‘అమెరికన్‌ గ్రాఫిటీ’ చిత్రంలోని ఆసక్తకరమైన దృశ్యం

హాలీవుడ్‌ సినీ అభిమానులకు ‘స్టార్‌వార్స్‌’, ‘ఇండియానా జోన్స్‌’ సినిమాలు తెలియకుండా ఉండవు. అలాంటి సినిమాలను అందించిన దర్శకుడు ఓ హాస్య చిత్రాన్ని కూడా తీశాడంటే ఆశ్చర్యమే. అతడే జార్జ్‌లూకాస్‌. అతడు తీసిన హాస్యచిత్రం ‘అమెరికన్‌ గ్రాఫిటీ’ 1973 ఆగస్టు 2న విడుదలై అత్యంత లాభదాయకమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 7.77 లక్షల డాలర్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 2000 లక్షల డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. మొదటి సినిమా నిరాశ పరచగా, జార్జిలూకాస్‌ తీసిన ఈ రెండో సినిమా అతడికి ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపింది.

ఆయన అనంతానంత అంబర వీధుల్లో సంబరాలు జరుపుకునే స్వేచ్ఛావిహారి. నక్షత్రాలతో స్నేహహస్తం గ్రహాంతరవాసుతో దోస్తీ… వెండిమబ్బుల్తో సరస సరాగాల సంభాషణం… ఇదీ ఆయన శైలి. సృష్టికి ప్రతిసృష్టి చేయగల సినీ విశ్వామిత్రుడు. ఆయన సృష్టించిన మాయామోహా సినీ జగత్తులో ఎన్నెన్ని వింతలో? ఇంకెన్ని పాలపుంతల పలవరింతలో? ఆయన తీసినవి చిత్రాలా? వేవేల నక్షత్రాల కాంతి ప్రవాహాలు. సీక్వెల్స్‌… ప్రీక్వెల్స్‌ ఎన్ని తీసినా ఇంకా తనివి తీరని దాహాలు.

థియేటర్లలో ప్రేక్షకులను బంధించే పద్మవ్యూహాలు. ప్రపంచ సినిమాని ప్రభావితం చేసే కమనీయ రమణీయ దృశ్యకావ్యాలు. ఇంతటి ఘనచరితను సొంతం చేసుకుని… ఇంకా ఏదో సృష్టించాలనే తపనే తపస్సుగా తన కాల్పనిక ప్రపంచంలో జీవనం సాగిస్తున్న ఆయనే… హాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్‌… ది గ్రేట్‌ క్రియేటర్‌ జార్జ్‌ లుకాస్‌. సిల్వర్‌ స్క్రీన్‌కే కాకుండా షార్ట్‌ ఫిలిమ్స్, టెలివిజన్‌కి స్కీన్ర్‌ రైటర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్, యాక్టర్‌ ఇలా తన కళాత్మక సృజనను నిరూపించుకుంటూ వచ్చారు.

ఒక్కో మైలు రాయి దాటుతూ ఒక్కో మజిలీని చేరుతూ విజయ కేతనాలు ఎగురవేశారు. ఆయన సినిమాలు చిన్నపిల్లలకే కాదు పెద్దలకు కూడా, మనసుకు హాయి తెచ్చే వినోదాన్ని పంచుతుంది. జార్జి లుకాస్‌ పేరు వినగానే హాలీవుడ్‌ సినిమాలతో అంతో ఇంతో పరిచయం ఉన్న ప్రేక్షకుల కళ్లవాకిళ్లలో నక్షత్రాలు నర్తిస్తాయి. గ్రహాంతరవాసులు గర్జిస్తారు. ఆధిపత్య పోరు, అహంకార ధోరణులు గుర్తుకొచ్చి వణికిస్తాయి. స్టార్‌ వార్స్‌ చాలు జార్జ్‌ లుకాస్‌ అమెరికన్‌ సినిమాకే కాదు ప్రపంచ సినిమాకు చేసిన సేవ ఏమిటో తెలుసుకోవడానికి. స్టార్‌ వార్స్‌ సీక్వెల్స్‌…ప్రీక్వెల్స్‌ మనోయవనికపై కదలాడి ఆనంద సాగరంలో మునిగిపోతారంతా. జార్జి లుకాస్‌ సృష్టించిన సినిమాలు సాధారణ సినిమాలు కావు. సినిమా ఖ్యాతిని పెంచే బెంచ్‌ మార్కులు.

