతంగా టీవీ ఛానలో, వెబ్‌సైటో పెట్టుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోగల అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. చాలామంది సీనియర్‌ జర్నలిస్టులు ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు ప్రారంభిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జర్నలిస్టులకూ డిజిటల్‌ మీడియా అనూహ్య వరంగా మారింది. ఉద్యోగం కోసం యాజమాన్యాలను దేబరించాల్సిన అవసరం లేకుండాపోతోంది. ఉద్యోగం పోతే ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఇప్పుడు లేదు. నీ ఛానల్‌లో తీసేస్తే నేనే సొంతంగా ఛానల్‌ పెట్టేస్తా అనేంత ధీమా ఇస్తోంది యూట్యూబ్‌. అందుకు యూట్యూబ్‌కు జర్నలిస్టులంతా ధన్యవాదాలు చెప్పాలి. ఒకటి మాత్రం నిజం భవిష్యత్తు డిజిటల్‌ మీడియాదే. యూట్యూబ్‌ ఛానళ్లదే. వెబ్‌సైట్లదే.

తమ ఛానళ్లను ప్రభుత్వం గుర్తిచాలన్న డిమాండ్‌ కూడా ఎన్నాళ్ల నుంచో తెలుగు రాష్ట్రాలకు చెందిన యూట్యూబ్‌ ఛానళ్ల నిర్వాహకుల నుంచి వస్తోంది. దేశంలో సమాచార, ప్రసార శాఖ స్పందించిన తీరులో కూడా తెలుగు రాష్ట్రాలు స్పందించకపోవడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. హైకోర్టు ఆదేశించిందని కాదు గానీ, యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లకూ గుర్తింపు ఇవ్వడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం అయితే ముంచుకొస్తున్నమాట వాస్తవం.

యూట్యూబ్ ఛానళ్లను నిర్వహిస్తున్న వారేమీ జూనియర్లో, సాధారణ జర్నలిస్టులో కాదన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. పది పదిహేనేళ్లు ఏదో మీడియాలో పనిచేసి ఆయా సంస్థల్లో పనివత్తిడి, వ్యాపారం టార్గెట్లు తట్టుకోలేని వారే సొంతంగా స్థిరపడేందుకు పత్రికలు, వెబ్‌సైట్‌లు నిర్వహించి స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పదేళ్లు అనుభవం ఉన్న జర్నలిస్టులకు ఫ్రీలాన్సర్లుగా అక్రిడిటేషన్లు జారీచేస్తున్న నిబంధనలు ఉన్న సమాచార, పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్లు నిర్వహిస్తున్న ‘న్యూ మీడియా’ను గుర్తించడంలో వెనుకంజ ఎందుకు వేస్తుందో అర్ధం కావడం లేదు.