న్యూఢిల్లీ, నవంబర్ 21 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ గాంధీన‌గ‌ర్‌లోని పండిత దీన్‌ద‌యాళ్ పెట్రోలియం విశ్వ‌విద్యాల‌యం 8వ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి 45 మెగావాట్ల ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యంగ‌ల మొనో క్రిస్ట‌లీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్‌, నీటి సాంకేతిక ప‌రిజ్ఞ‌నానికి సంబంధించి సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సుకు శంకుస్థాప‌న చేశారు. ఇన్నోవేష‌న్‌, ఇంక్యుబేష‌న్ సెంట‌ర్‌, టెక్నాల‌జీ బిజినెస్ ఇంక్యుబేష‌న్‌, ట్రాన్స్‌లేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్‌, యూనివ‌ర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. స్నాత‌కోత్స‌వం సంద‌ర్భంగా విద్యార్ధుల‌నుద్దేశించి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌పంచం మొత్తం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద‌శ‌లో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌డం అంత సుల‌భ‌మైన విష‌యం కాద‌ని, అయితే విద్యార్ధుల సామ‌ర్ధ్యం ఈ స‌వాలును మించిన‌ద‌ని ఆయ‌న అన్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంధ‌న రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్న ద‌శ‌లో విద్యార్ధులు ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెడుతున్నార‌న్నారు. ఈ ర‌కంగా దేశంలో ఇంధ‌న‌రంగానికి అద్భుత‌మైన అభివృద్ధికి అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం దేశం 30 నుంచి 25 శాతం కార్బ‌న్ ఫుట్‌ప్రింట్‌ను త‌గ్గించే ల‌క్ష్యంతో ముందుకు పోతున్న‌ద‌ని అన్నారు.

అలాగే ఈ ద‌శాబ్దంలో ఇంధ‌న రంగంలో స‌హ‌జ‌వాయు వాటాను నాలుగు రెట్లు పెంచేందుకు కృషి జ‌రుగుతున్న‌ట్టు చెప్పారు. రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో చ‌మురు రిఫైనింగ్ సామ‌ర్ధ్యాన్ని రెట్టింపు చేసే కృషి జ‌రుగుతున్న‌ద‌న్నారు. ఇంధ‌న భ‌ద్ర‌త సంబంధింత స్టార్ట‌ప్ వాతావ‌ర‌ణాన్ని బ‌లోపేతం చేయ‌డం జ‌రుగుతుంద‌ని, ఇందుకు విద్యార్ధులు, ప్రొఫెష‌న‌ల్స్‌కు ఫండ్ కేటాయించిన‌ట్టు ప్ర‌ధాని తెలిపారు. విద్యార్ధులు జీవితానికి సార్ధ‌క‌త ఉండేలా చూసుకోవాల‌న్నారు. విజ‌యవంత‌మైన వ్య‌క్తులకు స‌మ‌స్య‌లు లేవ‌ని కాద‌ని, స‌వాళ్ల‌ను స్వీక‌రించి వాటితో త‌ల‌ప‌డి , వాటిని ఓడించి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన వారు మాత్ర‌మే విజ‌యం సాధించ‌గ‌లుగుతార‌ని అన్నారు.

స‌వాళ్ల‌ను స్వీక‌రించిన‌వారు ఆ త‌ర్వాత జీవితంలో విజ‌యం సాధిస్తార‌న్నారు. 1922-47 మ‌ధ్య కాల‌పు యువ‌త దేశ స్వాతంత్ర్యం కోసం త‌మ సర్వ‌స్వం త్యాగం చేశార‌ని ఆయ‌న అన్నారు. విద్యార్ధులు దేశం కోసం పాటుప‌డాల‌ని, ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ఉద్య‌మంలో విద్యార్ధులు చేతులు క‌ల‌పాల‌ని ఒక‌రక‌మైన బాధ్య‌త‌ను అభివృద్ధి చేయాల‌ని ఆయ‌న అన్నారు. బాధ్య‌త‌లోనే విజ‌యానికి బీజం ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఆ బాధ్య‌త‌ను జీవిత ప్ర‌యోజ‌నాల దిశ‌గా మార్చాల‌న్నారు. భారాన్ని మోస్తున్న‌ట్టు జీవితం గ‌డిపేవారు విఫ‌లురౌతార‌న్నారు. బాధ్య‌త‌తో వ్వవ‌హ‌రించ‌డం వ్య‌క్తి జీవితంలో అవ‌కాశాల‌ను ఇస్తుంద‌న్నారు.

ఇండియా ఎన్నో రంగాల‌లో ముందుకు పొతున్న‌ద‌ని, యువ గ్రాడ్యుయేట్లు నిబ‌ద్ధ‌త‌తో ముందుకు క‌ద‌లాల‌ని ఆయ‌న అన్నారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ప్ర‌కృతిని ప‌రిర‌క్షించాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి ఆయ‌న నొక్కి చెప్పారు. ప్ర‌స్తుత త‌రం, 21 వ శ‌తాబ్ద‌పు యువ‌త గ‌త స‌మ‌స్య‌లు వైఫ‌ల్యాల‌ను ప‌క్క‌న‌పెట్టి మంచి మ‌న‌సుతో మంచి ఉద్దేశంతో ముందుకు క‌ద‌లాల‌ని అన్నారు. 21 వ శతాబ్దంలో ఇండియా ప‌ట్ల ఎన్నో ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఉన్నాయ‌ని, ఇండియా ఆకాంక్ష‌లు, ఆశ‌లు విద్యార్ధులు, ప్రొఫెష‌నల్స్‌పై ఉన్నాయ‌న్నారు.