ఒకే ఒక్క వ్యక్తిలో ఇంత సృజనా? ఆయన్ని తలచుకుని తలచుకునిసినీ ప్రేమికులు నివ్వెరపోతారు. ఔను మరి జార్జి లుకాస్‌కి సినిమాయే శ్వాస, అహర్నిశలూ అదే ధ్యాస. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ప్రేమ. ఆ పిచ్చి ప్రేమలో రూపొందిన సినిమాలు ఆయన కీర్తిని ఇనుమడింప చేశాయి. గిన్నీస్‌ బుక్‌లో రికార్డ్‌తో అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయి ఎనలేని కీర్తిని తీసుకొచ్చాయి. అంతకు మించి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లలో అభిమానుల్ని సైతం కూడగట్టాయి. సినిమాలే కాకుండా లెక్కకు మించి టీవీ షోలు కూడా నిర్వహించిన అనుభవశాలి ఆయన. స్టార్‌ వార్స్‌ సృష్టికర్తగా ప్రఖ్యాతి గాంచిన జార్జి లుకాస్‌ యూఎస్‌ కాలిఫోర్నియాలోని మోడీస్తోలో 1944 మే 14న జన్మించారు. ఆయన తల్లి డోరతీ ఎలినార్‌.

తండ్రి జార్జి వాల్టన్‌ లుకాస్‌ సీనియర్‌. తండ్రి వారసుడిగా మొదట్లో జార్జ్‌ లుకాస్‌ని జూనియర్‌ లుకాస్‌గా అభివర్ణించేవారు. చిన్నతనంలో లుకాస్‌కి కార్లన్నా, కార్‌రేస్‌ లన్నా అమిత ప్రీతీ. పెద్దయ్యాక రేస్‌ కార్‌ డ్రైవర్‌గా మారాలని ఎన్నో కళలు కన్నారు. అయిత్రే… ఓసారి జరిగిన కార్‌ ప్రమాదం వల్ల ఆయన కలల దారి మళ్లింది. మోడీస్తోలోని జూనియర్‌ కాలేజ్‌లో చదువుతున్న సమయంలో షార్ట్‌ ఫిలిమ్స్‌ మీద అభిరుచి పెరిగింది. దాంతో…అతడి చదువే మరో దిశ వెతుక్కోవాల్సి వచ్చింది. యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియాలో స్కూల్‌ అఫ్‌ సినిమాటిక్‌ ఆర్ట్స్‌లో లుకాస్‌ చేరిపోయారు. 1967లో జార్జి లుకాస్‌ దక్షణ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేశారు. మొదటి నుంచి సినిమాలపై అభిరుచి పెంచుకున్న ఆయన అమెరికన్‌ జొట్రాప్‌ అనే మూవీ స్టూడియోని శాన్‌ ఫ్యాన్సిస్కో కేంద్రంగా ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కోప్పొలతో కలసి జార్జ్‌ లూకాస్‌ స్థాపించారు.

