అమరావతి, ఆగస్టు 8 (న్యూస్‌టైమ్): ఏపీలో పెరిగిన మద్యం ధరలతో సతమతమవుతున్న మందుబాబులకు శుభవార్త. ఎప్పుడు అమలులోకి వస్తుందో తెలియదు గానీ, ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అమ్మకం ధరలను సమీక్షించాలని చూస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను భారీగా తగ్గించే అవకాశం ఉన్నట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం మద్యం షాపులు తెరుచుకున్న సమయంలో ప్రభుత్వం 75 శాతం ధరలను పెంచి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే, ఎన్నికల ముందు వైసీపీ ఇచ్చిన దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది కాస్త ఇంకో ప్రమాదాన్ని తెచ్చేలా ఉన్నట్టు కనిపించింది. ధరలు పెరగడం, కొన్ని చోట్ల తక్కువ ధరల మద్యం దొరకకపోవడంతో కొంత మంది శానిటైజర్లను తాగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో శానిటైజర్‌ తాగి చాలా మంది మృత్యువాతపడ్డారు. అయితే మద్యం ధరలు అధికంగా ఉన్న కారణంగానే మందు బాబులు శానిటైజర్‌‌ వైపు మొగ్గుచూపుతున్నారని ప్రభుత్వానికి ఆబ్కారీ, పోలీసు అధికారులు సమాచారం అందించారు.

ఇక తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏపీకి మద్యం అక్రమ రవాణా జరుగుతుందని, అందుకే మద్యంపై కనీసం 30 నుంచి 40 శాతం మేర ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకున్న తొలి రోజు అప్పటికి అందుబాటులో ఉన్న అన్ని బ్రాండ్లపై 25 శాతం ధరలను పెంచిన ఏపీ సర్కారు తర్వాతరోజే ఏకంగా మరో 50 శాతాన్ని పెంచింది. దీంతో అప్పటికి ఉన్న అమ్మకం ధరపై మొత్తంగా 75 శాతం భారం పడింది. దీనికి తోడు సేల్ ఎక్కువగా ఉన్న చీప్ లిక్కర్ అందుబాటులో లేకపోవడం, ఖరీదైన బ్రాండ్లు మాత్రమే దొరుకుతుండడంతో తక్కువ ధర మద్యం పేద, సామాన్య వర్గాలకు చెందిన మందుబాబులకు అమృతంలా మారింది. తాజా నిర్ణయంలో భాగంగా ధరను తగ్గిస్తే ఆర్ధిక పరిస్థితి కొంత వరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి.