న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్‌టైమ్): ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఈనెల 19వ తేదీ సాయంత్రం 4.30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా కేర‌ళ‌లోని ప‌లు కీల‌క ప‌ట్ట‌ణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. కేర‌ళ ముఖ్య‌మంత్రి, కేంద్ర విద్యుత్‌, నూత‌న‌, పున‌రుత్పాద‌క ఇంధనం, గృహ‌, పట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌ మంత్రి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు.

పుగ‌లూర్‌-త్రిసూర్ విద్యుత్ ట్రాన్స్‌మిష‌న్ ప్రాజెక్టు:

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ 320 కెవి పుగ‌లూరు (త‌మిళ‌నాడు)- త్రిసూరు (కేర‌ళ‌) విద్యుత్ ట్రాన్స్‌మిష‌న్ ప్రాజెక్టును ప్రారంభించ‌నున్నారు. ఇది వోల్టేజ్ సోర్స్ క‌న్వ‌ర్ట‌ర్ (విఎస్‌సి) ఆధారిత అధిక ఓల్టేజ్ క‌లిగిన‌ డైర‌క్ట్ క‌రంట్ (హెచ్‌విడిసి) ప్రాజెక్టు. ఇది భార‌త‌దేశంలో తొలి హెచ్‌విడిసి అనుసంధాన‌త క‌లిగిన అత్య‌ధునాత‌న విఎస్‌సి టెక్నాల‌జీ ప్రాజెక్టు. దీనిని 5070 కోట్ల‌ రూపాయ‌ల‌తో నిర్మించ‌డం జ‌రిగింది. ఇది 2000 మెగా వాట్ల విద్యుత్‌ను ప‌శ్చిమ ప్రాంతం నుంచి త‌ర‌లించ‌డానికి ఉప‌క‌రిస్తుంది. అలాగే కేర‌ళ ప్ర‌జ‌ల కోసం లోడ్‌లో వృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విఎస్‌సి ఆధారిత వ్య‌వ‌స్థ హెచ్‌విడిసి ఎక్స్‌ఎల్‌పీఈ (క్రాస్ లింక్‌డ్ పాలీ ఇథ‌లీన్‌) కేబుల్‌తో ఓవ‌ర్‌హెడ్ లైన్సు క‌లిగి ఉంది. ఇంది రైట్ ఆఫ్ వేని, అలాగే సంప్ర‌దాయ హెచ్‌విడిసి వ్య‌వ‌స్థ‌తో పోలిస్తే 35 నుంచి 40 శాతం తక్కువ భూమిని ఉప‌యోగిస్తుంది.

కాస‌ర్‌గోడ్ సౌర విద్యుత్ ప్రాజెక్టు:

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ 50 మెగా వాట్ల కాస‌ర్‌గోడ్ సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టును దేశానికి అంకితం చేయ‌నున్నారు. దీనిని జాతీయ‌ సౌర ఇంధ‌న మిష‌న్ కింద అభివృద్ధి చేశారు. దీనిని కాస‌ర్‌గోడ్ జిల్లాలోని పైవాలికె మీంజా, చిప్పార్ గ్రామాల ప‌రిధిలోని 250 ఎక‌రాల ప్రాంతంలో నెల‌కొల్పారు. కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన సుమారు 280 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో దీనిని నెల‌కొల్పారు.

స‌మీకృత క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌:

తిరువ‌నంత‌పురంలో ఏర్పాటు చేయ‌నున్న స‌మీకృత క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దీనిని 94 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిర్మించ‌నున్నారు. తిరువ‌నంత‌పురం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌కు స్మార్ట్ సొల్యూష‌న్స్ క‌ల్పించ‌డంలో భాగంగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది అత్య‌వ‌స‌ర స‌మ‌యాల‌లో ఉమ్మ‌డి కేంద్రంగా స‌మ‌న్వ‌యంతో కూడిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌నుంది.

స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్ట్‌:

తిరువ‌నంత‌పురంలో స్మార్ట్‌రోడ్స్‌ ప్రాజెక్టుకు ప్ర‌ధాన‌మంత్రి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ ప్రాజెక్టును 427 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్ట‌నున్నారు. తిరువ‌నంత‌పురంలో ప్ర‌స్తుతం ఉన్న 37 కిలోమీట‌ర్ల రోడ్ల‌ను ప్ర‌పంచ‌శ్రేణి రోడ్లుగా స్మార్టు రోడ్లుగా మార్చ‌నున్నారు. దీని కింద రోడ్‌, జంక్ష‌న్‌లను మెరుగు ప‌రిచే చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారు.

అరువిక్క‌ర‌లో నీటిశుద్ధి కేంద్రం:

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మొదీ అరువిక్క‌ర‌లో 75 రోజుకు 75 మిలియ‌న్ లీట‌ర్ల సామ‌ర్ధ్యం గ‌ల నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించ‌నున్నారు. దీనిని అమృత్ ప‌థ‌కం కింద నిర్మించారు. ఇది తిరువనంత‌పురం ప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రాను మెరుగుప‌ర‌చ‌నుంది. అలాగే అరువిక్క‌రలో ఉన్న ప్ర‌స్తుత నీటి శ‌ద్ధ‌ యూనిట్ల మెయింటెనెన్స్ స‌మ‌యంలో న‌గ‌రానికి మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డ‌కుండా చూసేందుకు ఈ కేంద్రం ఉప‌క‌రించ‌నుంది.