1969 డిసెంబర్‌ 12న ఈ సంస్థ ప్రారంభమైనది. ఈ స్టూడియోలో ఫ్రాన్సిస్‌ ఫోర్డ్‌ కోప్పొల సినిమాలతో పటు జార్జ్‌ లుకాస్‌ సినిమాలు కూడా రూపొందాయి. లుకాస్‌కి ఎంతో పేరు తెచ్చిన స్టార్‌ వార్స్‌ సీరీస్‌లో మొదటి రెండు సినిమాలు టిహెచ్‌ఎక్స్‌ 1138, అమెరికన్‌ గ్రాఫిటీ ఈ స్టూడియోలోనే నిర్మాణాన్ని జరుపుకున్నాయి. ఈ సినిమాలకు లుకాస్‌ రచయిత, దర్శకుడిగా పనిచేశారు. టిహెచ్‌ఎక్స్‌ 1138 సినిమా ఇతివృత్తం జార్జ్‌ లుకాస్‌ దక్షిణ కాలిఫోర్నియా ఫిలిం స్కూల్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు రూపొందించిన షార్ట్‌ ఫిలింకి వెండి తెర రూపం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందినా ఆర్ధికంగా ఆశించిన లాభాలను తీసుకురావడంలో విఫలమైనది. తరువాత చిత్రమైన అమెరికన్‌ గ్రాఫిటీ జార్జ్‌ లుకాస్‌ స్వీయానుభవం నుంచి స్ఫూర్తి పొందిన కధే.

1960లో కాలిఫోర్నియాలోని మోడీస్తోలో యువకుడిగా ఉన్న సమయంలో అనుభవాల సారాన్ని అమెరికన్‌ గ్రాఫిటీగా తెరకి జార్జ్‌ లుకాస్‌ ఎక్కించారు. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని చవిచూడడమే కాకుండా ఉత్తమ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డును సాధించింది. సైన్స్‌ ఫిక్షన్‌ అంటే ప్రాణం ఇచ్చేసే జార్జ్‌ లుకాస్‌ స్టార్‌ వార్స్‌ సీరీస్‌ని సీరియస్‌గా సిల్వర్‌ స్కీన్ర్‌పై చూపించారు. దాంతో, సైన్స్‌ ఫిక్షన్‌ అంటే స్టార్‌ వార్స్‌ అన్న పేరు సుస్థిరపరచుకున్నారు. నక్షత్రాల వీధిలో చాలాదూరం ఓ చోట అంటూ మొదలై 1977లో విడుదలైన స్పేస్‌ ఓపెరా స్టార్‌ వార్స్‌లో అప్పటివరకూ ప్రేక్షకులు ఎరుగని మేజిక్‌ని తెరపై చూపించారు. తళుకులొలికే నక్షత్ర మండలంలోకి అనూహ్యంగా చొచ్చుకువచ్చిన గ్రహాంతరవాసుల ఆధిపత్య పోరుని ఉత్కంఠతో కూడిన సన్నివేశాల బిగితో వీక్షకులకు ఊపిరి ఆడకుండా, కనురెప్పలు వేయకుండా చేసారు జార్జ్‌ లుకాస్‌. ఏ న్యూ హోప్‌ పేరుతో విడుదలైన స్టార్‌ వార్స్‌లో ఆ మొదటి భాగం. వినోద ప్రపంచంలో పెను సంచలనమే సృష్టించింది. ఈ సినిమా నిర్మాణ సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆశ్చర్యకరమైన విజయాన్ని సాధించింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సంపాదించిన సినిమాగా నవ్య చరిత్ర లిఖించింది. అదే సమయంలో ఆరు అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. 1980లో స్టార్‌ వార్స్‌ రెండో భాగం ‘ది ఎంపైర్‌ స్ట్రైక్స్‌ బ్యాక్‌’, 1983లో మూడో భాగంగా ‘రిటర్న్‌ ఆఫ్‌ ది జేడీ’ తీశారు. ఈ సినిమాలో స్టీవెన్‌ స్పిల్‌ బర్గ్‌తో కలసి జార్జ్‌ లుకాస్‌ పనిచేశారు.

ఆ రకంగా ఇద్దరు మేధావుల మేలు కలయికగా ఈ సినిమాని అభివర్ణించవచ్చు. ఈ మూడు భాగాలను కలిపి స్టార్‌ వార్స్‌ ట్రయాలజీగా అభివర్ణిస్తుంటారు. ఈ మూడు భాగాలకన్నా ముందు జరిగిన కథతో ప్రీˆక్వెల్‌ చేయాలనే ఉద్దేశ్యంతో 1999లో ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ వన్‌ ది ఫాంటమ్‌ మీనెస్‌’, 2002లో ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ 2 ఎటాక్‌ ఆఫ్‌ ది క్లోన్స్‌’, 2005లో ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ త్రి రివెంజ్‌ ఆఫ్‌ ది సిత్‌’ పేర్లతో ప్రేక్షకులను రంజింపచేశాయి. మళ్లీ చాన్నాళ్ల తరువాత స్టార్‌ వార్స్‌ ఆరు భాగాల తరువాత జరిగే కథని సీక్వెల్‌గా తీయాలని జార్జ్‌ లుకాస్‌ సంకల్పించారు. అలా స్టార్‌ వార్స్‌ అయిదో భాగంగా 2015లో ‘ది ఫోర్స్‌ అవెకాన్స్‌’ రిలీజ్‌ అయ్యింది. 2016లో ‘రోగ్‌ వన్‌ … ఏ స్టార్‌ వార్స్‌ స్టోరీ’, 2017లో ‘ది లాస్ట్‌ జెడి’ తీశారు. ఇందులో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని అడ్వాన్స్‌ ఐ మాక్స్‌ కెమెరాతో షూట్‌ చేసారని సమాచారం.

2018లో ‘సోలో…ఏ స్టార్‌ వార్స్‌ స్టోరీ’ చిత్రాలు విడుదలయ్యాయి. మొదట్లో వచ్చిన స్టార్‌ వార్స్‌ 7 సినిమాలు కలిపి మొత్తం 7 బిలియన్స్‌ వసూళ్లు రాబట్టిందని, ఇప్పటిదాకా స్టార్‌ వార్స్‌ పేరిట ప్రపంచవ్యాప్తంగా జరిగిన వ్యాపారం అనూహ్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్టార్‌ వార్స్‌ పేరిట పుస్తకాలు, వీడియో గేమ్‌లు లెక్క లేనివి. అంతలా స్టార్‌ వార్స్‌ క్రేజ్‌ సముపార్జించింది. స్టార్‌ వార్స్‌ పేరిట పుస్తకాలు, వీడియో గేమ్‌లు, థీమ్‌ పార్కులు, ఆటవస్తువులు కూడా విపణిని విపరీతంగా శాసించాయి. గిన్నీస్‌ బుక్‌ రికార్డును సైతం స్టార్‌ వార్స్‌ సొంతం చేసుకుంది. అమెరికన్‌ ఫిలిం ఇండస్ట్రీలో సినిమా విజయాలే కాకుండా ఆర్ధిక విజయాల్లోనూ జార్జ్‌ లుకాస్‌ అగ్రస్థానంలో ఉన్నారు. నాలుగు అకాడమీ అవార్డుల కోసం నామినేట్‌ అవడం కూడా ఆయన సాధించిన విజయమే. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌ ఎంపిక చేసిన అత్యధిక వసూళ్లు చేసిన వంద చిత్రాల జాబితాలో కూడా జార్జ్‌ లుకాస్‌ చిత్రాలు ఉండడం ఆయన సృజనకు నిలువెత్తు సాక్ష్యం. జార్జ్‌ లుకాస్‌ హాలీవుడ్‌ కొత్త తరానికి అచ్చొచ్చిన పేరు. జార్జ్‌ లుకాస్‌ 1969లో ప్రఖ్యాత ఫిలిం ఎడిటర్‌ మర్షియా లోయూ గ్రిఫిన్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు 1981లో అమంద లుకాస్‌ని దత్తత తీసుకున్నారు.

కొన్ని మనస్పర్థల కారణంగా 1983లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత లుకాస్‌ మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. 1988లో పుట్టిన కాటీ లుకాస్‌ అనే అమ్మాయిని, 1993లో పుట్టిన జెట్‌ లుకాస్‌ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఈ ముగ్గురు పిల్లలు స్టార్‌ వార్స్‌ .ప్రీక్వెల్‌లో నటించారు. విడాకులు తీసుకున్నప్పటికీ లుకాస్‌ గాయని లిండా రాన్స్టాడ్‌తో రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. 2013లో అమెరికన్‌ వ్యాపార మహిళ మెల్లోడి హాబ్సన్‌ని పునర్వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఎవరెస్టు హాబ్సన్‌ లుకాస్‌ అనే కూతురు ఉంది. లుకాస్‌ ఫిలిమ్, లుకాస్‌ ఆర్ట్స్, అమెరికన్‌ మోషన్‌ పిక్చర్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీ ఇండస్టియ్రల్‌ లైట్‌ అండ్‌ మ్యాజిక్‌ సంస్థలకు జార్జి లుకాస్‌ వ్యవస్థాపకుడు. లుకాస్‌ ఫిలిం సంస్థ 2012లో వాల్ట్‌ డిస్నీ కంపెనీకి అమ్ముడుపోయేదాకా చైర్మన్‌ మరియు సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే, ఇండియానా జోన్స్‌ ఫ్రాంచైజ్‌ కూడా అవసరమైన సేవలు అందించారు. ఆయన అనంతానంత అంబర వీధుల్లో సంబరాలు జరుపుకునే స్వేచ్ఛావిహారి. నక్షత్రాలతో స్నేహహస్తం… గ్రహాంతరవాసుతో దోస్తీ… వెండిమబ్బుల్తో సరస సరాగాల సంభాషణం… ఇదీ ఆయన శైలి. సృష్టికి ప్రతిసృష్టి చేయగల సినీ విశ్వామిత్రుడు. 2005 జూన్‌ 9న అమెరికన్‌ ఫిలిం ఇన్స్టిట్యూట్‌ జార్జ్‌ లుకాస్‌ చిత్ర సీమకు చేసిన సేవలకుగాను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అమెరికన్‌ గ్రాఫిటీ, స్టార్‌ వార్స్‌కి సంబంధించి బెస్ట్‌ డైరెక్టర్, బెస్ట్‌ రైటర్‌ పురస్కారాల కోసం నాలుగుసార్లు లుకాస్‌ అకాడమీ అవార్డులకు నామినేట్‌ అయ్యారు.

1991లో ఇర్వింగ్‌ జి ధల్బర్గ్‌ మెమోరియల్‌ అవార్డు స్వీకరించారు. 2008 సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన వందమంది అమెరికన్లలో ఒకరుగా లుకాస్‌ పేరును డిస్కవరీ ఛానల్‌ ప్రకటించింది. 2013 జులైలో అప్పటి అమెరికా అద్యక్షుడు ఒబామా చేతుల మీదుగా లుకాస్‌ నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్‌ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ఆయనకు లభించింది. 2014 అక్టోబర్‌లో సొసైటీ అఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ టెలివిజన్‌ ఇంజనీర్స్‌ గౌరవ సభ్యత్వాన్ని లుకాస్‌ స్వీకరించారు. 2015 ఆగస్టులో డిస్నీ లెజెండ్‌గా సరికొత్త గుర్తింపునందుకున్నారు.

వెన్నెల వర్షించే వేసవిలో… ఓ రాత్రి డాబా మీద పడుకుని ఓసారి పైకి చూస్తే… ఇంద్రనీల మణులు అద్దుకున్నట్లు నీలాకాశం తళుకులీనుతుంటే… సినీ ప్రేమికులకు జార్జ్‌ లుకాస్‌ తప్పకుండా గుర్తొస్తారు. వింతవింత ఆకారాలతో చిత్రవిచిత్రాలు చేస్తున్న వెండి మబ్బుల్ని చూసినా… ఆయనే గుర్తొస్తారు. హలో చెప్తూ ఆయన సినిమాలు పలకరిస్తాయి. తన మేధస్సును మరింత పదును పెట్టి ఆయన మరిన్ని అద్భుత చిత్రాలు తీయాలని కోరుకోవడం సగటు ప్రేక్షకుడి అత్యాశ కాదేమో?